
క్రైమ్ సిరీస్.. చైల్డ్ వర్రీస్!
నేర స్వభావాన్ని ముందే గుర్తించాలంటున్న సైకాలజిస్టులు
సాక్షి, హైదరాబాద్: పాఠశాల చదువు కూడా ఇంకా పూర్తి కాని ఓ బాలుడు.. పక్కింట్లో ఉన్న ఓ అమాయక బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. తనకు కావాల్సిన ఓ చిన్న క్రికెట్ బ్యాట్ (Cricket Bat) దొంగతనం చేయాలనుకునే క్రమంలో అభమూ శుభమూ తెలియని చిన్నారిని బలిగొన్నాడు. హైదరాబాద్ రాజధాని నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ అమానుష ఘటనలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. పదో తరగతి చదువుతున్న బాలుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడమేంటి? అదీ నడిబొడ్డున జరగడం ఏమిటి? రేపటి పౌరులను రేపటి నేరగాళ్లుగా మారుస్తున్న ఈ పాపం ఎవరిది? అనే ప్రశ్నలు అందరి మదిలోనూ తలెత్తుతున్నాయి.
దొంగతనానికి వెళ్లే ముందు తాను పక్కాగా ప్లాన్ చేసుకున్నానని.. అవసరమైతే హత్య ఎలా చేయాలి? అనేది కూడా ముందే ఆలోచించానని కూకట్‌పల్లిలో (Kukatpally) బాలిక హత్య కేసు నిందితుడైన బాలుడు చెబుతున్నాడు. ఆ బాలుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు కూడా ఉందనీ వెల్లడైంది. దీంతో ఈ తరహా క్రైమ్ నేపథ్య సినిమా/సిరీస్‌ల ప్రభావంపై చర్చ మొదలైంది.
మోగుతున్నాయ్.. డేంజర్ బెల్స్
కోవిడ్ 19, లాక్ డౌన్ ప్రభావంతో పిల్లలతో సహా ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌లు.. ఇలా ఇంటర్నెట్‌కు అనుసంధానిత పరికరాల వాడకం పెరిగింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను కూడా సులభంగా యాక్సెస్ చేయడం వల్ల వెబ్ సిరీస్‌లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవి చాలా మందికి ఒక రకమైన వ్యసనంలా మారిపోయాయి. వెబ్‌సిరీస్‌తో సమస్య ఏమిటంటే.. సిరీస్ నచ్చితే వీక్షకులు ఒక ఎపిసోడ్ చూసి ఆపడం సాధ్యం కాక మొత్తం సిరీస్‌ను చూస్తున్నారు.
పరిశోధనలు చెబుతోందదే..
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌కు చెందిన క్రిమినాలజీ రిసెర్చర్స్ చేసిన పరిశోధనలో కేవలం వెబ్ సిరీస్ చూడడం వల్ల 34 శాతం మంది పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని, భయాందోళనలకు రాత్రివేళ పీడ కలలకు గురవుతున్నారని తేల్చారు. క్రైమ్ కంటెంట్ చూసిన ప్రతీ నలుగురు టీనేజర్లలో ఒకరు అభద్రతకు లోనవుతున్నారని, క్రిమినల్స్‌ను హీరోలుగా అపోహపడే ప్రమాదం పెరుగుతోందని స్పష్టం చేసింది. ఈ తరహా క్రైమ్ కంటెంట్ పెద్దలకు మాత్రమే అనే హెచ్చరికలతో వస్తున్నప్పటికీ చిన్నారులు (Kids) మాత్రం సులభంగానే చూడగలుగుతున్నారని వెల్లడించింది.
చదవండి: కూకట్‌పల్లి కేసు.. పోలీసులు ఏం చెప్పారంటే..?
పర్యవేక్షణే శరణ్యం..
ఈ నేపథ్యంలో కొందరు పిల్లల్లో అభద్రతా భావం పెరుగుతుంటే.. మరికొందరిలో నేర పూరిత మనస్తత్వం విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ మరింత పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. వారిని స్క్రీన్ వీక్షణ నుంచి మళ్లించి ఆరోగ్యకరమైన ఆటలు, హాబీల వైపు దృష్టి నిలిపేలా చేయడం, అలాగే క్రైమ్ కంటెంట్‌ను చిన్నారులు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.

అదీ ఒక కారణమే.. కాని అదే కారణం కాదు...
హింసాత్మక ప్రవృత్తికి కేవలం సోషల్ మీడియా (Social Media) మాత్రమే కారణం అని చెప్పలేం. అయితే.. అదీ ఒక కారణమే. సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలకు ఇవి ప్రేరకంగా పనిచేస్తాయని అనొచ్చు. అలాగే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు కూడా అగ్రెసివ్ నెస్‌ను పెంచుతాయి. ఏదేమైనా ఈ స్వభావాన్ని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.
– డా.చరణ్ తేజ్, న్యూరో సైక్రియాట్రిస్ట్