
పరిమాణాన్ని తగ్గించుకుంటున్న కంపెనీలు
జాబితాలో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్, ఏథర్ ఎనర్జీ
ష్లాస్ బెంగళూరు, మొబిక్విక్, ఎన్‌ఎస్‌డీఎల్
మార్కెట్ల అనిశ్చితి, పలు పెట్టుబడి అవకాశాల ఎఫెక్ట్
ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి. సెకండరీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెట్టుబడులకు పలు అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం అంతగా ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత కేలండర్ ఏడాది (2025)లో పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యూ కడుతున్నాయి.
ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి. అనుమతులు సైతం పొందుతున్నాయి. అయితే జనవరి మొదలు ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు సుంకాలను విధిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా భారత్ ఎగుమతులపై ఇటీవల 50 శాతంవరకూ టారిఫ్‌లను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు.
యూఎస్ టారిఫ్‌ల కారణంగా సముద్ర ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్, లెదర్, జ్యువెలరీ, కెమికల్స్ తదితర పలు రంగాలు ప్రభావితంకావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మాపై సైతం సుంకాలు విధించే వీలున్నట్లు ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలోనే సాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వీటికితోడు దేశీ కంపెనీల ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సైతం దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించదలచిన నిధుల పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి.
పునరాలోచనలో..
ఈ ఏడాది జనవరి నుంచి పలు కంపెనీలు లిస్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నప్పటికీ సమీకరించతలపెట్టిన నిధుల పరిమాణంలో కోత పెట్టుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెరసి 2025లో ఇప్పటివరకూ సుమారు 15 కంపెనీలు ఇష్యూల పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ జాబితాలో ఇటీవల లిస్టయిన దిగ్గజాలు ఎన్‌ఎస్‌డీఎల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌సహా.. ఏథర్ ఎనర్జీ, ఎస్‌కే ఫైనాన్స్, బ్లూస్టోన్, మొబిక్విక్, ష్లాస్ బెంగళూరు(లీలా హోటల్స్), ఇండిక్యూబ్, అర్బన్ కంపెనీ, స్మార్ట్ వర్క్స్, స్వస్తికా ఇన్‌ఫ్రా తదితరాలు చేరాయి.
48 కంపెనీల లిస్టింగ్
ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ 48 కంపెనీలు ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. తద్వారా రూ. 64,135 కోట్లు సమకూర్చుకున్నాయి. అంతక్రితం ఏడాది అంటే 2024లో 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఏకంగా రూ. 1,67,535 కోట్లు(19.5 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ పలు దిగ్గజాలు లిస్టింగ్ బాటలో సాగనున్నాయి.
పలు అవకాశాలు
ప్రైమరీ మార్కెట్లలో కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్‌ఎంఈ) సైతం సందడి చేస్తున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్, బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పలు చిన్న కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు కొద్ది నెలలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణీయ రిటర్నులు ఇవ్వడం, రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌ల ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్‌ల సిప్ పథకాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మెయిన్ బోర్డ్ ప్రైమరీ మార్కెట్లో కొన్ని ఇష్యూలు మాత్రమే లిస్టింగ్‌లోనూ విజయవంతమవుతున్నట్లు వివరించారు.
వెనకడుగు తీరిదీ...
వివిధ ప్రతికూలతల కారణంగా తొలుత వేసిన ప్రణాళికలను సవరిస్తూ కొన్ని కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణ పరిమాణంలో కోత పెడుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రూ. 4,000 కోట్ల విలువను రూ. 3,600 కోట్లకు సవరించగా.. ఏథర్ ఎనర్జీ రూ. 3,100 కోట్ల నుంచి రూ. 2,626 కోట్లకు తగ్గించుకుంది. ఈ బాటలో ఎస్‌కే ఫైనాన్స్ రూ. 2,200 కోట్లస్థానే రూ. 1,600 కోట్లు మాత్రమే సమీకరించగా.. బ్లూస్టోన్ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 820 కోట్లకు వెనకడుగు వేసింది. లీలా హోటల్స్ రూ. 5,000 కోట్ల ప్రణాళికను రూ. 3,000 కోట్లకు కుదిస్తే.. మొబిక్విక్ రూ. 1,900 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు భారీగా కోత పెట్టుకుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్