
అయిదేళ్లలో రెట్టింపు వృద్ధి
2030 నాటికి 1.93 లక్షల కోట్ల డాలర్లకు చేరిక
ఏటా 10 శాతం అప్ డెలాయిట్–ఫిక్కీ నివేదిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్యపరమైన ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ, దేశీ మార్కెట్ ఆసరాగా నిలుస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో భారత రిటైల్ రంగం దాదాపు రెట్టింపు కానుంది. 2030 నాటికి ఏటా 10 శాతం వృద్ధితో 1.93 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుంది. 2024లో ఇది 1.06 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. డెలాయిట్–ఫిక్కీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం దేశీయంగా డిజిటల్ వినియోగం, ప్రీమియమీకరణ, వివిధ మార్కెట్లవ్యాప్తంగా ఈ–కామర్స్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇలా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రిటైల్ రంగంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుండటం వల్ల దేశీయంగా డిమాండ్ స్థిరంగా కొనసాగుతుండటంతో పాటు, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరించేందుకు బ్రాండ్లలో కూడా ధీమా పెరుగుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), టారిఫ్‌లపరమైన సర్దుబాట్ల వల్ల ఎగుమతి మార్కెట్లలో భారత్ మరింత మెరుగ్గా పోటీపడే అవకాశాలు దక్కుతున్నాయి.
వాణిజ్య అవరోధాలు పెద్దగా లేకుండా, వ్యయాల భారం తక్కువగా ఉండే కొత్త మార్కెట్లకు మేడిన్ ఇండియా ఉత్పత్తులు చేరుకుంటున్నాయి. ‘మధ్యతరగతి ప్రజలు, డిజిటల్ అవగాహన కలిగిన యువ జనాభా, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో ఆర్థిక సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ఈ–కామర్స్ లావాదేవీల్లో ఇప్పుడు వీటి వాటా 60 శాతం పైగా ఉంటోంది. ఈ అంశాల దన్నుతో భారత వినియోగదారుల వ్యవస్థ ఒక విశిష్టమైన దశాబ్దంలోకి అడుగుపెడుతోంది‘ అని డెలాయిట్ సౌత్ ఏషియా పార్ట్‌నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు.
నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు ..
→ మారుతున్న వినియోగదారుల అలవాట్లు, ప్రాంతీయ పరిస్థితులను ముందుగా అంచనా వేసి, తదనుగుణంగా ఎఫ్‌ఎంసీజీ (వేగంగా అమ్ముడయ్యే వినియోగ ఉత్పత్తులు), రిటైల్, ఈ–కామర్స్ సంస్థలు స్పందించడంపై తదుపరి వృద్ధి ఆధారపడి ఉంటుంది.
→ దూరదృష్టి, నిర్ణయాత్మకమైన చర్యలతో 2030 నాటికి భారత రిటైల్ మార్కెట్ దాదాపు రెట్టింపు స్థాయి అయిన 1.9 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది. అదే సమయంలో వినియోగ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సుస్థిరతకు సంబంధించి అంతర్జాతీయంగా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పనుంది.
→ ప్రస్తుతం కొనుగోళ్లకు సంబంధించి 73 శాతం నిర్ణయాలను ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు ప్రభావితం చేస్తున్నాయి. యూట్యూబ్ రివ్యూలు 40 శాతం, తెలిసినవారిచ్చే సలహాలు 51 శాతం మేర ప్రభావం చూపుతున్నాయి. సంప్రదాయ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌కి ఇవి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాలుగా ఉంటున్నాయి.
→ 2024లో దేశీయంగా డైరెక్ట్ టు కన్జూమర్ (డీ2సీ) మార్కెట్ 80 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. 2025లో ఇది 100 బిలియన్ డాలర్ల స్థాయిని దాటేసే దిశగా
ముందుకెళ్తోంది.
→ మేడిన్ ఇండియా ఉత్పత్తులపై వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది. ఫుడ్, బెవరేజెస్ విభాగంలో 68 శాతం మంది, హోమ్ డెకరేషన్ విభాగంలో 55 శాతం, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో 53 శాతం మంది వినియోగదారులు భారతీయ బ్రాండ్స్‌వైపు మొగ్గు చూపారు.
→ 80 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న క్విక్ కామర్స్ విభాగం, మార్కెట్లో ఉత్పత్తుల లభ్యత విషయంలో చాలా వేగవంతంగా మార్పులు తీసుకొచి్చంది. ఈ సెగ్మెంట్ ఏటా 70–80 శాతం మేర వృద్ధి చెందుతోంది.
→ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బహుళ మాధ్యమాల ద్వారా రిటైల్ రంగం వృద్ధి చెందుతోంది. ఈ–కామర్స్ లావాదేవీల్లో 60 శాతం.. ఈ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి.
→ మాల్స్ కేవలం షాపింగ్‌కే కాకుండా లగ్జరీ అనుభూతి అందించే కేంద్రాలుగా కూడా మారుతున్నాయి. 2024లో రిటైల్ స్పేస్ లీజింగ్‌లో బెంగళూరు, హైదరాబాద్ 60 శాతం వాటాను దక్కించుకున్నాయి.