
లెక్కాపత్రం లేకుండా యూరియా అమ్మకాలు.. సక్రమ పంపిణీలో విఫలం
రైతన్నలకు శాపంగా పరిణమించిన అధికారుల పర్యవేక్షణ లోపం
వ్యవసాయేతర అవసరాలకూ యూరియా వాడకం
పెయింట్స్, వార్నిష్ ప్లైవుడ్, యాడ్‌బ్లూ ద్రావణ పరిశ్రమలకు తరలుతున్న వైనం
డిమాండ్, సరఫరాలో వ్యత్యాసం స్పల్పమే.. అయినా తప్పని తిప్పలు
గత సంవత్సరం కన్నా స్వల్పంగా పెరిగిన సాగు
ఖరీఫ్‌లో 9.80 ఎల్‌ఎంటీల యూరియా అవసరం.. ఇప్పటివరకు వచ్చింది 7.28 ఎల్‌ఎంటీలు
ప్రస్తుత నిల్వలు కేవలం 41 వేల టన్నులు
పొద్దంతా పడిగాపులే...
సాక్షి, హైదరాబాద్: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథలు తప్పడం లేదు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కనిపించని దృశ్యాలు ఇప్పుడు పల్లెల్లో గోచరిస్తున్నాయి. యూరియా కోసం సూర్యోదయానికి ముందు నుంచే రైతులు వ్యవసాయ సహకార సొసైటీల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూలు కడుతున్నారు. నిలబడలేని రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు క్యూల్లో పెట్టి సొసైటీలు తెరిచి యూరియా ఇచ్చేంత వరకు ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తుంటే, కొన్ని జిల్లాల్లో ఎకరానికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు.
రాష్ట్రంలో జూన్ నుంచే ఖరీఫ్ సాగు మొదలు కాగా, జూలై నెలాఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈనెలలో అవి తీవ్రమై, ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా మొదట్లో ఇష్టానుసారం విక్రయించినందునే ఇప్పుడు కొరత ఏర్పడిందని కేంద్రం కూడా భావిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి అధికంగానే విక్రయించినప్పటికీ, కొరత రావడానికి ప్రధాన కారణం అధికారులు యూరియా అమ్మకాలపై దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది.
7.28 ఎల్‌ఎంటీలు సరఫరా: కేంద్రం
ఈ ఖరీఫ్ సీజన్‌లో కేంద్రం కేటాయించిన యూరియాలో ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్‌ఎంటీ)రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 5.38 ఎల్‌ఎంటీ మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ శాఖ చెపుతోంది. అయితే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ మాత్రం గత రబీలో మిగిలిన 1.92 ఎల్‌ఎంటీని కూడా కలుపుకొని ఇప్పటివరకు 7.28 ఎల్‌ఎంటీ సరఫరా చేశామని చెబుతోంది.
ఇందులో ప్రస్తుతం మార్క్‌ఫెడ్, సొసైటీలు, ప్రైవేటు డీలర్లు, గోదాములన్నింటా కలుపుకొని అందుబాటులో ఉన్న యూరియా కేవలం 41వేల మెట్రిక్ టన్నులు. అంటే ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6.87 ఎల్‌ఎంటీల విక్రయాలు జరిగాయి. ఇదే గత ఏడాది ఇదే సమయంలో 6.10 ఎల్‌ఎంటీ అమ్మకాలే జరిగినట్లు కేంద్రం చెబుతోంది. దీన్ని బట్టి గత సంవత్సరం కన్నా 77వేల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా విక్రయించారు.
అంటే గత సీజన్‌తో పోలిస్తే యూరియా విక్రయాలు ఎక్కువ జరిగినప్పటికీ, కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. గత సంవత్సరం ఖరీఫ్‌తో పోలి్చనా, ఈసారి యూరియా విక్రయాలు అధికంగానే జరిగినట్లు చెబుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, బ్లాక్ మార్కెటింగ్ వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు చెబుతోంది. పెద్ద రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం, వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించడం కూడా యూరియా రాద్ధాంతానికి కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎవరెవరికి ఎంత విక్రయించారు?
రాష్ట్రంలో ఖరీఫ్ కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా కేంద్రం యూరియా కోటా పంపిస్తుంది. మార్క్‌ఫెడ్ ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా (50:50 ప్రాతిపదికన) జరిగే విక్రయాలను పర్యవేక్షించకుండా వ్యవసాయ శాఖ గాలికి వదిలేసింది. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను రాష్ట్రంలోని 14 వేల మంది డీలర్లు మే నెలాఖరు నుంచే విక్రయిస్తారు.
ఇక సొసైటీలు, ఇతర వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా జూన్ నుంచి విక్రయిస్తారు. అయితే ఈ విక్రయాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఏ సొసైటీలో ఏ రైతుకు ఎంత యూరియా విక్రయించారనే లెక్కలు కేవలం 10 రోజుల వరకే ఉంటాయి. తరువాత మళ్లీ రైతులు వెళ్లి యూరియా తీసుకోవచ్చు. ఇక ప్రైవేటు డీలర్లు జరిపే యూరియా విక్రయాలపై ఎలాంటి నిఘా లేదు. లెక్కలూ లేవు. రూ. 270 చొప్పున విక్రయించాల్సిన యూరియాను రూ.400 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
అదే సమయంలో వ్యవసాయేతర అవసరాలకూ యూరియాను డీలర్లు పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రంగుల కంపెనీలు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమలతోపాటు గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల వారు కూడా రాష్ట్రంలోని ప్రైవేటు డీలర్ల నుంచి అధిక ధరలకు యూరియాను పెద్దఎత్తున కొనుగోలు చేసి తీసుకెళ్తారని మార్క్‌ఫెడ్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఒక్కో రైతుకు రేషన్ విధానంలో ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇస్తున్నట్లుగా ఖరీఫ్ ఆరంభం నుంచే అమలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని నిపుణులు అంటున్నారు.
సాగు విస్తీర్ణం పెరగడం కూడా...
రాష్ట్రంలో యూరియా అధిక వినియోగానికి చెపుతున్న కారణాల్లో ఒకటి ఈసారి ఖరీఫ్ సీజన్ సాధారణం కన్నా ముందే రావడమైతే, రెండోది పంట సాగు విస్తీర్ణం గతం కన్నా గణనీయంగా పెరగడం. గత ఖరీఫ్ సీజన్‌లో ఆగస్టు మూడో వారానికి 91.21 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 118 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో వరి విస్తీర్ణమే గత ఖరీఫ్ కన్నా 23 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉంది.
గత సంవత్సరం ఈ సమయానికి 31.60 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 54.79 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక పత్తి 42 లక్షల ఎకరాల నుంచి 45 లక్షలకు పెరిగింది. మొక్కజొన్న గత ఖరీఫ్‌లో 4.55 లక్షల ఎకరాలు సాగైతే ఈసారి 6.48 లక్షల ఎకరాలు సాగైంది. యూరియా అధికంగా వినియోగించే ఈ మూడు పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా కొరత ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రతిపాదనలకు అనుగుణంగా సరఫరా...
ఖరీఫ్, రబీ మొదలు కావడానికి ముందే... వ్యవసాయ శాఖ ఆయా సీజన్‌లకు అవసరమైన ఎరువుల ప్రణాళిక రూపొందిస్తుంది. ఆ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిస్తే, రాష్ట్రాల వారీగా కోటాను విడుదల చేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు 9.80 ఎల్‌ఎంటీల కోటాకు కేంద్రం ఆమోదం తెలిపింది. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తోంది. దాని ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా 1.60 ఎల్‌ఎంటీకి తగ్గకుండా పంపించాలి.
ఈ మేరకు దేశంలోని ఎరువుల కంపెనీలకు కోటా విడుదల చేస్తే ఆయా కంపెనీల ద్వారా 50 శాతం కోటాను రైల్వే రేక్ పాయింట్ల ద్వారా మార్క్‌ఫెడ్‌కు, మరో 50 శాతం కోటా ప్రైవేటు డీలర్లకు పంపిస్తారు. ఈ లెక్కన ఇప్పటివరకు కేంద్రం పంపిన 5.18 ఎల్‌ఎంటీ యూరియాలో సగం అంటే 2.59 ఎల్‌ఎంటీ ప్రైవేటు డీలర్లకు వెళ్లింది. గత రబీకి సంబంధించిన ఓపెనింగ్ స్టాక్‌తో కలిపితే మొత్తం 3.61 ఎల్‌ఎంటీలు రాష్ట్రంలోని 14వేల ప్రైవేటు డీలర్లకు చేరింది. అయితే ప్రస్తుతం 18వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వారి వద్ద ఉంది. అంటే 3.43 ఎల్‌ఎంటీలు విక్రయించారు. కానీ ఎవరికి ఎంత మేర విక్రయించారనే లెక్కలు వ్యవసాయ శాఖ దగ్గర లేకపోవడం గమనార్హం.
భారీగా పెరిగిన వాడకం
రాష్ట్రంలో యూరియా వినియోగం శాస్త్రవేత్తలు సూచిస్తున్న మోతాదుకన్నా రెండింతలు అధికంగా వినియోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరికి ఎకరాకు పంట కాలంలో 120 కిలోలు వినియోగిస్తే సరిపోతుంది. కానీ ఎకరాకు ఒకటిన్నర బస్తాల చొప్పున (బస్తా 45 కిలోలు) మూడు సార్లు వినియోగిస్తున్నారు. అలాగే మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వరికోసం నాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకు బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను కాంప్లెక్స్ ఎరువుతో కలిపి వినియోగిస్తుంటారు.
ఆ తరువాత పొట్ట దశలో 45 రోజులకు, మరోసారి రెండు బస్తాల చొప్పున, మూడోదఫా 90 రోజుల్లో మరోసారి బస్తా చొప్పున వినియోగిస్తున్నారు. మొక్కజొన్నకు పంట కాలంలో కొన్ని జిల్లాల్లో మూడుసార్లు యూరియాను వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు ఒక్కోసారి రెండు బస్తాల చొప్పున వినియోగిస్తారు. పత్తి పంట కోసం కూడా ఎకరాకు ఒకటిన్నర బస్తాలకు తగ్గకుండా వినియోగించడంతో ఖరీఫ్‌లో యూరియా డిమాండ్ పెరుగుతోంది. అదే యాసంగి (రబీ) సీజన్‌లో పత్తి లేకపోవడంతో డిమాండ్ అంతగా లేదని అధికారులు అంటున్నారు.