
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ 75 ఇండియా(పీ–75ఐ)కింద ఆరు అత్యాధునిక జలాంతర్గాములను సమకూర్చుకునేందుకు జర్మనీతో చర్చలు జరిపేందుకు రక్షణ శాఖకు అనుమతి మంజూరు చేసింది. జాతీయ భద్రతా విభాగం, రక్షణ శాఖ అధికారుల మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జర్మనీ సంస్థతో ఈ నెలాఖరులోనే చర్చలు మొదలయ్యే అవకాశా లున్నాయని సమాచారం.
కొత్తగా సమకూర్చుకునే ఆరు సబ్‌మెరీన్లలో ఎయిర్ ఇండిపెండెంట్ పొపల్షన్(ఏఐపీ)వ్యవస్థలుంటాయి. దీనివల్ల ఈ జలాంతర్గాములు కనీసం మూడు వారాలపాటు నీటి అడుగునే ఉండే సామర్థ్యముంటుంది. జర్మనీ సంస్థతో సంప్రదింపులను 8 నెలల్లో పూర్తి చేసి, ఒప్పందం ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
రక్షణ శాఖ, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్)లు నిర్మించతలపెట్టిన తరువాతి తరం సబ్‌మెరీన్లకు ఏఐపీ సాంకేతికతే కీలకం. జర్మన్ సంస్థ నుంచి అందే ఈ సాంకేతికతతో దేశీయంగా సబ్‌మెరీన్లను డిజైన్ చేసుకుని, నిర్మించనున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక అవసరాల రీత్యా ఇటువంటి జలాంతర్గాముల అవసరం ఎంతో ఉందని నిపుణులు అంటున్నారు. వచ్చే పదేళ్లలో నేవీ నుంచి కనీసం పది పాతబడిన జలాంతర్గాములను విధుల నుంచి తప్పించే అవకాశముంది.