
న్యూఢిల్లీ: భారత పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయానే ఉద్దేశంతో సుంకాల పెంపునకు నాంది పలికారనే వాదన బలంగా వినిపిస్తోంది.. భారత్‌పై వరుస సుంకాలతో ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారని అంటున్నారు పలువురు ప్రముఖులు. భారత్‌ను చైనా కంటే దారుణంగా చూడటం తగదని అంటున్నారు. చైనా కంటే అధికంగా భారత్‌పై సుంకాలు విధించడమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
కొన్ని దశాబ్డాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న భారత్ పట్ల ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ఆయనకే తెలియాలి. భారత్‌ను ఆర్థికంగా ఎదుగకుండా చూడాలని ట్రంప్ చేస్తున్నారా? అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే సమయంలో .భారత్‌పై ట్రంప్ వైఖరి పట్ల అటు అమెరికాలోనే పలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించగా, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనే యత్నం కూడా యూఎస్ నుంచి జరుగుతున్నట్లే కనబడుతోంది.
తాజాగా అమెరికా మాజీ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు మిచెల్ బామ్‌గార్టనర్ అమెరికా-భారత్‌ల ‘మైత్రి’ తిరిగి గాడిలో పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిచెల్ బామ్‌గార్టనర్ మాట్లాడుతూ.. ట్రంప్‌కు భారత్ అంటే చాలా గౌరవమని, ప్రధాని మోదీ అంటే అంతకంటే గౌరవమంటూ స్పష్టం చేశారు. ఏ రకంగా భారత్‌ను డొనాల్డ ట్రంప్ గౌరవిస్తున్నారో చెప్పకపోయినా, త్వరలోనే ఇరుదేశా మధ్య సంబంధాలు తిరిగి యథాస్థితికి వస్తాయని జోస్యం చెప్పారు.
ట్రంప్ వైఖరిపై చాలాకాలం ఓపిక పట్టిన భారత్.. ఇప్పుడు మాటల యుద్ధాన్ని ఆరంభించింది. అటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా రష్యాతో బంధాన్ని చెడగొట్టాలని చూసిన ట్రంప్‌కు.. భారత్ అనూహ్య షాకిచ్చింది. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు రష్యాతో చమురు కొనుగోలులో ఎటువంటి మార్పు ఉండబోదనే సంకేతాలు పంపింది.
దాంతో ట్రంప్‌కు నోట్లో ఎలక్కాయపడినట్లు అయ్యింది. ప్రస్తుతం నేరుగా మాట్లాడకుండా రాజీ చేసుకునే మంత్రాన్ని అమలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారనేది ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి కనిపిస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహు కూడా అమెరికా-భారత్ సంబంధాలు తిరిగి మెరుగుపడతాయని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని కూడా చెప్పారు. మరి ఇప్పుడు అమెరికా మాజీ దౌత్యవేత్త మిచెల్ బామ్‌గార్టనర్ సైతం అదే పల్లవి అందుకున్నారు. ఈ రెండు పెద్ద దేశాల మధ్య పలు ప్రాథమిక అంశాలు చాలా బలంగా ఉన్నాయనేది ఒప్పుకోక తప్పదన్నారు. అందువల్ల ఇరు దేశాలు తిరిగి పూర్వ స్థితిని కొనసాగించే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు.