
గతంలో రెండు బ్రేకప్స్ జరిగాయంటోంది బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా (Daisy Shah). అందులో తనను బాగా ఇబ్బంది పెట్టిన రిలేషన్‌షిప్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఓ అబ్బాయితో చాలా ఏళ్లు రిలేషన్‌లో ఉన్నాను. మొదటి నాలుగేళ్ల సమయంలో అసలు పెళ్లి ఆలోచనే రాలేదు. తర్వాత నాకు ఆ ఆలోచనే రాకుండా చేశాడు. ఏడో సంవత్సరంలో ఉండగా.. నేను సంతోషంగా లేనన్న విషయాన్ని గ్రహించి బ్రేకప్ చెప్పాను.
రెండో రిలేషన్‌లో పరిస్థితి మరీ దారుణం. నేనెక్కడికి వెళ్తున్నా?.. అబ్బాయిలతో కలిసి పని చేస్తున్నానా? ఇలా ప్రతీది గుచ్చిగుచ్చి అడిగేవాడు. ఇక్కడ ఆశ్చర్యకర విషయమేంటంటే.. అతడు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒకసారి మేమిద్దరం పార్టీలో ఉన్నాం. ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్నాం. ఇంతలో ఒకరు నా వెనక నుంచి వచ్చి చేయి పట్టుకుని లాగి తనతో డ్యాన్స్ చేయమని అడిగాడు.
నా తప్పేముంది?
అందులో తప్పేముంది? దానికి నాపై కోప్పడాల్సిన అవసరం లేదుకదా! కానీ అతడు మాత్రం వేరే అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ తనను అర్థం చేసుకోమన్నాడు. అతడి పద్ధతి నాకు చిరాకు తెప్పించేది. నన్నెప్పుడూ కంట్రోల్ చేయాలని చూసేవాడు. దానివల్ల మరింత ఫ్రస్టేట్ అయ్యేదాన్ని. బలమైన అమ్మాయిలను చూసి మగవాళ్లు అస్సలు ఓర్వలేరు. అలాంటివాళ్లను చాలామందిని చూశాను. ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదు. పైగా నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నా పోషణ కోసం ఒక మగవాడి తోడు అవసరం లేదు. అయితే నా స్నేహితురాలి సలహాతో అండాలు భద్రపరిచాను అని చెప్పుకొచ్చింది.
కెరీర్
డైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. భద్ర అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. సల్మాన్ ఖాన్‌తో చేసిన 'జై హో' మూవీతో మంచి గుర్తింపు అందుకుంది. ఈమె చివరగా మిస్టరీ ఆఫ్ ద టాటూ మూవీ చేసింది. గతేడాది వచ్చిన రెడ్ రూమ్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. మరో రెండు రోజుల్లో (ఆగస్టు 25న) డైసీ షా 41వ వయసులోకి అడుగుపెట్టనుంది.