
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోడుప్పల్ దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త తన భార్యను ముక్కలుగా నరికి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తన భార్య గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఆమెపై భర్త అనుమానం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆమెను హత్య చేసేందుకే తనను వికారాబాద్ నుంచి బోడుప్పల్‌కు తీసుకువచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ ప్రేమ వివాహం చేసుకొని బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. కాగా, వారిద్దరూ 25 రోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి బోడుప్పల్‌లోని ఈస్ట్ బాలాజీ హిల్స్‌లో ఉంటున్నారు. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు.. మహేందర్ రెడ్డి.. తన భార్యను అత్యంత కిరాతంగా హత్య చేశాడు. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. అనంతరం శరీరభాగాలను కవర్‌లో ప్యాక్ చేసి.. బయటకు తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు. అయితే, గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ప్లాన్ ప్రకారమే హత్య..
అయితే, స్వాతి గర్భవతి అయినప్పటి నుంచే మహేందర్ ఆమెపై అనుమానం పెట్టుకున్నాడు. దీంతో, ప్లాన్ ప్రకారమే ఆమెను వికారాబాద్ నుంచి బోడుప్పల్‌కు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమెను హత్య చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తల్లి సంచలన ఆరోపణలు..
మరోవైపు.. పెద్దల్ని కాదని మహేందర్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న స్వాతి కాపురం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిందని ఆమె తల్లి మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. మహేందర్ గురించి ఆమె షాకింగ్ విషయాలు బయటపెట్టారు. పెళ్లై 19 నెలలు గడిచినా.. ఒక్కసారి కూడా మహేందర్.. జ్యోతిని పుట్టింటికి పంపలేదని వాపోయారు. భర్తకు తెలియకుండా తమ కూతురు అప్పుడప్పుడు తమతో ఫోన్లో మాట్లాడేదని, పెళ్లైన కొన్నాళ్లకే మహేందర్ వేధించడం మొదలు పెట్టాడని చెప్పేదన్నారు. మహేందర్ రెడ్డి ప్రవర్తనపై చుట్టుపక్కల వారు కూడా అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతుర్ని చెప్పి మరీ చంపేశారని జ్యోతి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముక్కలు చేసిన శరీర భాగాల్లో కొన్నింటిని మూసీ నదిలో పడేసినట్లు మహేందర్ పోలీసులకు చెప్పగా.. వాటి కోసం ప్రతాప్ సింగారం సమీపంలో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
