
PC: ICC
ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సౌతాఫ్రికా తమ క్రికెట్ జట్టును ప్రకటించింది. టెంబా బవుమా (Temba Bavuma) సారథ్యంలోని వన్డే జట్టులో డెవాల్డ్ బ్రెవిస్ చోటు దక్కించుకోగా.. ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలోని టీ20 టీమ్‌లోకి విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పునరాగమనం చేశాడు.
మహరాజ్‌కు పిలుపు
మిల్లర్‌తో పాటు డొనోవాన్ ఫెరీరా.. అదే విధంగా.. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) కూడా టీ20 జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక గాయాల కారణంగా పొట్టి ఫార్మాట్‌కు దూరమైన ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ (బొటనవేలి గాయం), లిజాడ్ విలియమ్స్ (మోకాలి గాయం) కూడా తిరిగి జట్టులో స్థానం సంపాదించారు.
ఇక కుడికాలి చీలమండ నొప్పి వల్ల ఆస్ట్రేలియా (AUS vs SA)తో వన్డే సిరీస్‌కు దూరమైన కగిసో రబడ.. ఇంగ్లండ్ సిరీస్‌లకు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు. అయితే, అతడికి కవర్ ప్లేయర్‌గా లెఫ్టార్మ్ సీమర్ క్వెనా మఫాకాను వన్డే జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు.
వన్డే సిరీస్ కైవసం
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్ చేతిలో 2-1తో ఓడిపోయిన ప్రొటిస్ జట్టు.. వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.
ఆసీస్ టూర్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా జట్టు.. తదుపరి సెప్టెంబరు 2- 14 వరకు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కాగా చివరగా 2022లో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన ప్రొటిస్ జట్టు.. వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అదే విధంగా టీ20 సిరీస్‌లో 2-1తో గెలుపొందింది.
బవుమా అన్ని మ్యాచ్‌లు ఆడడు
ఇక బవుమా వన్డే జట్టుకు సారథిగా కొనసాగినా.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా.. అతడి గైర్హాజరీలో మార్క్రమ్ జట్టును ముందుండి నడిపించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. కేశవ్ మహరాజ్ గత రెండు సందర్భాల్లోనూ టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. జింబాబ్వే, ఆస్ట్రేలియాలతో పొట్టి సిరీస్‌లకు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
అయితే, ఆసీస్‌తో తొలి వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టుకు సంచలన విజయం అందించిన కేశవ్ ఇంగ్లండ్ టూర్‌తో టీ20లలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మరోవైపు.. ఫ్రాంఛైజీ క్రికెట్ కారణంగా ది హండ్రెడ్ లీగ్‌లో ఆడే నిమిత్తం ఆసీస్‌తో టీ20లకు దూరమైన మిల్లర్ తిరిగి జట్టులోకి రావడం గమనార్హం.
ఇంగ్లండ్‌తో వన్డేలకు సౌతాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, లుంగీ ఎంగిడి, లువాన్-డ్రీ ప్రిటోరియస్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్.
ఇంగ్లండ్‌తో టీ20లకు సౌతాఫ్రికా జట్టు
ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, డొనోవన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, డేవిడ్ మిల్లర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, లువాన్-డ్రి ప్రిటోరియస్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.
చదవండి: ‘జట్టు నుంచి తప్పిస్తా’!.. ద్రవిడ్.. అతడిని నా దగ్గరికి రావొద్దని చెప్పు.. సెహ్వాగ్ వార్నింగ్