
ఇటీవలి కాలంలో దుబాయ్ (Dubai)లో నివాసం ఏర్పరచుకుంటున్న క్రీడాకారుల సంఖ్య పెరిగిపోతోంది. వేల కోట్లకు అధిపతి అయిన పోర్చుగీస్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) నుంచి బాక్సర్ ఆమిర్ ఖాన్ దాకా చాలా మంది దుబాయ్‌లోనే సెటిల్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
బిలియనీర్స్ ఐలాండ్‌లో..
పోర్చుగల్‌కు చెందిన రొనాల్డో అల్ నసర్ (Al Nassr) జట్టుతో భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్నాడు. దీంతో ఎక్కువ సమయం దుబాయ్‌లోనే గడుపుతున్న ఈ ఫుట్‌బాల్ కింగ్ గతేడాది జూన్‌లో ఓ భారీ ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. బిలియనీర్స్ ఐలాండ్‌లోని జుమేరా బేలో భూమి కొనుక్కున్నాడు.
వందల కోట్ల విలువైన పెంట్‌హౌజ్
ఇక బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ నెయ్‌మార్ కూడా దుబాయ్‌లో భారీ పెట్టుబడి పెట్టాడు. బుగాటి రెసిడెన్స్‌లో అత్యాధునిక పెంట్‌హౌజ్‌ను రూ. 450 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. బ్రిటిష్-పాకిస్తానీ బాక్సర్ ఆమిర్ ఖాన్ లండన్‌లో తనపై దాడి తర్వాత దుబాయ్‌కు మకాం మార్చాడు.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ కూడా కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ‘‘ఈ భూమ్మీద ఉన్న అత్యంత సురక్షితమైన ప్రదేశం’’ అంటూ మొయిన్ అలీ పలు సందర్భాల్లో దుబాయ్‌పై ప్రశంసలు కురిపించాడు. వీరే కాదు.. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా దుబాయ్ మరీనాలో ఇల్లు కొన్నాడు. భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా కూడా దుబాయ్‌లోనే సెటిల్ అవడమే కాకుండా.. అక్కడే అకాడమీ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దుబాయ్‌కే ఎందుకు?
దుబాయ్ విలాసాలకు పెట్టింది పేరు. అత్యాధునిక సౌకర్యాలు గల ఇళ్లు, అగ్ర శ్రేణి విద్యా సంస్థలు, అత్యాధునిక వైద్యం, వేగవంతమైన, సాఫీ ప్రయాణాలకు వీలైన మార్గాలు, గోల్డెన్ వీసా రూల్స్, రక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలు వంటివి స్పోర్ట్స్ స్టార్స్ అనే కాదు.. ఇతర సెలబ్రిటీలు కూడా ఇక్కడ సెటిల్ అయ్యేందుకు ప్రధాన కారణాలు.
అన్నింటికంటే.. ఇక్కడ పన్నులు తక్కువగా ఉండటం సెలబ్రిటీలను ఆకర్షించే మరో అంశం. ముఖ్యంగా ఫుట్‌బాలర్ లేదంటే అథ్లెట్ తమ సొంత దేశాల్లో 40- 50 శాతం టాక్స్ చెల్లిస్తుండగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రం ఇది నామ మాత్రం లేదంటే కొన్నిసార్లు సున్నాగా ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు పేర్కొంది.
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్