
భారత్‌పై టారిఫ్ వార్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రయోజనాల విషయంలో తగ్గేదే లే అని.. రైతుల ప్రయోజనాలు కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని.. దేనికైనా సిద్ధమని ప్రకటించారాయన.
రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో.. మరో 25 శాతం పెనాల్టీ టారిఫ్‌ను బుధవారం ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరాయి. ఆ మరుసటిరోజే.. అంటే గురువారం ఉదయం ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై స్పందించారు.
‘‘రైతుల ప్రయోజనాలే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. ఈ విషయంలో భారత్ ఎప్పటికీ రాజీ పడదు. సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకూ తెలుసు. అయినా రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల కోసం సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది’’ అని ట్రంప్ టారిఫ్ వార్‌ను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారాయన.
ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత్ చేసే 86 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది. భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి సంక్షోభంలో పడనుంది. దుస్తులు, వజ్రాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు), తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు సంబంధ ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామాగ్రి ఎగమతులపై అదనపు టారిఫ్ భారం ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే.. భారతదేశం నుంచి పత్తి, మిర్చి, జీడిపప్పు, మామిడి, బంగాళదుంపలు, చేపలు, డెయిరీ ఉత్పత్తులపై అధిక సుంకాలు పడనున్నాయి.
భారత్ పై అమెరికా బుధవారం ప్రకటించిన ఈ అదనపు 25శాతం టారిఫ్ ను వెంటనే వర్తింపజేయబోమని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21రోజుల తరువాత(ఆగస్టు 27) అదనపు 25శాతం భారతీయ ఉత్పత్తులపై వర్తింపజేస్తారు. దీంతో.. ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన సరుకుపై ఈ అదనపు 25శాతం సుంకాన్ని విధించబోరు. అదేవిధంగా బుధవారం అర్ధరాత్రిలోపు అమెరికా చేరుకునే ఉత్పత్తులపైనా ఈ అదనపు భారం ఉండదు. సెప్టెంబర్ 17వ తేదీ అర్థరాత్రిలోపు అమెరికాలో మార్కెట్లోకి వచ్చేసిన భారతీయ ఉత్పత్తులపై ఈ అదనపు వడ్డింపు ఉండదు.

ఇదీ చదవండి: భారత్‌కు ట్రంప్ ఆంక్షల వార్నింగ్