
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా మరోసారి స్పందించింది. ఈ క్రమంలో భారతీయ బిలియనీర్లపై అక్కసు వెల్లగక్కింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఎన్‌బీసీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఏకంగా ఓ పత్రికలో వ్యాసం రాశారు.
యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల్లో భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యాతో కొనసాగుతున్న చమురు వాణిజ్యం.. ఈ కుటుంబాలకే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంక్షలనూ లాభార్జనగా మార్చుకున్నారు అని ఆరోపించారాయన.
2022 కంటే ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం కంటే ముందు రష్యా నుంచి భారత్ 1 శాతం కంటే తక్కువ చమురును కొనుగోలు చేసేది. ఇప్పుడది 42 శాతానికి చేరి ఉండొచ్చు. భారత దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు రష్యా ఆయిల్‌ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను(ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు) పొందుతున్నాయి. అందుకే భారత్‌పై సుంకాలను పెంచే ప్రణాళిక రూపొందించాం. ఇవి సెకండరీ టారిఫ్‌లుగా ఉండొచ్చు అని బెసెంట్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో గతవారం ఓ ప్రముఖ పత్రిక కాలమ్‌లో భారతదేశంలోని చమురు వ్యాపారులపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు భారతదేశపు ‘‘బిగ్ ఆయిల్’’ లాబీ లాభాపేక్ష వల్ల జరిగాయని.. దేశీయ అవసరాల కోసం కాదని అందులో పేర్కొన్నారు.
ఆ కథనంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించారు. ఇందులో సగం శిక్ష రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించబడనుంది. భారత్ మాత్రం తక్కువ ధర ఉన్న చోట నుంచి చమురు కొనుగోలు చేయడం తమ హక్కు అని పేర్కొంటూ, ఈ అదనపు టారిఫ్‌లను అసమంజసమైనవిగా చెబుతోంది. కానీ..
చరిత్రపరంగా చూస్తే.. భారత్ రష్యా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకోలేదు. ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడేది. కానీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై $60-పెర బ్యారెల్ ధర పరిమితి విధించడంతో.. భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. ఇది అమెరికాకూ తెలుసు.
..ఇక చైనాపై సెకండరీ టారిఫ్‌లు విధించకపోవడానికి ఓ కారణం ఉంది. అది భారత్ కంటే ఎక్కువగా రష్యా చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే 2022 ముందు 13% ఉండగా, ఇప్పుడు 16%కి పెరిగింది. పైగా చైనా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడమే కాకుండా.. విక్రయిస్తోంది కూడా. అందుకే అమెరికా చైనాపై అదనపు టారిఫ్‌లు విధించలేదు అని అన్నారాయన.