
చెన్నై: తమిళనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. 2026లో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే దీనికి ప్రధాన కారణం. తమిళ అగ్ర నటుడు విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తమిళగా వెట్రి కజగం (టీవీకే) పోటీ చేస్తుందని ప్రకటించిన దరిమిలా తమిళనాట ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో విజయ్ ప్రత్యర్థిగా భావిస్తున్న మరో తమిళ హీరో అజిత్ కుమార్ రాజకీయ ప్రవేశంపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి.
అజిత్ రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2016లో మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత మరణించాక అజిత్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన పలు వార్తలు వినిపించాయి. నాడు జయలలిత తన పార్టీ ఏఐడీఎంకేలోకి అజిత్ తన వారసునిగా రావాలని కోరుకుంటున్నారనే వార్తలు వ్యాపించాయి. దీనికి సంబంధించి, స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, అజిత్ ఈ విషయమై ఎప్పుడూ ఏమీ మాట్లాడకపోయినప్పటికీ ఈ ఊహాగానాలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత నాడు ఒక నటునిపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, ఒక జర్నలిస్టు ముందు మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అవే వాదనలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అయితే అజిత్ తనకు రాజకీయరంగంపై ఆసక్తి ఉన్నట్లు ఏనాడూ ప్రకటించలేదు. కాగా జర్నలిస్టు, జయలలిత సన్నిహితుడు అయిన కాలచక్రం నరసింహ నాడు జయలలితతో సాగించిన సంభాషణకు సంబంధించిన వీడియో ఈ చర్చను తిరగతోడుతోంది.
ఆ వీడియోలో నరసింహ.. ‘ఆమె(జయలిత) తమిళ సినిమాకు చెందిన ఒక నటుడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. అతని హుందా ప్రవర్తన, నిజాయితీ, ప్రజలతో కలిసిపోయే తీరు గురించి ప్రస్తావించారు. అయితే ఆ నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆసక్తి కలిగి ఉన్నాడో లేదో ఆమెకు ఖచ్చితంగా తెలియకపోయినా, తమ పార్టీలో చేరేందుకు ఆయన సరైన వ్యక్తి అని ఆమె చెప్పారు. వారసత్వం అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె అజిత్ పేరును నేరుగా పేర్కొన లేదు. అయితే అభిమానులు ఆ నటుడు అజయ్ అని స్పష్టంగా చెబుతుంటారు.
ఈ అంశంపై అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తుంటారు. ఒక అభిమాని ‘అజిత్ సర్ 2029 లేదా 2030లో రాజకీయాల్లోకి వస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు.. నా మాటలు నిజం అవుతాయి’ అని పేర్కొనగా, మరొకరు, ‘రాజకీయాలను దగ్గరగా చూస్తే.. ఎవరికైనా ఇది నిజం అని అనిపిస్తుంది’ అని రాశారు. ఇంకొకరు ‘అతను ఏఐడీఎంకేను నడిపించేందుకు సరైన వ్యక్తి అయ్యేవాడు’ అని అభిప్రాయపడ్డారు. అయితే అజిత్ ఇప్పటివరకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం అజిత్ నటనతో పాటు, తనకెంతో ఇష్టమైన మోటార్ రేసింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలు సినీరంగంలో ముడిపడి కనిపిస్తాయి. సిఎన్ అన్నాదురై నుండి ఎం.జి. రామచంద్రన్, జయలలిత వరకు.. అందరూ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నారు. కమల్ హాసన్ కూడా ‘మక్కల్ నీది మయ్యమ్’ తో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.