
డబ్బు దాచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్ మాత్రం అత్యంత సురక్షితమైన మార్గం అని చాలామంది విశ్వసిస్తారు. ఈ కారణంగానే తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకులలో దాచుకుంటారు. అయితే ఎక్కడ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
బ్యాంకు వెబ్‌సైట్‌ల నుంచి వచ్చిన లేటెస్ట్ డేటా ప్రకారం.. కొన్ని ప్రధాన బ్యాంకులు ప్రస్తుతం ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకట్టుకునే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
HDFC బ్యాంక్ ప్రస్తుతం 2025 జూన్ 25 నుంచి అమలులోకి వచ్చేలా.. రెగ్యులర్ కస్టమర్లకు ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీని అందిస్తోంది. ICICI బ్యాంక్ & కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇదే రేట్లను అందిస్తున్నాయి.
ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఇది రెగ్యులర్ కస్టమర్లకు 6.40% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 6.90% వడ్డీ అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 20 నుండి అమలులోకి వచ్చే ఫెడరల్ బ్యాంక్ రేట్లకు అనుగుణంగా వడ్డీను అందిస్తోంది.
భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా జూలై 15 నుంచి సాధారణ కస్టమర్లకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీని అందిస్తోంది.
వివిధ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అందించే వడ్డీ చాలా చిన్న మొత్తంలో తేడా ఉంటుంది. రేట్లలో చిన్న వ్యత్యాసం కూడా మంచి లాభాన్ని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ప్రత్యేకంగా.. ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాబట్టి.. ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునేవారు వడ్డీ రేట్లను పరిశీలించి ఎంచుకోవడం ఉత్తమం.