
గిన్నిస్‌లో గణపయ్యవినాయకుడు దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం. పురాతన కాలం నుంచి వినాయకుడి ఆలయాలు పలు దేశాల్లో ఉన్నాయి. గుజ్జు రూపంలో ఉండే బొజ్జ గణపయ్యను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. విలక్షణంగా కనిపించే వినాయకుని విగ్రహాలు జనాలను అమితంగా ఆకట్టుకుంటాయి. వీథుల్లో వెలిసే మండపాల్లో కనిపించేవిగ్రహాల సంగతి సరే సరి, ‘గిన్నిస్’కెక్కిన వినాయకుడి విగ్రహాల గురించి తెలుసుకుందాం.
అత్యధిక వినాయక విగ్రహాల సేకరణ
అత్యధిక సంఖ్యలో వినాయక విగ్రహాలను సేకరించిన ముంబై మహిళ రమా షా గిన్నిస్ రికార్డు సాధించారు. ముంబైలోని సాయన్ భగినీ సమాజ్ భవనంలో 2014 నవంబర్14న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె తాను సేకరించిన 18,181 వినాయక విగ్రహాలను ప్రదర్శించారు. వీటిలో రకరకాల పరిణామాలకు చెందినవి ఉన్నాయి. రకరకాల ముడిపదార్థాలతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ ప్రదర్శనను సందర్శించి, ఆమెకు సర్టిఫికెట్‌ను బహూకరించారు.
ఆ తర్వాత రెండేళ్లకు 2016 ఆగస్టు 23న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె ఏకంగా 1.50 లక్షల వినాయక విగ్రహాలను ప్రదర్శించి, తన రికార్డును తానే బద్దలు కొట్టారు. గిన్నిస్‌బుక్ ఈ రికార్డును కూడా గుర్తించి, రమా షాకు సర్టిఫికెట్ ఇచ్చింది. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ రికార్డును నమోదు చేసుకుంది. పదకొండేళ్ల వ్యవధిలో ఆమె ఈ విగ్రహాలను సేకరించారు.
కళ్లకు గంతలు కట్టుకుని...
చిన్ననాటి నుంచి కళలపై మక్కువ ఉన్న రమా షా చిత్ర, శిల్ప కళలలో సాధన చేశారు. తన పదిహేడేళ్ల వయసు నుంచి ఆమె మట్టితో వినాయకుడి విగ్రహాలను స్వయంగా తయారు చేయడం మొదలుపెట్టారు.
మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేయడంలో ఆమె సాధన ఎంతటిదంటే, కళ్లు మూసుకుని కూడా సునాయాసంగా విగ్రహాలను తయారు చేయగలరు. కళ్లకు గంతలు కట్టుకుని మరీ వినాయక విగ్రహాల తయారీని ప్రదర్శించి, ముంబై జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పటి వరకు ఆమె 3.78 లక్షల వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేశారు. ఆమె పేరిట ఇప్పటికి ఆరు ప్రపంచ రికార్డులు, పదహారు జాతీయ రికార్డులు ఉన్నాయి.
(చదవండి: ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!)