హైదరాబాద్: ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నవీన్ కుమార్ యాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం పనిచేస్తానని ఎలక్షన్ల సందర్భంగా తానిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని తెలిపారు.
రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రమాణస్వీకారం చేయడం తన అదృష్టమని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఎన్నికల్లో తనకు మద్ధతుగా నిలిచిన ఎంఐఎం పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


