
బావమరది బావ బతుకు కోరతారంటారు. కానీ, ఇక్కడ సొంత బావమరిది చేతిలోనే బావ హత్యకు గురయ్యాడు. అందుకు కారణం.. ఎత్తు తక్కువ అని తెలిస్తే ఎవరికైనా మతి పోవాల్సిదే. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన ఈ పరువు హత్య(Guntur Honor killing).. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
గుంటూరులో పెళ్ళైన 10 రోజులకే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్(Kurra Ganesh Case)కు, దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవి అనే యువతితో పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే.. గణేష్ పొట్టిగా ఉన్నాడని యువతి తల్లిదండ్రులు సంబంధం వద్దనుకున్నారు. కానీ మొదటి చూపులోనే గణేష్, కీర్తి.. ఒకరినొకరు ఇష్టపడ్డారు.
ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకొని, రోజు ఫోన్ మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు. తాము వివాహం చేసుకుంటామని చెప్పగా.. పెద్దలు అంగీకరించలేదు. దీంతో పది రోజుల కిందట పారిపోయి అమరావతి గుడిలో పెళ్లి చేసుకున్నారు.
అయితే గణేష్ పొట్టిగా ఉన్నాడని కీర్తి సోదరుడు దుర్గారావు అసహ్యం పెంచుకున్నాడు. తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. వివాహం జరిగిన నాడే గణేష్ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు కూడా. దీంతో.. తనకు యువతి కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులను(Nallapadu Police) గణేష్ ఆశ్రయించాడు కూడా. ఈలోపు..
పెళ్లి గుడిలో చేసుకోవడంతో రిసెప్షన్ అయినా గ్రాండ్‌గా చేసుకోవాలని ఆ జంట భావించింది. ఇందుకోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులతో గణేష్ ఇంటికి పయనం అయ్యాడు. దారిలో గణేష్‌ను ఆటకాయించి.. కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు దుర్గారావు. ఆపై దుర్గారావును, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు.
ఇదీ చదవండి: పిల్లనిచ్చిన అత్తతో రొమాన్స్! భార్యకు అడ్డంగా దొరికిపోయి..