
సాక్షి, హైదరాబాద్: ఎంపీ మిథున్‌రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. మళ్లీ మిథున్‌రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ నివాసంలో మిథున్‌రెడ్డిని సిట్ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. మళ్లీ మిథున్‌రెడ్డిని కక్ష సాధింపు కోసమే సిట్ విచారణ చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల కేంద్ర హోంమంత్రికి మిథున్‌రెడ్డి లేఖ రాశారు. సీబీఐ విచారణ డిమాండ్ చేయగానే మళ్ళీ మిథున్ రెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలపై అనుమానాలు కలుగుతున్నాయి.
కాగా, చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు కూటమి ప్రభుత్వ కుతంత్రంలో భాగంగానే ఆయన్ను సిట్ అరెస్టు చేసిన విషయం విదితమే. అందుకు ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ పీఎల్‌ఆర్ కంపెనీ సాధారణ లావాదేవీలకు కుట్ర పూరితంగా సిట్ వక్ర భాష్యం చెప్పింది. పీఎల్‌ఆర్ కంపెనీ నిర్మాణ కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టు చేసేందుకు డికార్ట్ కంపెనీ 2019లో ఒప్పందం చేసుకుంది.
కాంట్రాక్టు పనుల బ్యాంకు గ్యారంటీ, ఈఎండీ కోసం రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తి అనంతర పరిణామాల్లో డికార్ట్ కంపెనీ సబ్ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగింది. దాంతో ఆ కంపెనీ తమకు చెల్లించిన రూ.5 కోట్లను పీఎల్‌ఆర్ కంపెనీ వాపసు చేసింది. ఇదంతా బ్యాంకు బదిలీ ద్వారానే పూర్తి పారదర్శకంగా జరిగిన సాధారణ లావాదేవీ. ఆ అధికారిక రికార్డులను కూడా పీఎల్‌ఆర్ కంపెనీ సమర్పించింది. (2014–24 వరకు) కంపెనీకి చెందిన రికార్డులను కూడా సిట్ అధికారులు పరిశీలించారు.
అయినా సరే కూటమి ప్రభుత్వ కుట్రలో భాగంగానే మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. తద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సిట్ యత్నించింది. కాగా మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో సిట్ అభియోగాల్లో పస లేదన్నది స్పష్టమైంది. మిథున్ కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ కంపెనీకి డికార్ట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ రూ.5 కోట్లు బదిలీ చేయడం మద్యం కుంభకోణం కోసమేనని సిట్ నిరాధార అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలను మిథున్ రెడ్డి, పీఎల్‌ఆర్ కంపెనీ ఆధారాలతో సహా తిప్పికొట్టినా సిట్ పదే పదే అదే అభియోగం ఆధారంగానే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసింది. అసలు వాస్తవాలను మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు పూర్తి ఆధారాలతో న్యాయస్థానానికి నివేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయనకు న్యాయస్థానం గత నెల (సెప్టెంబర్ 29న)బెయిల్ మంజూరు చేసింది.
