
భువనేశ్వర్: ఒడిశాలో దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కటక్‌లో రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్‌లో 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
వివరాల ప్రకారం.. మత సామరస్యం విషయంలో వెయ్యి సంవత్సరాల ప్రశాంత చరిత్ర కలిగిన ఒడిశాలోని కటక్‌లో హింస చెలరేగింది. శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2 గంటల మధ్య తొలిసారిగా హింస చెలరేగింది. దర్గా బజార్ ప్రాంతం గుండా కఠాజోడి నది ఒడ్డుకు వెళుతున్న దుర్గా మాత నిమజ్జన ఊరేగింపును స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకుంది. అర్ధరాత్రి వేళ డీజే కారణంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తీవ్రమైంది. ఊరేగింపులో ఉన్నవారు ప్రతిఘటించడంతో, పైకప్పుల నుంచి రాళ్లు, గాజు సీసాలు పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ ఘర్షణలో కటక్ డీసీపీ రిషికేశ్ ఖిలారీతో సహా ఆరుగురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, జనాలను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే, అతి కష్టం మీద ఘర్షణలకు కారణమైన వ్యక్తులని తరిమికొట్టిన పోలీసులు.. నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు.
କଟକ ରେ ଦୁର୍ଗା ମା ଙ୍କ ଭସାଣି ରେ ଡିସିପି ଙ୍କୁ ପଥର ମାଢ଼❗
ମାନ୍ୟବର @odisha_police ଙ୍କୁ ଅନୁରୋଧ ଏ ସିସିଟିଭି ଫୁଟେଜ କୁ ଯାଞ୍ଚ କରି ଅସାମାଜିକ ଯୁବକ ଙ୍କୁ ତୁରନ୍ତ ଗିରଫ କରି ଆଇନ ଅନୁଯାଇ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରନ୍ତୁ |@dcp_cuttack @CuttackDM @CMO_Odisha @homeodisha @PrithivirajBJP @IPR_Odisha pic.twitter.com/crxfy4iudA— Nrusingha Behera 🇮🇳 (@NrusinghaOdisha) October 5, 2025
వీహెచ్‌పీ ర్యాలీతో మళ్లీ ఉద్రిక్తతలు..
కటక్‌లో ఆంక్షలు ఉన్నప్పటికీ విశ్వ హిందూ పరిషత్ ఆదివారం సాయంత్రం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. నగరం తూర్పు శివార్లలోని బిద్యాధర్‌పూర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఘర్షణలు జరిగిన దర్గా బజార్ మీదుగా వెళ్లి, సీడీఏ ప్రాంతంలోని సెక్టార్ 11 వద్ద ముగిసింది. ర్యాలీ సందర్భంగా రూట్‌లో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని, గౌరీశంకర్ పార్క్ ప్రాంతంలో పలు దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటికి నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించిన గుంపులను చెదరగొట్టడానికి కమిషనరేట్ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం 12 గంటల బంద్‌కు వీహెచ్‌పీ పిలుపునిచ్చింది. ఘర్షణకు అధికారం యంత్రాంగం వైఫల్యమే కారణమని ఆరోపించింది.
Results of communal violence in Cuttack. #Cuttack #DurgaPuja pic.twitter.com/pOpbwkOL23
— Suraj Sureka (@surajsureka9) October 5, 2025
ఇంటర్నెట్ నిలిపివేత..
కటక్‌లో హింస, ఉద్రిక్తతలు పెరగడంతో, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి ఒడిశా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కటక్ మున్సిపల్ కార్పొరేషన్, కటక్ డెవలప్‌మెంట్ అథారిటీ, అలాగే 42 మౌజా పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దర్గా బజార్, గౌరీశంకర్ పార్క్, బిద్యాధర్‌పూర్ వంటి సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను పెంచారు. స్థానిక పోలీసులకు సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిని కూడా మోహరించారు.