
మిత్రదేశం అంటూనే భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. మరో బాంబ్ పేల్చారు. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే అందుకు కారణమని కూడా ఆయన అన్నారు. ఈ తరుణంలో భారత్-రష్యా బంధంపైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని అన్నారాయన.
భారత్ రష్యా (Russia) నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఆ రెండు దేశాలు ఏ వ్యాపారం చేసుకున్నా నాకు సంబంధం లేదు. కాకుంటే వారి ఆర్థిక వ్యవస్థను ఆ దేశాలు మరింత పతనం చేసుకుంటున్నాయి అని వ్యాఖ్యానించారాయన. న్యూఢిల్లీతో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామన్న ఎందుకంటే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తుందని, ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఆరోపించారాయన. ఈ సందర్భంగా..
రష్యా, యూఎస్‌లు కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని ట్రంప్ స్పష్టంచేశారు. అలాగే రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌పై విరుచుకుపడ్డారు. ‘‘మెద్వెదేవ్ ఓ విఫల నేత. ఆయన ఇప్పటికీ తానే అధ్యక్షుడిని అనుకుంటున్నారేమో. ఆయన మాటలను చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆయన ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్ హెచ్చరికలు చేశారు.
భారత్ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే భారత్‌పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి అని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను గమనించాం. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్‌టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే.. ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో ట్రంప్ రష్యాకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. మరో 10, 12 రోజుల్లో శాంతి ఒప్పందానికి పుతిన్ గనుక ముందుకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ ‘అల్టిమేటం గేమ్’ యుద్ధానికి దారి తీస్తుందని దిమిత్రి మెద్వెదేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అయిన మెద్వెదేవ్.. ప్రస్తుతం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌కు డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. ట్రంప్ జారీ చేసే ప్రతీ అల్టిమేటం యుద్ధం వైపునకు అడుగుగా మారుతుంది. ఇది ఉక్రెయిన్ రష్యా మధ్య కాదు.. అమెరికాతోనే అంటూ సోషల్ మీడియాలో ఆయన ఓ ఘాటు పోస్ట్ చేశారు.