
భారత్‌పై పెనాల్టీగా మరో 25 శాతం టారిఫ్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాతో చమురు వాణిజ్యం కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతుండగా.. ఇదే పని చేస్తున్న ఈయూ, చైనాలాంటి దేశాల విషయంలో ట్రంప్ ఉదాసీనతపై భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో.. భారత్‌పై అదనపు సుంకాల నిర్ణయంపై ట్రంప్ వెనక్కి తగ్గుతారా?.. ఆయన ఏమన్నారంటే..
స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున) వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంలో రష్యాతో చమురు వాణిజ్యం ఇంకా కొనసాగితే భారత్‌పై ద్వితీయ శ్రేణి ఆంక్షలు (Secondary Sanctions) తప్పవంటూ హెచ్చరించారు. అయితే.. రష్యా నుంచి చైనా కూడా చమురును కొనుగోలు చేస్తోంది కదా.. కేవలం భారత్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నారు? అని కొందరు మీడియా ప్రతినిధులు ట్రంప్‌నుప్రశ్నించారు. ‘‘ఇప్పటికి 8 గంటలకేగా గడిచింది. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ సమాధానం ఇచ్చారాయన. మరిన్ని సుంకాలను మీరు చూడబోతున్నారు’’ అంటూ బదులిచ్చారు.
ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంతో.. అమెరికా రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యాతో చమురు కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా secondary sanctions విధించే అవకాశాలు ఉన్నాయి. తాను వద్దన్నా కూడా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే.. రెండు విడతలుగా భారత్‌పై 50 టారిఫ్ విధించారు. ఇప్పుడు ఆంక్షల హెచ్చరికలూ జారీ చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: ఉల్టా చోర్.. అమెరికా సహా పెద్ద దేశాల దొంగ నాటకం
అయితే ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లో భాగంగా అతిత్వరలో ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీలను కలవనున్నట్లు వైట్‌హౌజ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఉద్రిక్తతలు చల్లారితే భారత్‌పై అదనపు సుంకాల నిర్ణయాన్ని తొలగిస్తారా? అనే ప్రశ్న ట్రంప్‌కు ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ఆ అంశాన్ని తర్వాత పరిశీలిస్తాం అని పేర్కొన్నారు.
ఇక రష్యాతో ఆయిల్ కొనుగోలు జరుపుతున్న చైనాపైనా సుంకాల మోత తప్పదా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘ఇప్పుడే ఏం చెప్పలేను.. బహుశా అది జరగొచ్చు. భారత్ విషయంలో అది జరిగింది. అలాగే మరికొన్ని దేశాలకూ అది తప్పకపోవచ్చు. అందులో చైనా కూడా ఉండొచ్చు’’ అని అన్నారాయన.
ఉక్రెయిన్ దురాక్రమణకు ప్రయత్నిస్తున్న రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసే దేశాలను ఉపేక్షించబోనంటూ ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌పై తొలుత 25 శాతం, తాజాగా మరో 25 శాతం టారిఫ్‌లను ప్రకటించారు. దీంతో.. భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.