
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను తనదారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ పై తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ ఇప్పుడు తన దగ్గరున్న మరో అస్త్రం ప్రయోగించారు. భారత్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్‌లో తమ దేశ రాయబారిని మారుస్తూ అకస్మాత్తు నిర్ణయం తీసుకున్నారు.
భారత్- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో ఈ నిర్ణయం కీలకంగా పరిణమంచింది. వైట్ హౌస్‌లో తనకు అత్యంత సన్నిహితుడు, పర్సనల్ డైరెక్టర్ గా ఉన్న సెర్గియో గోర్ ను ట్రంప్ భారతదేశ నూతన రాయబారిగా నియమించారు. చమురు కొనుగోలు తదితర అంశాలలో భారత్ రష్యా బంధం బలపడుతున్న సమయంలో ట్రంప్.. సర్గియోకు నూతన బాధ్యతలు అప్పజెప్పారు. ఈ పదవి ఖాళీ అయిన ఎనిమిది నెలల తర్వాత ఈ తాజా నియామకం జరిగింది.
సెర్గియో గోర్ అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత విధేయునిగా పేరుగాంచాడు. భారత రాయబాది సెర్గియో గోర్ నియామకాన్ని తన ట్రూత్ సోషల్‌లో తెలియజేసిన ట్రంప్ త్వరలోనే ఆయన పరిపాలనా విభాగంలో చేరనున్నారని ప్రకటించారు. సెర్గియో గోర్ దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహించనున్నారు. ఆయనను స్పెషల్ ఎన్వాయ్ ఫర్ సౌత్ సెంట్రల్ ఏసియన్ ఎఫైర్స్‌గా ట్రంప్ నియమించారు. ఆయన భారత్‌కు వెళ్లేంతవరకు వైట్‌హౌస్‌లోనే తన పాత విధులను నిర్వహిస్తారని ట్రంప్ ఆ పోస్ట్ లో తెలియజేశారు.
సెర్గియో తనకు అత్యంత సన్నిహితునిగా ఉన్నారని, చాలా కాలంగా తనకు మద్దుతునిస్తూ, తాను ఎన్నికల్లో గెలిచేందుకు అమితమైన కృషి చేశారని తెలిపారు. అమెరికా అధ్యక్ష సిబ్బందిగా సెర్గియో పాత్ర చాలా కీలకమైనదని ట్రంప్ పేర్కొన్నారు. తాను పాలనలోకి అడుగుపెట్టాక సెర్గియో ఎన్నోమంచి పనులు చేశారన్నారు. ఆయన తన బృందంలో నాలుగువేల మంది దేశ భక్తులను నియమించుకున్నారని,ఫెడరల్ ప్రభుత్వ శాఖల్లోని 95 శాతం ఉద్యోగాలను ఆయన భర్తీ చేశారన్నారు. అతి పెద్ద జనాభా కలిగిన భారత దేశంలో అమెరికా ఎజెండాను పూర్తి చేసేందుకు సెర్గియో తోడ్పడతారని ట్రంప్ పేర్కొన్నారు.