breaking news
sahastra
-
సహస్ర బాబాయే సూత్రధారి...
కనిగిరి/విజయవాడ: ప్రకాశం జిల్లాలో గురువారం కిడ్నాప్ అయిన చిన్నారి సహస్ర కేసును పోలీసులు ఛేదించారు. కనిగిరిలో నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న సహస్రను సొంత బాబాయే కిడ్నాప్ చేశాడు. దీంతో సహస్ర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారు 24 గంటలు గడవకముందే కిడ్నాప్ డ్రామాకు తెరదించి చిన్నారిని రక్షించారు. కృష్ణాజిల్లా విజయవాడలో కిడ్నాపర్లను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు కావడంతో చిన్నారి అమ్మమ్మ ఇంటి దగ్గర ఉందని, అక్కడ ఆడుకుంటుండగా కిడ్నాప్ చేశారు. ఇంటి ముందు ఆడుకుంటుండగా బ్లాక్ పల్సర్ బైక్‌పై హెల్మెట్లు పెట్టుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేశారు. అనంతరం కిడ్నాపర్లు చిన్నారి తల్లిదండ్రులకు పలుమార్లు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారని, అయితే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పవద్దని బెదిరించారు. దీంతో సహస్ర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా కిడ్నాపర్లను పోలీసులు పట్టుకుని, చిన్నారిని క్షేమంగా విడిపించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో తమ చిన్నారి క్షేమంగా బయటపడిందని సహస్ర తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆర్థిక లావాదేవీల కారణంగానే సహస్రను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. -
చేతులెలా వచ్చాయి ‘తల్లీ’?
-
చేతులెలా వచ్చాయి ‘తల్లీ’?
సంపులో తోసి చిన్నారుల హత్య కన్నతల్లి దుశ్చర్య మతిస్థిమితం లేకనే.. ఎల్బీనగర్లో విషాదం నాగోలు: అమ్మ ఎత్తుకుంటే... లాలిస్తుందని భావించారా చిన్నారులు. గోరు ముద్దలు తినిపిస్తుందని తల్లి ఒడికి చేరితే... మృత్యు ఒడికి పంపించింది. అప్పటి వరకూ తమ కళ్ల ముందే కేరింతలు కొడుతూ .. .. ముద్దు మాటలతో అలరించిన చిట్టి తల్లులు అంతలోనే విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఎల్బీనగర్లో మంగళవారం కలకలం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ... నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం మాజీ సర్పంచ్ నేటి యాదగిరి, పద్మలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు ఎల్బీనగర్ చంద్రపురి కాలనీ రోడ్ నెం-5లో ఉంటున్నారు. పెద్ద కుమార్తె నిర్మలకు చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెంకు చెందిన వస్పరి మల్లేష్‌తో ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. మామ యాదగిరి, మల్లేష్ ఎల్బీనగర్లో బోర్‌వెల్స్‌తో పాటు ఇసుక లారీల వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా బయట అద్దెకు ఉంటున్న మల్లేష్ ఇటీవల కుటుంబంతో అత్తవారింటికి వచ్చారు. వీరికి అక్షర (2), సహస్ర (7 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు. నిర్మలకు హైబీపీ, ఫిట్స్ ఉండడంతో వివిధ ఆస్పత్రులలో చికిత్స చేయించారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు చనిపోతానంటూ తల్లిదండ్రులు, భర్తతో నిర్మల చెప్పేదని పోలీసులు తెలిపారు. మంగళవారం భర్త, తండ్రి పని మీద బయటకు... తల్లి పద్మ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నల్లా నీరు వచ్చింది. ఈలోగా ఫిట్స్. దురద, హైబీపీ ఎంతకూ తగ్గకపోవడంతో నిర్మల ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మచేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో నీరు పట్టుకునేందుకు సంపు మూతను తెరిచారు. ఇంట్లో అద్దెకు ఉన్నవారు మంచినీరు పట్టుకున్న తర్వాత... నిద్రిస్తున్న పిల్లలు సహస్ర, అక్షరలను నిర్మల సంపులో వేసింది. తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సమయంలో బయటి నుంచి వచ్చిన తల్లి పద్మ సంపు దగ్గర ఎందుకు నిలబడ్డావని కుమార్తెను ప్రశ్నించింది. దీంతో ఆమె సంపు మూత వేసి ఇంట్లోకి వెళ్లింది. ఇంట్లో పిల్లలు కనిపించకపోవడం... ఎక్కడ ఉన్నారని తల్లి అడగడంతో సంపులో వేశానని తెలిపింది. దీంతో పద్మ పెద్దగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న కృష్ణారెడ్డి వచ్చి సంపులోకి దిగి పిల్లలను బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటనతో స్థానికులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న తండ్రి మల్లేష్, తాత యాదగిరి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని విగతజీవులైన చిన్నారులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పరిసర కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిర్మలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం చేయవద్దు పిల్లలను ఎందుకు చంపావని భార్యను పదే పదే అడిగి.. విలపించిన మల్లేష్ తాము ఎవరిపైనా ఫి ర్యాదు చేయబోమని తెలిపాడు. తన పిల్లలను పోస్టుమార్టం చేయవద్దని పోలీసులను వేడుకున్నాడు. మానసిక పరిస్థితి బాగా లేనందునే... నిర్మలకు హైబీపీ, ఫిట్స్‌తో పాటు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే పిల్లలను చంపి.. ఆత్మహత్యకు యత్నించిందని ఎల్బీనగర్ ఏసీపీ పి.సీతారాం తెలిపారు. తాను చనిపోతే పిల్లలను ఎవరు చూస్తారంటూ కుటుంబ సభ్యులను తరచూ ప్రశ్నించేదని చెప్పారు. పూర్తి వివరాలు సేకరిస్తామని ఏసీపీ వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: చిన్నారుల మృతిపై స్పందించిన బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనూరాధరావు మాట్లాడుతూ నిజానిజాలు తెలుసుకుని బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.