
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా సహా పెద్ద దేశాల దొంగనాటకం
మనల్ని మించి రష్యా చమురు కొంటున్న వైనం
‘రష్యా యుద్ధ యంత్రాంగం మొత్తానికీ ఆర్థిక ఇంధనాన్ని భారతే సరఫరా చేస్తోంది’ – తెంపరి ట్రంప్ ఇటీవల చేసిన తలతిక్క వ్యాఖ్యలివి. అంతేగాక, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై టారిఫ్‌లను భారీగా పెంచేస్తానంటూ బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగిన అమెరికా అధ్యక్షుడు బుధవారం అన్నంత పనీ చేశారు.
టారిఫ్‌ను 50 శాతానికి పెంచేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. కానీ వాస్తవాల ఆధారంగా ఒకసారి పరిశీలన చేస్తే ఇలాంటి విషయాల్లో వర్ధమాన దేశాలకు నిత్యం సుద్దులు చెప్పే పెద్ద దేశాలు తమవరకూ వచ్చేసరికి మాత్రం ఎంతటి కొద్ది బుద్ధులు ప్రదర్శిస్తాయో తెలుస్తుంది. ట్రంప్ అనే కాదు, ఇలాంటి విషయాల్లో సంపన్న దేశాల స్వార్థపూరిత వైఖరి ఇట్టే కళ్లకు కడుతుంది...
ఉక్రెయిన్‌పై ఏళ్లుగా సాగిస్తున్న మతిలేని యుద్ధానికి రష్యాకు అవసరమైన ఆర్థిక సాయం మొత్తాన్నీ ఒకరకంగా భారతే సమకూరుస్తూ వస్తోందన్నది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ కొద్దికాలంగా పాడుతూ వస్తున్న పాట. రష్యా నుంచి నానాటికీ పెరిగిపోతున్న భారత చమురు దిగుమతులనే ఇందుకు తార్కాణంగా అవి చూపిస్తున్నాయి. కానీ నిజానికి రష్యా నుంచి స్వీయ చమురు కొనుగోళ్లను నేటికీ ఆపని తెంపరితనం ఆ దేశాలది! ఇందుకు సంబంధించిన అన్ని విషయాలనూ ఒకసారి అంశాలవారీగా విశ్లేషిస్తే... ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే (దొంగే... దొం దొంగ అన్నట్టు) నానుడి ఈ దేశాల వైఖరికి అతికినట్టుగా సరిపోతుంది.
రష్యా చమురే ముద్దు!
ఉక్రెయిన్‌పై పాశ్చాత్య రష్యా యుద్ధానికి దిగిన వెంటనే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ పొలోమంటూ దానిపై నానారకాల ఆర్థిక తదితర ఆంక్షలు విధించాయి. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రష్యా చమురుపై మాత్రం అవి ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. అంతేకాదు, స్వయంగా అమెరికాతోపాటు ఆ దేశాలన్నీ నేటికీ రష్యా చమురును చంకలు గుద్దుకుంటూ కొనుక్కుంటున్నాయి. స్వీయ అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాయి. భారత్ వంటి దేశాలకు మాత్రం రష్యా చమురు కొనొద్దంటూ సుద్దులు చెబుతున్నాయి. ‘అలా ఎలా కొంటుం’దంటూ సన్నాయినొక్కులూ నొక్కుతున్నాయి. తెంపరితనానికి మారుపేరుగా మారిన ట్రంప్ అయితే ఆంక్షల రంకెలు వేస్తున్నారు.
ధరపై పరిమితి మాత్రమే
ఇరాన్, వెనెజువెలా చమురు మాదిరిగా రష్యా చమురుపై అంతర్జాతీయంగా నేటికీ పూర్తిస్థాయి నిషేధం లేదు. అలా చేస్తే పెద్ద దేశాల్లో ఒక్కదానికీ పూట గడవని పరిస్థితి! అందుకే తెలివిగా ప్రపంచంలోని ఏడు అతి సంపన్న, శక్తిమంతమైన దేశాల కూటమి అయిన జీ7, యూరోపియన్ రష్యా చమురుపై ‘ప్రైస్ క్యాప్’విధానంతో సరిపెట్టాయి. దాంతో రష్యా దర్జాగా తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకుంటూ వస్తోంది. భారత్ కూడా జీ7, ఈయూ విధించిన ‘ప్రైస్ క్యాప్’కు లోబడే, వాటి మాదిరిగానే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతూ వస్తోంది. అది కూడా పూర్తి చట్టబద్ధంగా, అత్యంత పారదర్శకంగా! ఈ విషయంలో ఒక్క అంతర్జాతీయ నిబంధనను గానీ, చట్టాన్ని గానీ ఉల్లంఘించడం లేదు.
మరి మనపై ఏడుపెందుకు?
ఒక్కముక్కలో చెప్పాలంటే స్వీయ వంచన, పరవంచన! అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నానాటికీ పెరిగిపోతున్న భారత ప్రాభవాన్ని చూసి ఓర్వలేనితనం!! స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట. కేవలం ఆ ఒక్క కారణంగానే సంపన్న దేశాలన్నీ ఇలా ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతున్నాయి. అదే సమయంలో తాము మాత్రం చడీచప్పుడూ లేకుండా అదే రష్యా నుంచి ‘ఓపెన్ మార్కెట్’ముసుగులో నిరి్నరోధంగా చమురు కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ట్రంప్ అయితే శాపనార్థాలతో పాటు బెదిరింపులకు కూడా దిగుతున్నారు.
పాశ్చాత్య దేశాల ‘గ్యాస్’
రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లపై గుండెలు బాదుకుంటున్న పాశ్చాత్య దేశాలు నిజానికి సహజ వాయువు కొనుగోళ్లలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాయి! గత జూన్‌లో ఈయూ దేశాలన్నీ కలిసి రష్యా సహజ వాయువు కొనుగోళ్ల నిమిత్తం వెచ్చించింది ఏకంగా 120 కోట్ల డాలర్లంటే నమ్మక తప్పదు! ఈ జాబితాలో ఫ్రాన్స్, హంగరీ, నెదర్లాండ్స్, స్లొవేకియా వంటి యూరప్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అంతేకాదు, రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా నాటో దేశాలదే అగ్ర స్థానం.
స్వార్థానికి మారుపేరైన తుర్కియే అయితే రష్యా రిఫైన్డ్ పెట్రో ఎగుమతుల్లో ఏకంగా 26 శాతాన్ని సొంతం చేసుకుంటోంది! ఈ విషయంలో భారత్ వాటా అక్షరాలా సున్నా! వీటన్నింటినీ బేరీజు వేసుకుని చూస్తే నిజానికి రష్యా యుద్ధ తంత్రానికి పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నది అమెరికా, పాశ్చాత్య దేశాలు మాత్రమేనన్నది అక్షరసత్యం. ఆ లెక్కన ఈ విషయంలో భారత్‌పై వాటి ఏడుపు దొంగే, ‘దొంగా’అంటూ దొంగ అరుపులు అరిచిన చందమన్నది అంతర్జాతీయ నిపుణుల మాట.
చైనా కంటే తక్కువే
భారత్ తన చమురు అవసరాల్లో ఏకంగా 38 శాతం రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది. కానీ ఈ విషయంలో అగ్రతాంబూలం మాత్రం చైనాదే. అది ఏకంగా 47 శాతం చమురు కొంటోంది. పాశ్చాత్య దేశాలతో పాటు వాటి మిత్ర దేశాలు కూడా రష్యా చమురును నమ్ముకునే మనుగడ సాగిస్తున్నాయి.
మనం తప్పుకుంటే..
గగ్గోలు పుడుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. బ్యారెల్ ఏకంగా 200 డాలర్లు దాటేస్తుంది. అది మొత్తం ప్రపంచ దేశాలన్నింటికీ కోలుకోలేని దెబ్బేనని అంతర్జాతీయ చమురు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్