
రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంతోనే భారత్‌పై ద్వితీయశ్రేణి ఆంక్షలు విధించాల్సి(పెనాల్టీ సుంకాలు) వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నొక్కి చెప్పారు. అయితే ఇది ఇక్కడితోనే అయిపోలేదని అంటున్నారాయన. భారత్ వల్లే రష్యాకు భారీ డ్యామేజ్ కూడా జరిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
బుధవారం పోలాండ్ అద్యక్షుడు కరోల్ నావ్రోకితో వైట్‌హౌజ్‌లోని తన ఓవల్ ఆఫీస్ ఆఫీస్‌లో జరిగిన జాయింట్ ప్రెస్‌మీట్‌లో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. రష్యాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఓ పోలాండ్‌కు చెందిన విలేకరి ప్రశ్నించారు. ఇండియాపై ద్వితీయ శ్రేణి సుంకాలు విధించాను. చైనా తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసే పెద్ద దేశం ఇండియానే. ఇది రష్యాకు వందల బిలియన్ల డాలర్ల నష్టం కలిగించింది. మీరు దీన్ని చర్య కాదు అంటారా?..
ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 సుంకాలు మిగిలే ఉన్నాయి. మీరేమో చర్య లేదు అంటున్నారు. బహుశా.. మీకు కొత్త ఉద్యోగం అవసరం అంటూ రిపోర్టర్‌ను ఉద్దేశించి ట్రంప్ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇండియాకు పెద్ద సమస్యలు వస్తాయి అని రెండు వారాల క్రితమే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడు అదే జరిగిందని గుర్తు చేశారు.
భారత్ తమకు మిత్రదేశమంటూ జులై 30వ తేదీన ట్రంప్ తొలుత 25 శాతం సుంకాలు(ప్రతీకార సుంకాలు) ప్రకటించారు. ఆ సమయంలో రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్రంగా ఆక్షేపించారు. ఇక ఆగస్టు 6వ తేదీన రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్‌పై పెనాల్టీగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా ఉక్రెయిన్ యుద్దానికి భారత్ ప్రత్యక్షంగా ఫండింగ్ చేస్తోందని ఆరోపించారాయన. దీంతో ఆగస్టు 27వ తేదీ నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి.
ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్
అదే సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన భారత్‌ను అత్యధిక సుంకాలు విధించే దేశంగా పేర్కొంటూ.. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్ అంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా వస్తువులపై ఆ దేశం అత్యధికంగా సుంకాలు విధిస్తోందని.. అందువల్లే అమెరికన్ కంపెనీలు ఇండియన్ మార్కెట్‌లో పోటీ పడలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే..
ఇండియా ఇప్పుడు నో టారిఫ్ ఒప్పందానికి దిగి వచ్చిందన్న ఆయన.. అది ఆలస్యంగా జరిగిందంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇండియా రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. తన సుంకాల వల్లే భారత్ ఇప్పుడు టారిఫ్‌లు తగ్గించేందుకు సిద్ధమైంది అని అన్నారు.
నిజంగానే చమురు ఆగిందా?
ఇదిలా ఉంటే.. తన సుంకాల వల్లే భారత్ దిగొచ్చిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసిందంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తుండడం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. రష్యా ఈ విషయంపై అధికారికంగా ఏం స్పందించలేదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తామని, ఆర్థిక లాభదాయకత ఆధారంగా తమ వ్యూహాం ఉంటుందని ఇటు భారత్ చెబుతూ వస్తోంది.
ఇప్పటికే ప్రధాని మోదీ.. రైతులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలపై రాజీ పడం. ఒత్తిడి పెరిగినా తట్టుకుంటాం అని సుంకాలపై స్పందించారు. మరోవైపు.. చమురు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ,
ప్రస్తుత సమాచారం ప్రకారం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా ఆపలేదు. కానీ కొంతమేర తగ్గించిన సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన 50% సుంకాలు (25% రెసిప్రోకల్ టారిఫ్ + 25% పెనాల్టీ టారిఫ్) ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో రష్యా చమురు దిగుమతులు తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావం తక్షణమే పూర్తిగా కనిపించక పోవచ్చని.. ఎందుకంటే చమురు కొనుగోలు ఒప్పందాలు వారాల ముందే కుదురుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్‌తో అలా మాట్లాడాల్సింది కాదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. చైనా పర్యటన ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇండియా, చైనాలాంటి దేశాలతో అలా వ్యవహారించడం సరికాదని అమెరికా వైఖరిని తప్పుబట్టారు. అమెరికా భారత్‌పై 50% సుంకాలు విధించడం.. ఆర్థిక శిక్షగా అభివర్ణిస్తూనే ఇది అంతర్జాతీయ సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నంగా పేర్కొన్నారు.
ఇండియా, చైనా వంటి దేశాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఇండియా 1.5 బిలియన్ జనాభా కలిగిన దేశం. వీరి చరిత్ర, రాజకీయ వ్యవస్థలు గౌరవించాల్సినవి. వీటి నాయకత్వాన్ని బలహీనపరచాలనుకోవడం పొరపాటు. శిక్షించేందుకు ప్రయత్నించడం, సుంకాలు విధించడం అనేవి ఆర్థిక బలప్రయోగం. ఇది కాలనీల యుగం కాదు. భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని అమెరికా వైఖరిని పరోక్షంగా విమర్శించారు.