హైదరాబాద్.: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈరోజు(బుధవారం, నవంబర్ 26వ తేదీ) తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పీఎం మోదీని, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలన్నారు.
అలాగే దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులను సమ్మిట్‌కు ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్దం చేయాలన్నారు. ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమ్మిట్‌లో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు.
ఇప్పటికే 2600 మందికి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాన్ని అందించామని సీఎంకు తెలిపారు అధికారులు. సమ్మిట్ లో స్టాల్స్ ఏర్పాటుకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇన్ఫ్రా స్ట్రక్చర్, సంక్షేమం, ఇండస్ట్రీ, వైద్యంతో పాటు వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించగా, ప్లీనరీలో విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని, టైమ్ నిడివి ముందుగానే నిర్ణయించాలని సీఎం రేవంత్ సూచించారు.
ఈవెంట్స్ వారీగా ఒక్కో ఈవెంట్ కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలన్న సీఎం.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


