విశాఖ వేదికగా భారత్‌తో నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. కీలకమైన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌లో తడబడిన ఆ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
సిరీస్‌లో తొలిసారి టాస్ గెలిచిన భారత్ పరిస్థితులను అద్భుతంగా సద్వినియోగం చేసుకొని సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో.. ఆతర్వాత బ్యాటింగ్‌లో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు.
బౌలింగ్‌లో కుల్దీప్, ప్రసిద్ద్ కృష్ణ సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో.. రోహిత్, కోహ్లి బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా చేయాలని అనుకున్నాం. కానీ బోర్డుపై సరిపడా పరుగులు పెట్టలేకపోయాం. ఇన్నింగ్స్ మధ్యలో వికెట్లు బహుమతిగా ఇచ్చేయడం వల్ల ఒత్తిడి పెరిగింది. 50 ఓవర్ల మ్యాచ్‌లో ఆలౌట్ కావడం ఎప్పుడూ కష్టమే.
డికాక్ అద్భుతంగా ఆడినా, ఇతర బ్యాటర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. కీలక సమయాల్లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. అందువల్లే జట్టు కష్టాల్లో పడింది. వ్యక్తిగతంగా నా ఇన్నింగ్స్‌కు శుభారంభం లభించినా, ఆతర్వాత దారి తప్పాను. మొదటి రెండు వన్డేల్లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధైర్యం చూపాము. కానీ ఈ మ్యాచ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో వికెట్లు కోల్పోయాము.
తొలుత బంతితో బాగా పోరాడాం. మొదటి స్పెల్‌లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ బోర్డుపై సరిపడా స్కోర్ లేకపోవడంతో భారత బ్యాటర్లు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మొత్తంగా భారత జట్టు తమ నాణ్యతను చూపించింది. మేము తెలివిగా ఆడలేకపోయాముం.
ఈ సిరీస్‌లో చాలా పాఠాలు నేర్చుకున్నాము. జట్టుగా ఎదిగాము. మేము ఎప్పుడూ ప్రత్యర్థిపై దాడి చేయాలని మాట్లాడుకుంటాం. భారత్‌కి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నా, వారిపై ఒత్తిడి పెట్టగలిగాం. పరిస్థితులను గుర్తించి మరింత తెలివిగా ఆడటం నేర్చుకోవాలి. పది బాక్సుల్లో ఆరు లేదా ఏడు టిక్ చేశామని అనుకుంటున్నానని బవుమా అన్నాడు.


