రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్‌ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ) | F1 Movie Review Telugu | Sakshi
Sakshi News home page

F1 Movie Review: ఓటీటీలో క్రేజీ రేసింగ్ మూవీ.. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్

Aug 24 2025 7:45 AM | Updated on Aug 24 2025 8:14 AM

F1 Movie Review Telugu

ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్ని మాత్రం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా రీసెంట్ టైంలో 'ఎఫ్ 1' అనే హలీవుడ్ మూవీ అద్భుతమైన అనుభూతి అందిస్తోంది. థియేటర్లలో ఉండగానే ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
సన్నీ హేన్ (బ్రాడ్ పిట్) ఓ 'ఎఫ్ 1' రేసర్. కుర్రతనంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. కానీ ఓసారి రేసింగ్ చేస్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. చావు వరకు వెళ్లి బతికి బయటపడతాడు. డాక్టర్స్ హెచ్చరించడంతో తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌ని పక్కనబెట్టేస్తాడు. డబ్బుల కోసం చిన్న రేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత 'ఎఫ్ 1' రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం వస్తుంది. వెళ్తాడు కూడా. ఇతడితో పాటే టీమ్‌లో మరో కుర్ర డ్రైవర్ జోషువా పియర్స్ (డామ్సన్ ఇడ్రిస్) ఉంటాడు. వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి దశని దాటి సన్నీ.. ఎఫ్ 1 ఛాంపియన్ అయ్యాడా లేదా అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
అసలు సినిమా అంటే ఎలా ఉండాలి? దీనికి ఒక్కొక్కరు ఒక్కో థియరీ చెబుతారు. కొందరు ఫైట్స్ కావాలంటారు. మరికొందరు రొమాన్స్ కోరుకుంటారు. కానీ చాలామంది మాత్రం సరైన కథ ఉండాలి, మనసుని తాకే ఎమోషన్స్ ఉండాలని అంటుంటారు. అలా అన్ని రకాల ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ తీసిన చిత్రం 'ఎఫ్ 1'. సినిమా చూస్తున్నంతసేపు మీరు కూడా రేస్ ట్రాక్‌పైనే ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఓ మంచి మూవీ చూశామనే అనుభూతిని దక్కుతుంది.

ఇది రెండున్నర గంటల సినిమా. కానీ మొదటి నిమిషం నుంచే ఏ మాత్రం బోర్ కొట్టకుండా, రేస్ ట్రాక్‌పై కారు దూసుకెళ్లినంత వేగంగా వెళ్తుంది. డబ్బుల కోసం ఓ రేసింగ్ పోటీలో సన్నీ పాల్గొని గెలిచే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రూబెన్ అనే పాత్ర ఎంటరవుతుంది. ఇతడు అప్పట్లో సన్నీకి ప్రత్యర్థి రేసర్. ఇప్పుడు మాత్రం ఓ రేసింగ్ జట్టుకు యజమాని. తన టీమ్ భారీ నష్టాల్లో ఉందని, డ్రైవర్‌గా రావాలని సన్నీని అడుగుతాడు. దీంతో ఎఫ్ 1 పోటీలో పాల్గొనేందుకు సన్నీ, లండన్ వెళ్తాడు. తొలి రేసులో పాల్గొంటాడు. కానీ తన టీమ్‌లోని కుర్ర డ్రైవర్ జోషువాతో రేసింగ్ ట్రాక్‌పైనే గొడవ పెట్టుకుంటాడు. అలా కలవడం కలవడంతోనే శత్రువుల్లా మారిన వీరిద్దరూ తర్వాత తర్వాత ఎలా ఫ్రెండ్స్ అయ్యారు. చివరకు ఒక్క రేసులోనైనా గెలిచారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

30 ఏళ్ల పాటు 'ఎఫ్ 1' రేసింగ్‌కి దూరంగా ఉన్న ఓ వ్యక్తి.. ఆరోగ్యం సహకరించనప్పటికీ ఎలా విజేత అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. ఈ లైన్ వినగానే తెలుగులో వచ్చిన 'జెర్సీ' గుర్తురావొచ్చు. అయితే నాని సినిమాలో బాధాకరమైన ముగింపు ఉంటుంది. ఇందులో మాత్రం హ్యాపీ ఎండింగే ఉంటుంది లెండి.

'ఎఫ్ 1' రేసింగ్ అంటే ఏంటి? ఎలాంటి రూల్స్ ఉంటాయి? లాంటి వాటి గురించి మీకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా సరే ఈ సినిమా చూడొచ్చు. చూస్తే చాలావరకు అర్థమైపోతుంది. టీవీల్లో రేసింగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటాం. కానీ తెర వెనక ఏమేం జరుగుతుంటాయి? అనే అంశాల్ని కూడా ఇందులో చాలా చక్కగా చూపించారు. చూస్తున్నంతసేపు ఓ ప్రేక్షకుడిలా కాకుండా మీరు కూడా రేసర్ అయిపోయారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. మొదటి నుంచి చివరివరకు మిమ్మల్ని స్క్రీన్‪‌కి అతుక్కుపోయాలా చేస్తుంది.

ఎవరెలా చేశారు?
సన్నీగా చేసిన బ్రాడ్ పిట్.. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. సినిమా చూశాక ఇతడికి ఫ్యాన్ అయిపోతారేమో? జోషువా క్యారెక్టర్ చేసిన డామ్సన్, బ్రాడ్ పిట్‌తో పోటీపడి మరీ నటించాడు. మిగిలిన యాక్టర్స్ అందరూ ఎ‍క్కడా తగ్గకుండా ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీమ్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో సైలెన్స్‪‌తోనూ వాహ్ అనిపించాడు. సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవల్.

ఓవరాల్‌గా చెప్పుకొంటే 'ఎఫ్ 1' మూవీ రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ హాలీవుడ్ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది. త్వరలో ఉచితంగానూ స్ట్రీమింగ్ కావొచ్చు. ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement