
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12) సాగే కొద్దీ తెలుగు టైటాన్స్ జోరు పెరుగుతోంది. ఈ లీగ్‌లో టైటాన్స్ జట్టు వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 46–29తో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్ భరత్ హుడా (20 పాయింట్లు) అదరగొట్టాడు. పీకేఎల్‌లో వందో మ్యాచ్ ఆడుతున్న భరత్ 18 సార్లు కూతకెళ్లి 16 పాయింట్లు తెచ్చిపెట్టాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు రెయిడింగ్‌కు వస్తే నలుగుర్ని టాకిల్ చేశాడు.
మరో ఆల్‌రౌండర్, కెపె్టన్ విజయ్ మలిక్ (8) కూడా టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంకిత్ 3, చేతన్ సాహు, అవి దుహన్, అజిత్ పవార్, శుభమ్ షిండే తలా 2 పాయింట్లు చేశారు. హరియాణా ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు దీటుగా పాయింట్లు సాధించడంలో విఫలమయ్యారు. రెయిడర్ మయాంక్ సైని 5, కెపె్టన్ జైదీప్, వినయ్ చెరో 4 పాయింట్లు చేశారు.
అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 37–27తో యూ ముంబాపై జయభేరి మోగించింది. పుణేరి రెయిడర్ ఆదిత్య షిండే (14) రాణించాడు. మిగతా వారిలో కెపె్టన్ అస్లామ్ (5), పంకజ్ మోహితే (4) మెరుగ్గా ఆడారు. యూ ముంబా తరఫున రెయిడర్లు అజిత్ చౌహాన్ (10), సందీప్ (7) చక్కగా పోరాడారు. గురువారం జరిగే పోటీల్లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయంట్స్‌తో యూపీ యోధాస్ తలపడతాయి.