
సుప్రీం కోర్టు ‘సల్వాజుడుం’తీర్పు విషయంలో అమిత్‌షాతో వాదించబోను
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి స్పష్టీకరణ
న్యూఢిల్లీ: సాయుధ సల్వాజుడుం వ్యవస్థను సుప్రీంకోర్టు వ్యతిరేకించడం వల్లే నక్సలిజం ఇంకా ఉనికిలో ఉందని, దీనికి పరోక్షంగా సుదర్శన్‌రెడ్డి కారణమని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా చేసిన విమర్శలపై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విభేదించారు. శనివారం పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.
‘‘సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలందరి ప్రాణాలు, ఆస్తులు కాపాడే హోం మంత్రి అమిత్ షాతో నేరుగా వాగ్వాదం పెట్టుకోదల్చుకోలేదు. 2011 డిసెంబర్‌లో సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని నేనే రాశాను. కానీ ఆ అభిప్రాయం నాది కాదు. అది సుప్రీంకోర్టు అభిప్రాయం. తీర్పు పూర్తిపాఠం అమిత్ షా చదవి ఉండకపోవచ్చు. అందుకే ఆయన నన్ను విమర్శిస్తున్నారు. 40 పేజీల ఆ తీర్పు మొత్తాన్నీ చదివితే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఆయనకు ఖచ్చితంగా అవగతమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పదల్చుకోలేదు.
ఇంతటితో ఈ అంశంపై చర్చ ముగిస్తే బాగుంటుంది’’అని సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నక్సలిజాన్ని అంతంచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గిరిజన యువతకు తుపాకులిచ్చి సల్వా జుడుం(కోయ కమెండోలు) పేరితో సాయుధ వ్యవస్థను అమలుచేయగా, ఇది చట్టవిరుద్ధమని ఈ సాయుధ పౌర మిలటరీ వ్యవస్థను వెంటనే నిర్విర్యంచేయాలని సుప్రీంకోర్టు ఆనాడు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో నక్సలిజం పట్ల సుదర్శన్ రెడ్డికి సానుభూతి ఉందని, అందుకే అలా తీర్పిచ్చారని అమిత్ షా శుక్రవారం ఆరోపించడం తెల్సిందే.
ప్రజాస్వామ్యంలో లోటు
‘‘రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. సవాళ్లతో సతమతమవుతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా. పార్లమెంట్‌లో సభ్యుల నిరసన కారణంగా సభా కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలగడం సహజం. నిరసన అనేది అత్యావశ్యకం. కానీ అదే పనిగా నిరసన తెలపడం అనేది సమస్యాత్మకంగా మారుతుంది. గతంలో వాణిజ్యలోటు గురించి జనం మాట్లాడుకునేవాళ్లు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో సైతం లోటు కన్పిస్తోంది. మొదట్నుంచీ భారత్ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంగా పరిఢవిల్లినప్పటికీ నేడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగంపై దాడి అనే అంశంపై ఖచ్చితంగా చర్చించాల్సిందే. ప్రజాస్వామ్యం అంటే వ్యక్తుల మధ్య పోటీ కాదు. సిద్ధాంతాల మధ్య పోటీ మాత్రమే. ఎప్పుడైనా సరే ప్రభుత్వం, విపక్షం మధ్య సఖ్యత చెడిపోకూడదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా అది చాలా ముఖ్యం. విపక్షాలు ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి అభ్యరి్థని ఎన్నుకోవడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ఎంపిక అనేది మూడు అంశాలను స్పష్టంచేస్తుంది. ఒకటి వైవిధ్యం. విపక్షంలోని వివిధ పారీ్టలు నన్ను ఎన్నుకున్నాయి. రెండో ఏకగ్రీవ ఎన్నిక. ఇక మూడోది దీటైన ఓటింగ్ సామర్థ్యం.
ఒకరంగా విశ్లేషిస్తే దేశ జనాభాలో దాదాపు 63 శాతం జనాభాకు ఈ పారీ్టలు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. ఇంతకుమించిన గౌరవం ఏముంటుంది’’అని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘ఉపరాష్ట్రపతి పదవికి దేశంలో ఎలాంటి పోటీ లేకుండా ఎకగ్రీవంగా ఎన్నిక పూర్తవ్వాలి. కానీ రాజకీయాల్లో విబేధాలు సహజం. అందుకే అధికార, విపక్షాల మధ్య ఇలా పోటీ అనివార్యమైంది’’అని అన్నారు. ‘‘కులగణనకు మద్దతిస్తా. ఎందుకంటే ఎవరైతే వెనుకబడ్డారో, అభ్యున్నతికి నోచుకోలేదో వాళ్లను గుర్తించి ఎదిగేందుకు సాయపడాలంటే కులగణన చేయాల్సిందే’’అని ఆయన వ్యాఖ్యానించారు.