
ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌లో నేడు సింగపూర్‌తో మ్యాచ్
సింగపూర్: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు క్లిష్టమైన సమరానికి సిద్ధమైంది. మూడో రౌండ్‌లో భాగంగా నేడు గ్రూప్ ‘సి’లోనే పటిష్టమైన సింగపూర్‌తో భారత్ తలపడుతుంది. ఈ క్వాలిఫయర్స్ కోసం ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి తొలిదశలో చాలా మంది ఆటగాళ్లు ‘క్లబ్’ జట్లు విడుదల చేయకపోవడంతో గైర్హాజరయ్యారు. తర్వాత అందరూ కలిసిరావడం జట్టుకు కాస్తా ఊరటనిచ్చింది.
‘సీఏఎఫ్‌ఏ నేషన్స్ కప్’కు దూరమైన భారత స్టార్ స్ట్రయికర్, మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రి తిరిగి జట్టులోకి రావడం జట్టు బలాన్ని కూడా పెంచింది. ఖాలిద్ జమీల్ కోచింగ్‌లోని భారత జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకమైంది. నాలుగు జట్లు పోటీలో ఉన్న గ్రూప్ ‘సి’లో ప్రస్తుతం భారత్ అట్టడుగున నిలిచింది.
గత నెలలో జరిగిన పోటీల్లో తమకన్నా తక్కువ స్థాయి బంగ్లాదేశ్‌తో 0–0తో డ్రా చేసుకున్న భారత్... తదుపరి హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 0–1తో ఓటమి పాలైంది. దీంతో ఒకే ఒక్క పాయింట్‌తో భారత్ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు సింగపూర్ 4 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది.
సొంతగడ్డపై సింగపూర్‌దే పైచేయి
‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో 134వ ర్యాంకుతో భారత్... 158 ర్యాంకర్ సింగపూర్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ ఫామ్‌లో, ఫలితాల్లో చిన్నజట్ల కంటే వెనుకబడే ఉంది. ముఖాముఖి పోరులోనూ భారత్ 12–11తో సింగపూర్‌పై పైచేయిగా కనబడుతోంది. అయితే సొంతగడ్డపై సింగపూర్ జోరు కొనసాగిస్తోంది.
ఇక్కడ 15 మ్యాచ్‌లాడితే సింగపూర్ జట్టు 8 గెలిచింది. భారత్ ఆరు విజయాలతోనే సరిపెట్టుకుంది. ఒక మ్యాచ్ మాత్రం ‘డ్రా’గా ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో... సొంతగడ్డపై బెబ్బులిలా గర్జిస్తోన్న సింగపూర్‌లాంటి గ్రూప్ టాపర్‌తో భారత్ గెలవాలంటే మాత్రం సర్వశక్తులు ఒడ్డాల్సిందే!