
వన్డే వరల్డ్‌కప్-2027 వరకు టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఆటలో కొనసాగుతారా?.. ఈ ఇద్దరి పేర్లను మెగా ఐసీసీ టోర్నీకి బీసీసీఐ (BCCI) సెలక్టర్లు పరిగణిస్తున్నారా? లేదా?.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదో హాట్‌టాపిక్.
ఇటీవల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి విరాట్, రోహిత్ పేర్లు మాయంకావడం.. ఆ తర్వాత తప్పును సరిదిద్దుకున్న ఐసీసీ మళ్లీ వారి పేర్లను చేర్చడం.. వన్డే రిటైర్మెంట్ వార్తలకు ఊతమిచ్చింది. ఇలాంటి తరుణంలో విరాట్, రోహిత్.. ఇద్దరూ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టడం ద్వారా వదంతులకు చెక్ పెట్టేశారు.
లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌కు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. కాగా ప్రస్తుతం లండన్‌లో ఉన్న విరాట్ కోహ్లి.. తాజాగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేయడం విశేషం. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ దాదాపు రెండు గంటల పాటు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం.
స్పిన్, పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ... వైవిధ్యభరితమైన షాట్లు ఆడుతూ కోహ్లి తన ప్రాక్టీస్ సెషన్‌ను పూర్తిచేసినట్లు తెలిసింది. ఇక ప్రాక్టీస్‌కు వెళ్లిన సమయంలో లార్డ్స్ స్టేడియంలో అభిమానులతో కలిసి కోహ్లి ఫొటోలకు ఫోజులిచ్చాడు.

భారత్-ఎ తరఫున
మరోవైపు.. రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. మరో అనూహ్య నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో స్వదేశంలో జరుగబోయే అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్-ఎ తరఫున ఆడాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పగా.. ఆ వెంటనే కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఈ ఇద్దరూ వన్డేల్లో మాత్రం కొనసాగుతామని స్పష్టం చేశారు.
ఆసీస్ సిరీస్‌తో కోహ్లి, రోహిత్ రీ ఎంట్రీ
ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ టీమిండియా పగ్గాలు చేపట్టారు. గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసిన భారత్.. తదుపరి యూఏఈ వేదికగా సూర్య కెప్టెన్సీలో ఆసియా టీ20 కప్-2025 టోర్నీ ఆడనుంది.
సెప్టెంబరు 9-28 వరకు జరిగే ఈ ఖండాంతర టోర్నీ అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులు ఆడుతుంది భారత జట్టు. ఆ తర్వాత అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది.
చదవండి: Asia Cup 2025: అదొక వింత నిర్ణయం.. కెప్టెన్ అయ్యే ప్లేయర్‌ను జట్టు నుంచి తీసేస్తారా?
రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్‌మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు