
జాతీయ జూనియర్ హాకీ
జలంధర్: జాతీయ జూనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో హరియాణా జట్టు విజేతగా నిలిచింది. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో హరియాణా 3–2తో ఒడిశా జట్టుపై గెలుపొందింది. తొలి క్వార్టర్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు అదేపనిగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినప్పటికీ ఏ జట్టుకు ఫలితం దక్కలేదు. కానీ రెండో క్వార్టర్ మొదలవగానే ఒడిశా అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టుకొని 2 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసింది.
దీపక్ ప్రధాన్ (17వ ని.), ప్రతాప్ టొప్పొ (19వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచారు. దీంతో ఒడిశా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లోనూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. కానీ ఆఖరి క్వార్టర్ మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేసింది. హరియాణా ఆటగాళ్లు చిరాగ్ (50వ ని.), మరుసటి నిమిషంలోనే నితిన్ (51వ, 60వ ని.) స్కోరును 2–2తో సమం చేశారు.
ఈ దశలో మ్యాచ్ ఉత్కంఠరేకిత్తించగా ఆఖరి నిమిషంలో నితిన్ గోల్ చేసి హరియాణాను విజేతగా నిలిపాడు. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పంజాబ్ 4–3తో షూటౌట్‌లో ఉత్తర ప్రదేశ్‌పై విజయం సాధించింది.