breaking news
oil bussiness
-
రష్యా చమురుతో భారత సంపన్న కుటుంబాలే లాభపడుతున్నాయి
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా మరోసారి స్పందించింది. ఈ క్రమంలో భారతీయ బిలియనీర్లపై అక్కసు వెల్లగక్కింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఎన్బీసీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఏకంగా ఓ పత్రికలో వ్యాసం రాశారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల్లో భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యాతో కొనసాగుతున్న చమురు వాణిజ్యం.. ఈ కుటుంబాలకే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంక్షలనూ లాభార్జనగా మార్చుకున్నారు అని ఆరోపించారాయన.2022 కంటే ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం కంటే ముందు రష్యా నుంచి భారత్ 1 శాతం కంటే తక్కువ చమురును కొనుగోలు చేసేది. ఇప్పుడది 42 శాతానికి చేరి ఉండొచ్చు. భారత దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు రష్యా ఆయిల్‌ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను(ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు) పొందుతున్నాయి. అందుకే భారత్‌పై సుంకాలను పెంచే ప్రణాళిక రూపొందించాం. ఇవి సెకండరీ టారిఫ్‌లుగా ఉండొచ్చు అని బెసెంట్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో గతవారం ఓ ప్రముఖ పత్రిక కాలమ్‌లో భారతదేశంలోని చమురు వ్యాపారులపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు భారతదేశపు ‘‘బిగ్ ఆయిల్’’ లాబీ లాభాపేక్ష వల్ల జరిగాయని.. దేశీయ అవసరాల కోసం కాదని అందులో పేర్కొన్నారు. ఆ కథనంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించారు. ఇందులో సగం శిక్ష రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించబడనుంది. భారత్ మాత్రం తక్కువ ధర ఉన్న చోట నుంచి చమురు కొనుగోలు చేయడం తమ హక్కు అని పేర్కొంటూ, ఈ అదనపు టారిఫ్‌లను అసమంజసమైనవిగా చెబుతోంది. కానీ.. చరిత్రపరంగా చూస్తే.. భారత్ రష్యా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకోలేదు. ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడేది. కానీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై $60-పెర బ్యారెల్ ధర పరిమితి విధించడంతో.. భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. ఇది అమెరికాకూ తెలుసు. ..ఇక చైనాపై సెకండరీ టారిఫ్‌లు విధించకపోవడానికి ఓ కారణం ఉంది. అది భారత్ కంటే ఎక్కువగా రష్యా చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే 2022 ముందు 13% ఉండగా, ఇప్పుడు 16%కి పెరిగింది. పైగా చైనా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడమే కాకుండా.. విక్రయిస్తోంది కూడా. అందుకే అమెరికా చైనాపై అదనపు టారిఫ్‌లు విధించలేదు అని అన్నారాయన. -
భారత్ సుంకాల మోతపై పునరాలోచన! ట్రంప్ ఏమన్నారంటే..
భారత్‌పై పెనాల్టీగా మరో 25 శాతం టారిఫ్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాతో చమురు వాణిజ్యం కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతుండగా.. ఇదే పని చేస్తున్న ఈయూ, చైనాలాంటి దేశాల విషయంలో ట్రంప్ ఉదాసీనతపై భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో.. భారత్‌పై అదనపు సుంకాల నిర్ణయంపై ట్రంప్ వెనక్కి తగ్గుతారా?.. ఆయన ఏమన్నారంటే.. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున) వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంలో రష్యాతో చమురు వాణిజ్యం ఇంకా కొనసాగితే భారత్‌పై ద్వితీయ శ్రేణి ఆంక్షలు (Secondary Sanctions) తప్పవంటూ హెచ్చరించారు. అయితే.. రష్యా నుంచి చైనా కూడా చమురును కొనుగోలు చేస్తోంది కదా.. కేవలం భారత్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నారు? అని కొందరు మీడియా ప్రతినిధులు ట్రంప్‌నుప్రశ్నించారు. ‘‘ఇప్పటికి 8 గంటలకేగా గడిచింది. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ సమాధానం ఇచ్చారాయన. మరిన్ని సుంకాలను మీరు చూడబోతున్నారు’’ అంటూ బదులిచ్చారు.ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంతో.. అమెరికా రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యాతో చమురు కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా secondary sanctions విధించే అవకాశాలు ఉన్నాయి. తాను వద్దన్నా కూడా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే.. రెండు విడతలుగా భారత్‌పై 50 టారిఫ్ విధించారు. ఇప్పుడు ఆంక్షల హెచ్చరికలూ జారీ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఉల్టా చోర్.. అమెరికా సహా పెద్ద దేశాల దొంగ నాటకంఅయితే ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లో భాగంగా అతిత్వరలో ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీలను కలవనున్నట్లు వైట్‌హౌజ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఉద్రిక్తతలు చల్లారితే భారత్‌పై అదనపు సుంకాల నిర్ణయాన్ని తొలగిస్తారా? అనే ప్రశ్న ట్రంప్‌కు ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ఆ అంశాన్ని తర్వాత పరిశీలిస్తాం అని పేర్కొన్నారు. ఇక రష్యాతో ఆయిల్ కొనుగోలు జరుపుతున్న చైనాపైనా సుంకాల మోత తప్పదా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘ఇప్పుడే ఏం చెప్పలేను.. బహుశా అది జరగొచ్చు. భారత్ విషయంలో అది జరిగింది. అలాగే మరికొన్ని దేశాలకూ అది తప్పకపోవచ్చు. అందులో చైనా కూడా ఉండొచ్చు’’ అని అన్నారాయన. ఉక్రెయిన్ దురాక్రమణకు ప్రయత్నిస్తున్న రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసే దేశాలను ఉపేక్షించబోనంటూ ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌పై తొలుత 25 శాతం, తాజాగా మరో 25 శాతం టారిఫ్‌లను ప్రకటించారు. దీంతో.. భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
భారత్-రష్యా బంధం.. ఐ డోంట్ కేర్: ట్రంప్
మిత్రదేశం అంటూనే భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. మరో బాంబ్ పేల్చారు. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే అందుకు కారణమని కూడా ఆయన అన్నారు. ఈ తరుణంలో భారత్-రష్యా బంధంపైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని అన్నారాయన. భారత్ రష్యా (Russia) నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఆ రెండు దేశాలు ఏ వ్యాపారం చేసుకున్నా నాకు సంబంధం లేదు. కాకుంటే వారి ఆర్థిక వ్యవస్థను ఆ దేశాలు మరింత పతనం చేసుకుంటున్నాయి అని వ్యాఖ్యానించారాయన. న్యూఢిల్లీతో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామన్న ఎందుకంటే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తుందని, ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఆరోపించారాయన. ఈ సందర్భంగా.. రష్యా, యూఎస్‌లు కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని ట్రంప్ స్పష్టంచేశారు. అలాగే రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్పై విరుచుకుపడ్డారు. ‘‘మెద్వెదేవ్ ఓ విఫల నేత. ఆయన ఇప్పటికీ తానే అధ్యక్షుడిని అనుకుంటున్నారేమో. ఆయన మాటలను చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆయన ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్ హెచ్చరికలు చేశారు. భారత్ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే భారత్‌పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి అని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను గమనించాం. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్‌టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే.. ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని ఓ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో ట్రంప్ రష్యాకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. మరో 10, 12 రోజుల్లో శాంతి ఒప్పందానికి పుతిన్ గనుక ముందుకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ ‘అల్టిమేటం గేమ్’ యుద్ధానికి దారి తీస్తుందని దిమిత్రి మెద్వెదేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అయిన మెద్వెదేవ్.. ప్రస్తుతం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌కు డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. ట్రంప్ జారీ చేసే ప్రతీ అల్టిమేటం యుద్ధం వైపునకు అడుగుగా మారుతుంది. ఇది ఉక్రెయిన్ రష్యా మధ్య కాదు.. అమెరికాతోనే అంటూ సోషల్ మీడియాలో ఆయన ఓ ఘాటు పోస్ట్ చేశారు. -
రష్యాకు భారత్, చైనా ఆశాకిరణాలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక ఆంక్షలకు గురైన రష్యాకి, మిత్ర దేశాలైన భారత్, చైనా చేదోడుగా నిలుస్తున్నాయి. మే నెలలో రష్యా ఎగుమతి చేసిన చమురులో 80 శాతం ఈ రెండు దేశాలే కొనుగోలు చేసినట్టు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ప్రకటించింది. ‘‘మార్కెట్ కంటే తక్కువకు వచ్చే రష్యా చమురు కొనుగోలుకు ఆసియాలో కొత్త కొనుగోలుదారులు లభించారు. భారత్ రోజువారీ కొనుగోళ్లు 2 మిలియన్ బ్యారెళ్లకు మించింది. చైనా రోజువారీ కొనుగోళ్లను 0.5 మిలియన్ బ్యారెళ్ల నుంచి 2.2 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది’’అని ఐఈఏ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. మే నెలలో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా 45 శాతం సమకూర్చగా, చైనాలో ఇది 20 శాతంగా ఉన్నట్టు వివరించింది. రష్యా సముద్రపు ముడి చమురులో 90 శాతం ఆసియాకు వెళ్లిందని, యుద్ధానికి ముందు ఇది 34 శాతంగా ఉండేదని వివరించింది. ‘‘ఏప్రిల్ నెలతో పోలిస్తే భారత్ మే నెలలో 14 శాతం అధికంగా చమురుని రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. మే నెల మొదటి మూడు వారాల్లో సగటు రష్యా చమురు బ్యారెల్ 26 డాలర్లుగా ఉంది’’ అని వివరించింది. భారత్ జీడీపీ 4.8 శాతం భారత్ జీడీపీ 2023 సంవత్సరంలో 4.8 శాతం వృద్ధి సాధిస్తుందని ఐఈఏ అంచనా వేసింది. 2024లో ఇది 6.3 శాతానికి చేరుతుందని, తదుపరి 2025 నుంచి 2028 మధ్య 7 శాతంగా ఉంటుందని పేర్కొంది. జనాభా పెరుగుదుల, మధ్య తరగతి విస్తరణ సానుకూలమని భావించింది. ప్రపంచ చమురు వినియోగ డిమాండ్‌లో చైనాను భారత్ 2027లో వెనక్కి నెట్టేస్తుందని అంచనా వేసింది. -
జీడి పప్పు తొక్కతో లాభాలెన్నో.. లక్షల్లో సంపాదన!
కాశీబుగ్గ: జీడి పప్పు రుచి అందరికీ తెలిసిందే. జీడి పప్పు తయారీ విధానం, వ్యాపారం కూడా చాలా మందికి పరిచయమే. కానీ ఆ జీడిపప్పుకు కవచంలా ఉండే తొక్కతో కూడా లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుందని తెలుసా..? ఈ తొక్కతో తయారు చేసే ఆయిల్ మిశ్రమానికి విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అందుకే పలాస నుంచి మన దేశంలోని ఇతర ప్రాంతాలకే కాకుండా విదేశాలకు కూడా ఈ ఆయిల్‌ను ఎగుమతి చేస్తున్నారు. ఆ రక్షణ కవచమే.. జీడి చెట్టు పువ్వుల నుంచి జీడి పిక్కలు కాస్తాయి. పిక్కల దశ నుంచి పప్పు తయారీ వరకు సహజ సిద్ధంగా ఉండే రక్షణ కవచాలే జీడి తొక్కలు. జీడి గుడ్డు సేకరణ అనంతరం ఈ తొక్క ఎందుకూ పని రాదని ఒకప్పుడు పడేసేవారు. అవే నేడు కోట్లు కురిపిస్తున్నాయి. ఇప్పుడు తొక్క కిలో రూ.10 పలుకుతోంది. రోజుకు 300 నుంచి 400 టన్నుల వరకు జీడి తొక్కను ఆయిల్ తీయడానికి వినియోగిస్తున్నారు. ఈ మూలంగా 8000 లీటర్ల ఆయిల్‌ను సేకరిస్తున్నారు. ముడి సరుకుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫుల్ డిమాండ్.. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 300 వరకు జీడిపరిశ్రమలు, జిల్లా వ్యాప్తంగా, ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మరో 100 పరిశ్రమల్లో జీడి పప్పు తయారీ జరుగుతుంది. పప్పు సేకరణ అనంతరం జీడితొక్కను పక్కన పడేయకుండా, కొందరు వంట చెరకుగా వినియోగిస్తుంటే మరికొందరు కిలోల లెక్కన ఆయిల్ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. పలాస పరిసరాల్లో సుమారు 12 జీడి ఆయిల్ పరిశ్రమలు ఉన్నాయి. రోజుకు 4 లక్షల కేజీల జీడి పిక్కలను వినియోగించి వాటి నుంచి వచ్చే 3 లక్షల కేజీల తొక్కతో 8000 లీటర్లు ఆయిల్ సేకరిస్తారు. అనంతరం మిగిలిన పదార్థాన్ని వంటచెరకు కింద వాడుతున్నారు. రెండోసారి సది్వనియోగమయ్యే వస్తువుగా పరిగణించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. పూర్తి ప్రోత్సాహకాలతో పాటు జీఎస్టీ రేట్లను సైతం పూర్తిగా తగ్గించింది. పరిశ్రమల్లో మంట కోసం ఇలాంటి వాటిని వినియోగించాలని కోరుతోంది. ఆయిల్ ఉత్పత్తి ఇలా.. జీడి పరిశ్రమలో లభించిన తొక్క బస్తాలను వ్యాను, లారీల్లో వే బ్రిడ్జిల వద్ద తూస్తారు. అక్కడి నుంచి కూలీల సహకారంతో ఆయిల్ పరిశ్రమలకు చేరుస్తారు. అక్కడే అసలు పరీక్ష ఉంటుంది. జీడి తొక్కలో ఆయిల్ ఉందా లేదా అని తొక్కకు పరీక్షలు జరిపి వాటిని ఆయిల్ పరిశ్రమలో మిషనరీకి బెల్టుతో పంపుతారు. కిలోల చొప్పున పంపించి వాటిని పిండి పిప్పి చేసి ఆయిల్‌ను ప్రత్యేకమైన కెనాల్ ద్వారా సిమెంట్ బావికి తరలిస్తారు. అక్కడ కొన్ని రోజులు తేటగా మారిన అనంతరం తిరిగి ట్యాంక్‌లోకి పంపించి 90 డిగ్రీల వరకు వేడి చేసి నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపిస్తారు. అనంతరం డ్రమ్ములతో నింపి ట్రాన్స్‌పోర్టు లారీల్లో వివిధ ప్రాంతాలకు పంపిస్తారు. మన దేశంలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజస్థాన్, పంజాబ్, బెంగళూర్‌తోపాటు విదేశాలకు పంపిస్తారు. అక్కడ ఆయిల్‌ను ఆయా కంపెనీలు వివిధ రకాలుగా రూపాంతరం గావించి వాటిని సౌత్ కొరియా, ఖతార్, వియత్నాం, రష్యా, చైనా వంటి విదేశాలకు పంపుతారు. ఉపాధి కోణం.. జిల్లా వ్యాప్తంగా జీడి పరిశ్రమలపై ఆధారపడి 20వేల మంది వరకు జీవిస్తుండగా.. జీడి తొక్క ఆయిల్ పరిశ్రమలు కూడా మరో రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉపయోగాలెన్నో.. ఈ ముడి సరుకును రోడ్లకు వాడే తారు ఫ్యాక్టరీల్లో తారు తయారీకి, పెయింటింగ్స్ తయారీలో, వార్నిష్లు, బయోడీజిల్ తయారీకి వాడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పునీటి కారణంగా పెద్ద పెద్ద షిప్‌లు, బోట్లు, స్టీమర్లు, పాడైపోకుండా ఈ ఆయిల్‌ను తరచుగా పూస్తారు. విదేశాలకు ఎగుమతి.. పలాస నుంచి విదేశాలకు జీడిపప్పే కాదు జీడి ఆయిల్ సైతం ఎగుమతి కావడం మన ప్రాంత గొప్పతనంగా భావిస్తున్నాను. ప్రపంచమంతా వినియోగించే తారు, పెయింటింగ్స్, బయోడీజిల్ తయారీలో మన పలాస ఆయిల్ వాడటం మనం గొప్పగానే చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఆయిల్ సేకరణ పెరిగి మరింత మందికి ఉపాధి కలుగుతుంది. వైఎస్సార్ చలవతో పలాస ఇండస్ట్రియల్ ఏరియాలో మేము జీడి పరిశ్రమతో పాటు ఆయిల్ సేకరించే పరిశ్రమను ఏర్పాటు చేసుకుని నడుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో రాయితీలు అందించింది. ఔత్సాహికులకు ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తే మరింత మేలు జరుగుతుంది. – కోరాడ శ్రీనివాసరావు, ఆయిల్ పరిశ్రమ యజమాని, ఇండ్రస్టియల్ ఏరియా, పలాస. -
ఐఎస్ టెర్రరిస్టుల వద్ద రూ.13 వేల కోట్లు
న్యూఢిల్లీ: మానవ సమూహం మధ్య బాంబులై పేలి మారణ హోమానికి పాల్పడుతూ ప్రపంచంలో భీతావహం సృష్టిస్తున్న ఐఎస్ టెర్రరిస్టు మూకలు నేడు అపార ధనరాశులు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం వారి వద్ద 13వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నట్టు ఓ తాజా అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఇటు డబ్బులోనూ అటు మారణహోమం సృష్టించడంలోను ప్రపంచంలోనే నెంబర్ వన్ టెర్రరిస్టు సంస్థగా ఐఎస్ ముద్రపడింది. సిరియా, ఇరాక్లలో పది చమురు క్షేత్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ టెర్రరిస్టులు రోజూ 30 వేల నుంచి 40 వేల బ్యారెళ్ల వరకు అక్రమ మార్గంలో క్రూడాయిల్ విక్రయిస్తూ రోజుకు పది కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. టర్కీ, ఇరాన్, జోర్డాన్ దేశాలు చీకటి మార్గంలో టెర్రరిస్టుల నుంచి ఆ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నాయి. కిడ్నాప్‌ల ద్వారా ర్యాండమ్ కింద ఏడాదికి 300 కోట్ల రూపాయలను సమకూర్చుకుంటున్నాయి. ఇరాక్‌లో దాదాపు 40 శాతం గోధమ పంటను తమ ఆధీనంలోకి తెచ్చుకొని కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. సిరియాలో తమ ఆధీనంలో నివసిస్తున్న కోటి మంది ప్రజల నుంచి 20 శాతం ఆదాయం పన్నును వసూలు చేస్తున్నాయి. వాహనాల రాకపోకలపై రోడ్డు పన్నును విధిస్తున్నాయి. అంతేకాకుండా ఇస్లాం మతం పుచ్చుకోని క్రైస్తవుల నుంచి ప్రాణ రక్షణ పన్నును గుంజుతున్నాయి. ప్రాణ భీతితో దేశంవీడి వలస వెళుతున్న వారి నుంచి ఒక్కొక్కరి వద్ద ఆరున్నర వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. దౌర్జన్యం, బెదిరింపుల ద్వారా వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున నిధులను రాబడుతున్నాయి. ఇలా వచ్చిన సొమ్మును అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడానికి టెర్రరిస్టుల నియామకానికి వినియోగిస్తున్నాయి. మానవ బాంబులుగా మారేందుకు సిద్ధపడిన యువకులకు ముందుగానే కోట్ల రూపాయలను అందజేస్తున్నాయి. ముందుగా సిరియా, ఇరాక్ ప్రభుత్వ సైనికులను, వారికి మద్దతిస్తున్న యూరప్, మధ్యప్రాచ్య దేశాల సైనికులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపిన ఐఎస్ టెర్రరిస్టులు ఇప్పుడు పంథా మార్చారు. జన సమూహాన్ని ఎంచుకొని మారణ హోమాన్ని సృష్టించడం లక్ష్యంగా చేసుకొన్నారు. ఆ వ్యూహంలో భాగంగానే పారిస్‌లో ఏకకాలంలో ముంబై తరహా దాడులు జరిపి దాదాపు 140 మందిని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు.