సమ్‌థింగ్ స్పెషల్
ఎప్పటి నుంచో కారు కొనాలనే కోరిక నెరివేరినందుకు పుణెకు చెందిన గణేష్ సంగ్డే తెగ సంతోషించాడు. అయితే ఆ సంతోషం అట్టే కాలం నిలవలేదు. సదరు ఆ వాహనం తరచుగా రిపేర్‌లకు వచ్చేది. ఎన్నిసార్లు వెహికిల్ డీలర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో వింత నిరసనకు దిగాడు. రెండు గాడిదలను కారుకి ముందు కట్టి చాలా స్లోగా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. దూరం నుంచి చూసేవాళ్లకు గాడిదలే కారును తీసుకువెళుతున్నట్లుగా కనిపిస్తుంది.
దీనికి తోడు కారుతో పాటు నడుస్తున్న వారు భజంత్రీలు మోగిస్తుంటారు! వాహనానికి ఇరువైపులా బ్యానర్‌లు కట్టి డీలర్‌పై మరాఠీ భాషలో తన నిరసన డైలాగులు రాశాడు గణేష్. గణేష్ సమస్య మాటేమిటోగానీ, ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన గాడిదల కార్ వీడియో వైరల్ అయింది. ‘గాడిదల కారు అని పేరు పెట్టవచ్చు!’ ‘డీలర్‌కు, మీకు మధ్య గొడవలు సరే, మధ్యలో గాడిదలు ఏంచేశాయి?’ ‘గాడిదలను వివాదాల్లోకి లాగడం సరికాదు’... ఇలాంటి కామెంట్స్ కనిపించాయి.


