
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. బ్యాట్ కోసం ఇదంతా జరిగినట్టు తేలిందన్నారు.
కూకట్‌పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా సీపీ మహంతి మాట్లాడుతూ..‘ఈనెల 18వ తేదీన బాలిక హత్య జరిగింది. మూడు రోజుల వరకు సరైన క్లూ దొరకలేదు. శుక్రవారం బాలుడిని పట్టుకున్నాం. పక్కింట్లో ఉన్న 14 ఏళ్ల బాలుడే సహస్రను హత్య చేశాడు. క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకే సహస్ర ఇంటికి బాలుడు వెళ్లాడు. బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసింది. వెంటనే దొంగ దొంగ అని అరిచింది. దీంతో, సహస్రను బెడ్‌రూంలోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేశారు. బాలికను తోసేసి కళ్లు మూసుకుని కత్తితో పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేరు అనుకుని దొంగతనానికి వెళ్లాడు.. కానీ, బాలిక ఉండేసరికి ఆమెపై దాడి చేశాడు.
ఈ కేసులో బాలుడిని ప్రశ్నిస్తే విచారణను తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పాడు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నాం. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయి. దొంగతనానికి సంబంధించి ప్లాన్ మొత్తం ఓ నోట్‌లో రాసుకున్నాడు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేశాడు. బ్యాట్ కోసం సహస్ర తమ్ముడితో ఒకసారి గొడవ పడ్డాడు. నిందితుడికి క్రైమ్ సీన్స్ చూసే అలవాటు ఉంది. క్రైం సినిమాల ద్వారా ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాడు. ఓటీటీలో క్రైమ్ సినిమాలు, సీన్స్ చూసి ప్రభావితం అయ్యాడు.
ఈ ఘటనలో తల్లికి అనుమానం వస్తే ఆమెపై ప్రామిస్ చేసి బాలుడు నమ్మించాడు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు దొరికాయి. కత్తిని బాలిక ఇంట్లోనే కడిగేశాడు. రక్తపు మరకులు ఉన్న బట్టలను వాషింగ్ మెషీన్‌లో వేశాడు. చాలా సంక్లిష్టమైన కేసు ఇది. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. నిందితుడిని జువైనల్ హోంకు తరలించాం. నిందితుడి కోసం ఐదు బృందాలు గాలించాయి’ అని చెప్పుకొచ్చారు.

బాలిక తండ్రి ఆవేదన..
మరోవైపు.. బాలిక సహస్ర తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదు. అతడిని ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతి. అతను బాలుడు కాదు.. మేజర్ ఆలోచన చేశాడు. అతను మేజర్. పక్కా ప్లాన్ ప్రకారమే నా కూతుర్ని హత్య చేశాడు. పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడు. నా కూతురిని చంపేసి నా కొడుకును ఓదార్చుతున్నాడు. ఇతనే చంపాడని నేను కూడా నమ్మలేదు. అసలు ఈ భూమి మీద అతడు ఉండకూడదు. ప్రభుత్వం అతడిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.