అన్‌లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అనేది ప్రస్తుతం ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందుతున్న అంశం. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాకముందే తక్కువ ధరకు ఈ కంపెనీల షేర్లు కొని, ఐపీఓ ద్వారా మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత అధిక లాభాలు సంపాదించవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అయితే, మెరిసేదంతా బంగారం కాదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సెబీ సైతం అన్‌రెగ్యులేటెడ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేముందు కొన్ని కీలక విషయాలను తెలుసుకోవడం అత్యవసరం.
‘గ్రే మార్కెట్’ ఉచ్చులో పడకండి!
అన్‌లిస్టెడ్ షేర్లు సాధారణంగా అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లభించవు. వీటిని ‘గ్రే మార్కెట్’ లేదా కొన్ని ప్రైవేట్ యాప్స్ ద్వారా విక్రయిస్తుంటారు. అయితే, వీటిలో ధరను పారదర్శకంగా నిర్ణయించరనే వాదనలున్నాయి. ఒక యాప్‌లో ఒక ధర ఉంటే, మరో చోట మరో ధర ఉండే అవకాశం ఉంది. సెబీ ఇప్పటికే ఇలాంటి అనధికారిక ప్లాట్‌ఫామ్‌ల పట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఎంత లాభం ఉందో అంతే రిస్క్ కూడా ఉందని గమనించాలి.
అన్‌లిస్టెడ్ కంపెనీలు అంటే ఏమిటి?
స్టాక్ ఎక్స్ఛేంజీలు (NSE, BSE)లో నమోదు కాని కంపెనీలను అన్‌లిస్టెడ్ కంపెనీలు అంటారు. ఇవి సాధారణంగా స్టార్టప్‌లు కావచ్చు లేదా పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న పెద్ద కంపెనీలు కావచ్చు. వీటి షేర్లను ‘ప్రీ-ఐపీఓ (Pre-IPO) షేర్లు’ అని కూడా అంటారు.
ఎలా పెట్టుబడి పెడుతారంటే..
అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో షేర్లు కొనడానికి నేరుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు ఉండవు. దీనికోసం కొన్ని మార్గాలను అనుసరిస్తారు. ప్రస్తుతం అన్‌లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ కోసం Precise, UnlistedZone, Altius Investech.. వంటి చాలా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది స్టాక్ బ్రోకర్లు పర్సనలైజ్డ్ సర్వీసుల ద్వారా అన్‌లిస్టెడ్ షేర్లను విక్రయిస్తుంటారు. ఇంకో మార్గం ఏమిటంటే.. కంపెనీ ఉద్యోగులు తమకు వచ్చిన షేర్లను బయటి వ్యక్తులకు విక్రయించినప్పుడు వాటిని కొనుగోలు చేయవచ్చు.
ఇన్వెస్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లిస్టెడ్ షేర్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. కానీ అన్‌లిస్టెడ్ షేర్లకు కొనుగోలుదారులు దొరకడం కష్టం. మీరు అత్యవసరంగా అమ్మాలనుకున్నప్పుడు అవి అమ్ముడుపోకపోవచ్చు.
లిస్టెడ్ కంపెనీల వలె ఇవి ప్రతి త్రైమాసిక ఫలితాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కాబట్టి కంపెనీ ఫైనాన్షియల్ వివరాలు తెలుసుకోవడం కష్టమవుతుంది.
సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత, అంతకుముందు కొన్న అన్‌లిస్టెడ్ షేర్లపై 6 నెలల వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే లిస్ట్ అయిన వెంటనే మీరు వాటిని అమ్మలేరు.
ఈ షేర్ల ధర డిమాండ్, సప్లై ఆధారంగా మారుతుంటుంది. అధికారిక ధర అంటూ ఏదీ ఉండదు కాబట్టి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో ధరను సరిపోల్చుకోవాలి.
లిస్టింగ్ అయ్యే విధానం
అన్‌లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అవ్వాలంటే సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాలి. కంపెనీ ముందుగా ఐపీఓ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నియమించుకుంటుంది. కంపెనీ తన పూర్తి వివరాలతో కూడిన డీఆర్‌హెచ్‌పీను సెబీకి సమర్పిస్తుంది. సెబీ ఈ నివేదికను పరిశీలించి అన్నీ బాగున్నాయని భావిస్తే అనుమతి ఇస్తుంది. కంపెనీ తన షేర్ ధరను నిర్ణయించి పబ్లిక్ ఇష్యూ తేదీలను ప్రకటిస్తుంది. ఐపీఓ సక్సెస్ అయ్యాక షేర్లు ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్‌కు అందుబాటులోకి వస్తాయి. దాంతో అన్‌లిస్టెడ్‌గా ఉన్న షేర్లు లిస్టెడ్ కేటగిరీలోకి మారతాయి.
ఇదీ చదవండి: ఈ ఏడాది టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కలకలం


