
భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. భారత్, రష్యా బంధంపై విరుచుకుపడే క్రమంలో.. ఇరుదేశాలవీ ‘డెడ్ ఎకానమీ’ అంటూ వ్యాఖ్యానించారాయన. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చారు.
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైందని.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే క్రమంలో ఉందని అన్నారాయన. శనివారం యూపీ వారణాసిలో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
‘‘భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా, నిలకడగా ఉంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదిగేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక గందరగోళం నెలకొంది(పరోక్షంగా ట్రంప్ టారిఫ్‌ల నిర్ణయాన్ని ప్రస్తావించి). అన్ని దేశాలు తమ తమ ప్రయోజనాలపై దృష్టిసారించాయి. భారత్ ప్రయోజనాలకు అవసరమైన చర్యలను మా ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది. ఇందు కోసం విభేదాలను పక్కన పెట్టి.. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. స్వదేశీ ఉత్పత్తులకు మద్దతివ్వడం ఇచ్చేలా తీర్మానం చేయాలి’’ అని పిలుపు ఇచ్చారాయన.
ఇదిలా ఉంటే.. భారత్‌పై 25శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత్ మధ్య వాణిజ్య బంధాల్ని ప్రస్తావించిన ట్రంప్ తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని, కలిసి అవి ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకుంటాయని, కలిసి మునుగుతాయని వ్యాఖ్యానించారు.
‘మనకు భారత్ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన ఇటు భారత్‌లోనూ రాజకీయ దుమారం రేపింది.
మోదీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఖతమైందని, దేశ ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్ప ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీతో పాటు కాంగ్రెస్ ఎంపీలైన రాజీవ్ శుక్లా(రాజ్యసభ), లోక్‌సభ ఎంపీ శశిథరూర్‌లు రాహుల్ వ్యాఖ్యలతో విభేదించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
