
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ‘హ్యాట్రిక్’ విజయంతో గ్రూప్ దశను ముగించింది. గువాహటిలో బుధవారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ చివరి మ్యాచ్‌లో భారత్ 2–0 (45–37, 45–34)తో యూఏఈ జట్టును ఓడించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ గ్రూప్ ‘హెచ్’లో అగ్రస్థానం సంపాదించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
మొత్తం ఎనిమిది గ్రూపుల్లో ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచిన ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిస్తాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. భారత్, దక్షిణ కొరియా జట్లతోపాటు చైనా, జపాన్, అమెరికా, ఇండోనేసియా, మలేసియా, చైనీస్ తైపీ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి.