అత్యంత ధనిక సీఎం చంద్రబాబు | Chandrababu Richest CM in India | Sakshi
Sakshi News home page

అత్యంత ధనిక సీఎం చంద్రబాబు

Aug 24 2025 6:02 AM | Updated on Aug 24 2025 7:20 AM

Chandrababu Richest CM in India

రూ.931 కోట్ల ఆస్తులతో దేశంలోనే అగ్రస్థానం.. రేవంత్‌రెడ్డికి ఆస్తుల్లో ఏడో ర్యాంకు.. క్రిమినల్‌ కేసుల్లో టాప్‌ 

క్రిమినల్‌ కేసుల్లో తర్వాతి స్థానాల్లో స్టాలిన్, చంద్రబాబు.. కేవలం రూ.15 లక్షలతో అత్యల్ప ఆస్తులున్న సీఎం మమతా బెనర్జీ 

అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ తాజాగా నివేదిక వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. రూ.931.83 కోట్ల ఆస్తులతో ఆయన అగ్రస్థానంలో  నిలవగా, ఆ తర్వాత స్థానా­ల్లో రూ.332.56 కోట్లతో అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ, రూ.51.93 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తాజా నివేదిక వెల్లడించింది. కేవలం రూ.15 లక్షల ఆస్తులతో అత్యల్ప ఆస్తులున్న పేద సీఎంగా పశ్చిమ బెంగాల్‌ సీఎంమమతా బెనర్జీ, ఆ తర్వాత స్థానంలో రూ.55 లక్షలతో జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఉన్నారు.

ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రూ.30 కోట్లకు పైగా ఆస్తులతో ఏడో స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా రూ.5.31 కోట్ల ఆస్తులతో 19వ స్థానంలో ఉన్నారు.    

30 మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,632 కోట్లు
దేశంలోని మొత్తం 30 రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.54.42 కోట్లు అని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్‌ సమీక్షించి ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఒక సీఎం సగటు స్వీయ ఆదా­యం రూ.13,34,738గా ఉంది. అలాగే, దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.1,632 కోట్లుగా ఉంది. అయితే, అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం ఖండూకు అత్యధికంగా రూ.180 కోట్లకు పైగా అప్పులున్నాయి. సిద్ధరామయ్యకు రూ. 23 కోట్లకు పైగా, చంద్రబాబుకు రూ.10 కోట్లకు పైగా రేవంత్‌రెడ్డికి రూ.1.30 కోట్ల అప్పులున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. 

క్రిమినల్‌ కేసుల్లో రేవంత్‌రెడ్డి టాప్‌ 
మరోవైపు.. అత్యధిక క్రిమినల్‌ కేసులున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిలిచారు. ఆయనపై మొత్తం 89 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ వెల్లడించింది. రేవంత్‌రెడ్డి తర్వాతి స్థానాల్లో 47 కేసులతో తమిళనాడు సీఎం స్టాలిన్, 19 కేసులతో చంద్రబాబు ఉన్నారు. ఇక 12 మంది (40%) ముఖ్యమంత్రులు వారిపై క్రిమినల్‌ కేసులను ప్రకటించుకున్నారని, 10 మంది (33%) వారిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్‌ బెదిరింపులకు సంబంధించిన తీవ్రమైన క్రిమినల్‌ కేసులను ప్రకటించారని ఆ నివేదిక పేర్కొంది.  

మొత్తం సీఎంలలో ఇద్దరే మహిళలు
ఇదిలా ఉంటే.. 30 మంది ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ, ఢిల్లీకి చెందిన రేఖాగుప్తా ఇద్దరే మహిళలు ఉన్నారు. అలాగే, 30 మంది సీఎంలలో తొమ్మిది మంది గ్రాడ్యుయేట్లు, ఆరుగురు ప్రొఫెషనల్‌ గ్రాడ్యు­యేట్లు, ఎనిమిది మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, ఇద్దరు ముఖ్యమంత్రులు డాక్టరేట్‌ పట్టా పొందారు. అఫిడవిట్లు దాఖలు చేసే సమయానికి ఆరుగురు ముఖ్యమంత్రులు 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు్కలు కాగా.. 12 మంది సీఎంలు 51 నుంచి 60 ఏళ్ల మధ్య వారని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement