
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా టూర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత రో-కో ద్వయం ఇప్పటివరకు భారత తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే వన్డే ప్రపంచకప్-2027 దృష్ట్యా వీరిద్దరి స్ధానాల్లో యువ ఆటగాళ్లను బీసీసీఐ సిద్దం చేయనుందని, అక్టోబర్‌లో ఆసీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీసే ఆఖరిదని ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ సీనియర్ ద్వయం రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ (BCCI ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్సే అని అతడు కొట్టిపారేశారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ వైట్ బాల్ క్రికెట్‌లోకి తిరిగొచ్చేందుకు తమ ట్రైనింగ్‌ను తిరిగి ప్రారంభించారు. కాగా రాజీవ్ శుక్లా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో శుక్లాను సచిన్ టెండూల్కర్‌లాగానే రోహిత్, కోహ్లిలకు ప్రత్యేకంగా ఫేర్‌వెల్ నిర్వహిస్తారా ? అని హోస్ట్ ప్రశ్నించాడు.
"రోహిత్, కోహ్లి ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు. వారిద్దరూ ఇంకా వన్డేలు ఆడుతున్నారు. వారు ప్రస్తుతం కేవలం రెండు ఫార్మాట్ల నుంచి మాత్రమే తప్పుకొన్నారు. మరో ఫార్మాట్‌లో ఆడుతున్నప్పుడు మీరెందుకు వారి ఫేర్‌వెల్ గురుంచి మాట్లాడుతున్నారు? వారి రిటైర్‌మెంట్ గురించి మీరంతా ఎందుకు ఆందోళన చెందుతున్నారు? బీసీసీఐకి ఒక పాలసీ ఉంటుంది.
బీసీసీఐ ఎవరిని కూడా రిటైర్‌మెంట్ ఇవ్వమని అడగదు. వారే సొంతంగా తమ నిర్ణయాలు తీసుకోవాలి. ప్లేయర్ తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము. ఆటగాళ్లు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మాకు తెలుసు. కానీ ఇదంతా ఇప్పుడు అనవసరం.
విరాట్ కోహ్లి చాలా ఫిట్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా బాగా ఆడుతున్నాడు. కాబట్టి వారి ఫేర్‌వెల్ గురుంచి ఆలోచిండం ఆపయేండి" అని శుక్లా పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.
చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం