
సోషల్ మీడియాను మంచికన్నా చెడుకే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న నటులు చనిపోయారంటూ ఫేక్ వదంతులు సృష్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రజా మురద్ (Actor Raza Murad) గురించి ఇటువంటి ఫేక్ ప్రచారం చేపట్టారు. యాక్టర్ చనిపోయాడని ప్రకటిస్తూ నివాళులు అర్పించారు. సదరు పోస్ట్‌పై రజా మురద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు తాను బతికున్నానని నిరూపించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అసత్య ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీరియస్ మ్యాటర్
రజా మురద్ మాట్లాడుతూ.. నేను ఇంకా బతికున్నందుకు కొందరు చాలా బాధపడుతున్నారు. కారణమేంటో నాకర్థం కావట్లేదు. ఏకంగా నేను చనిపోయానంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు పనిచేశానని, కానీ నన్ను స్మరించుకోవడానికి కూడా ఎవరూ లేరని రాశారు. నా పుట్టినరోజు, అలాగే ఫేక్ డెత్ డెట్ కూడా ఆ పోస్ట్‌లో జత చేశారు. ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. చాలా సీరియస్.
చెప్పీచెప్పీ గొంతెండిపోయింది
నేను బతికే ఉన్నానని చెప్పీచెప్పీ నా గొంతు, నాలుక, పెదాలు తడారిపోయాయి. చనిపోయానన్న వార్త అంతటా వైరలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి నాకు ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి వదంతి సృష్టించినవారిది వక్రబుద్ధి అయి ఉండాలి. జీవితంలో ఏదీ సాధించడం చేతకాక ఇలాంటి నీచపు పనులు చేసి ఆనందిస్తున్నాడు. కొంచెమైనా సిగ్గుండాలి! పోలీసులు ఆ దుర్మార్గుడిని పట్టుకుంటానని హామీ ఇచ్చారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక చాలు
బతికుండగా ఎవరినీ చంపొద్దు.. ఇలాంటివి ఇకనైనా ఆపేయండి. నాగురించి మాత్రమే చెప్పడం లేదు. చాలామంది సెలబ్రిటీలను ఇలాగే సోషల్ మీడియాలో చంపేస్తున్నారు. అది పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. రజా మురద్.. జోధా అక్బర్, గోలియాకీ రాస్‌లీల రామ్‌లీల, బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. బుల్లితెరపై మేఘ బర్సేంగె సీరియల్‌లో నటించాడు.