
మన జీవితంలో మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అలాగే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా మనల్ని ద్వేషించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే మనల్ని ఇష్టపడేవాళ్ళకు దగ్గరగా ఉండాలనుకుంటాం. అయితే అదే ఇష్టం ఎక్కువై, ఆ ఇష్టం మనకి కష్టం తెచ్చిపెడితే ఎలా ఉంటుంది? అన్న సున్నితమైన పాయింట్‌తో తీసిన ఓ భావోద్వేగంతో కూడిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘మామన్’.
ఓటీటీలో సూపర్ హిట్ మూవీ
ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రశాంత్ పాండ్యరాజన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్. అలా అని దీంట్లో పెద్ద స్టార్, గ్లామర్ యాక్షన్ ఇటువంటివి ఏమీ లేకపోయినా సినిమా చూస్తున్నంతసేపు సీటులోంచి కదలలేరు. అంతలా కట్టిపడేస్తుంది. ప్రముఖ తమిళ కమెడియన్ సూరి కథానాయకుడిగా ఈ సినిమాలో నటించి, మెప్పించారు. ఇంకా చెప్పాలంటే సినిమా చూసే ప్రేక్షకుల మనస్సులను కదిలించారు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం (Maaman Movie Review).
కథ
‘మామన్’ సినిమా కథ ప్రకారం తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముళ్ళు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది.
ఎలా ఉందంటే?
అక్క బిడ్డా లేక తనకు పుట్టబోయే బిడ్డా అన్న సంఘర్షణలో కథ ఏ మలుపు తిరుగుతుందో సినిమాలోనే చూడాలి. చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో భావుకతతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టనీయకుండా చక్కటి స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపిన విధానం నిజంగా అభినందనీయం. ఈ భూమ్మీద భావావేశాలున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఈ సినిమాలో ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు, చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆఖరుగా ‘మామన్’ మామూలు సినిమా అయితే కాదు. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.
– హరికృష్ణ ఇంటూరు