Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Govt By Vardhelli Murali1
పరిపాలన మహాపతనం!

‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రంగా బయటకొస్తున్నది. ఆ చిత్రాల్లో కంచే చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తున్నది. అండగా నిలబడవల సిన ప్రజా ప్రతినిధుల కళ్లలోంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్స హాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమినీ భూగర్భాన్నీ, యేటిలోని ఇసుకనూ, గట్టు మీది మట్టినీ కబళిస్తున్న కబంధ హస్తాలు కనిపిస్తున్నాయి.‘ధిక్కారముల్‌ సైతుమా’ అంటున్న కంసమామల హింస రచన ఊరూవాడల్ని దాటి అడవులూ, కొండల్లోకి పాకింది.మంత్రుల పేషీలకి మూటలు మోసే బ్రోకరేజి పనులు చేయలేన న్నందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ‘మా మంత్రిగారు పర్యటనకొస్తే స్టార్‌ హోటల్‌లో సేద దీరేందుకు ఏసీ రూమ్, పక్కనే ఇంకో రూమ్‌ పెట్టుకుని ఆ పనులకే పరిమిత మవుతార’ని సొంత పార్టీ నాయకుడే సర్కార్‌ వారి ఛానల్‌లో దండోరా వేశాడు. ఇలాంటి కథలింకెన్నో! వెలుగు చూసిన వాటిలో మంత్రుల లీలలూ, ఎమ్మెల్యేల విన్యాసాలూ, ఇతర నాయకుల కళలూ డజన్లకొద్దీ ఉన్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చడతొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తున్నది. ఆవు గట్టున మేస్తే ఈ పరిస్థితి రాదు కదా! ఎమ్మెల్యేల మీద, నాయ కులు, మంత్రుల మీద జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయన ఫలానా వారి మీద చాలా సీరియస్‌ అయ్యారనీ, గట్టిగా మంద లించారనీ యెల్లో మీడియాకు ‘విశ్వసనీయంగా’ తెలియవస్తుంది. కథ అంతటితో ముగిసిపోతుంది. ఒకరిద్దరు నేతలనైతే ‘వివరణ’ పేరుతో ముఖ్యమంత్రి పిలిపించినట్టున్నారు. వారు గట్టిగా ఎదురు తిరిగారనీ, దాంతో ఆయన... అయితే ఓకే అని పంపించారని మనకు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆ తదుపరి చర్యలేమీ లేకపోవడమే ఈ నిర్ధారణకు ఆధారం.నైతికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఇంతగా దిగ జారిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా కూడా దాచిపెట్టలేకపోతున్నది. ముఖ్యమంత్రి సీరి యస్‌ అయ్యారని చెప్పడం కోసమైనా ఒకటి రెండు ఉదంతా లను వారే స్వయంగా వెలుగులోకి తెస్తున్న వింత పరిణామాన్ని చూస్తున్నాము. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కొందరు సీనియర్‌ నాయకులు సైతం దుర్గంధ భరితమైన ఈ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పతనాన్ని స్థూలంగా మూడు భాగాలుగా మనం విభ జించవచ్చు. 1. నేతల విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవ ర్తన, 2. పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం, 3. రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు.విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవర్తన ఈ అంశంపై 14 నెలల కాలాన్ని సమీక్షించాలంటే ఓ గ్రంథమే రాయవలసి ఉంటుంది. ఒకటి రెండు వారాలుగా వెలుగు చూస్తున్న కొద్దిపాటి ఉదంతాలను పరికిస్తే చాలు. వ్యవ సాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్‌ జీఎమ్‌గా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈమధ్య చీఫ్‌ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. మంత్రిగారి (అచ్చెన్నాయుడు) పేషీలోని అధికారి ఒకా యన తనను పిలిచి ఆగ్రోస్‌ కొనుగోళ్లకు సంబంధించిన కమీష న్లను తమకు మాట్లాడిపెట్టే మధ్యవర్తిత్వం చేయాలని సూచించా రని ఆయన ఉత్తరంలో ఆరోపించారు. ఈ పనికి తాను అంగీక రించకపోవడంతో తనను బదిలీ చేసి, అర్హత లేని ఒక జూనియర్‌ అధికారిని అక్కడ నియమించారని ఆయన సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యా లేదు.తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్‌రెడ్డి అనే సీనియర్‌ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబీఎన్‌ టీవీ ఛానల్‌ డిబేట్‌లో పాల్గొ న్నారు. తమ జిల్లాకు రెగ్యులర్‌గా వచ్చే మంత్రి ఫైవ్‌స్టార్, సెవెన్‌ స్టార్‌ హోటళ్లలో దిగి తన రూమ్‌తోపాటు ఇంకో అనుబంధ రూమ్‌ను కూడా మెయిన్‌టెయిన్‌ చేస్తాడనీ, పార్టీ వారికి మాత్రం అందుబాటులో ఉండరని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అదు పులో పెట్టవలసిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక వారి సంగతి చెప్పడానికేముందని ఆయన వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్‌కు సంబంధించిన పెరోల్‌ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పెరోల్‌ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌ ప్రభుత్వానికి లేఖలు రాశారట! జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కొంతకాలం సమాజంలో గడపడానికి కాలపరిమితితో, షరతులతో కూడిన విడు దలనే ‘పెరోల్‌’ అంటాము. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ఈయనకు గతంలో జైలు నుంచి పారి పోయిన రికార్డు కూడా ఉన్నది. అందువల్ల హోంశాఖ అధికా రులు సిఫారసును తిరస్కరించారట! అయితే మంత్రిస్థాయిలో ఆమోదం లభించింది. ఎలా సాధ్యం? డబ్బులు చేతులు మారైనా ఉండాలి. మానవీయ కోణంతోనైనా ఆమోదించి ఉండాలి. లేదా అత్యున్నత స్థాయి ఆదేశాలైనా ఉండాలి. సుగాలి ప్రీతి మీద లేని మానవీయ కోణం రౌడీషీటర్‌ విషయంలో ఉంటుందా?మంత్రులకు సంబంధించిన పై మూడు ఉదంతాలు చాలా తీవ్రమైనవి. ఆరోపణలు నిజం కాకపోతే సాక్ష్యాధారాలతో కూడిన వివరణలు వారు స్వయంగా ఇచ్చి ఉండవలసింది. ఇక్కడ అర్ధాంగీకారాలు ఉండవు. కనుక ఈ మౌనాన్ని పూర్తి అంగీకారంగానే జనం భావిస్తారు. ఎమ్మెల్యేల కథలైతే బేతాళ కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్‌ పోస్టు దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్‌ సౌమ్య ఆరోపించారు. విసిగి వేసారిన ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. దాని మీద ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. కానీ, ఒక మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే రాత్రిపూట వీడియోకాల్స్‌ చేయవలసిన అవసరమేమిటనేదే కీలకమైన ప్రశ్న. చోడవరం ఎమ్మెల్యేపైనా, గుంటూరు ఎమ్మెల్యేపైనా వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్‌ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని యెల్లో మీడియానే రాసింది. ఇలా అనేకమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని కూడా ఆ మీడియానే రాసింది. కొస మెరుపుగా అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం మాత్రం మరచిపోలేదు. అయినా ఈ దందాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.రాష్ట్రమంతటా మద్యం ఏరులై ప్రవహిస్తున్నది. నాలుగు వేలకుపైగా లైసెన్స్‌డ్‌ షాపులకు అనుబంధంగా భారీ పర్మిట్‌ రూమ్‌లకు ఈమధ్యనే అనుమతులిచ్చారు. 75 వేలకు పైగా బెల్టు షాపులు ఇప్పటికే గలగలలాడుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఎక్సైజ్‌ ఆదాయం 24 వేల కోట్లయితే, మిగిలిన నాలుగేళ్లు నలభై వేల కోట్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం లక్షా 84 వేల కోట్లు. నాయకుల కమిషన్‌ బెల్ట్‌ షాపుల్లో 20 శాతం, లైసెన్స్‌డ్‌ షాపుల్లో 5 శాతం, పర్మిట్‌ రూమ్‌లు ఇచ్చిన నేపథ్యంలో 10 శాతంగా చెబుతున్నారు. సగటున 10 శాతం లెక్క వేసినా 18 వేల కోట్ల పైచిలుకు సర్కారు వారి కోటా. ఒక్కో ఎమ్మెల్యే సామ్రాజ్యంలో వంద కోట్లకు పైగానే మద్యం గిట్టుబాటనుకోవాలి.పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసంవాగ్దాన భంగం కూడా పాలనా వైఫల్యం కిందకే వస్తుంది. దానికదే ఒక పెద్ద పరిశీలనాంశం. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్య తగా ‘సూపర్‌ సిక్స్‌’ను కూటమి ప్రకటించింది. ఈ ‘సూపర్‌ సిక్స్‌’ సూపర్‌ హిట్‌ అయింది. అన్నీ అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వ్యయమయ్యే రెండు ప్రధాన హామీల జోలికి ఆయన అసలు వెళ్లలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఉద్యోగాల సంగ తేమో కానీ ఉన్న ఉద్యోగాలకు అంటకత్తెర పడుతున్నది. మేని ఫెస్టో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని కనీసం కోటిమందికి (రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలున్నాయి) లెక్క వేసుకున్నా 14 నెలల్లో 42 వేల కోట్లు బకాయిపడ్డారు.మరో ముఖ్యమైన హామీ ‘ఆడబిడ్డ నిధి’. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలో ఈ వయసుల్లో ఉన్నవారు సుమారు ఒక కోటి 80 లక్షలమంది (ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం, 59 పై వయసు వారిని మిన హాయించగా) ఉన్నట్టు అంచనా. వీరందరికీ తొలి ఏడాది 18 వేల రూపాయల చొప్పున ఎగనామం పెట్టినట్టే! ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. మిగిలిన నాలుగు హామీ లను అరకొరగా అమలు చేయడం తెలిసిందే. ‘అన్నదాత సుఖీ భవ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20 వేలు, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైనా ఈపాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5 వేలు మాత్రమే! ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళ లకు 14 నెలలు ఎగవేసి అనేక మినహాయింపులతో వారం రోజుల కింద ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ తొలి సంవ త్సరం రద్దు. రెండో సంవత్సరం కోతలతో అమలు చేశారు. హామీ ప్రకారం ఈపాటికి ప్రతి ఇంటికీ నాలుగు ఉచిత గ్యాస్‌ బండలు అంది ఉండాలి కానీ, చాలాచోట్ల ఒకటి మాత్రమే అందింది.ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇంటి దగ్గరికి నడిచొచ్చిన జగన్‌ రోజులెక్కడ, ఈరోజులు ఎక్కడని జనం బేరీజు వేసుకుంటున్నారు. పెన్షన్‌ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా? కంటికి కనిపిస్తున్న అంగవైకల్యానికి సర్టిఫికెట్‌ ఇవ్వాలంటే లంచాలడుగు తున్న నికృష్టమైన అవినీతి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న దని విమర్శించి 14 నెలల్లోనే ఆయన 60 నెలల్లో చేసిన అప్పులో 56 శాతం చేసేశారు. ప్రాథమిక వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. జగన్‌ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో సహా వైద్యరంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు. వాటిని లోతుగా పరిశీలించిన వారెవరికీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కు తాయన్న నమ్మకం లేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వేలమంది కార్మికు లను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేట్‌పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ముడి పదార్థాల సరఫరా నియంత్రణ, విద్యుత్‌ను అందజేసే థర్మల్‌ ప్లాంట్లలో 44 విభాగాలు, బ్లాస్ట్‌ ఫర్నేస్‌కు సంబంధించిన కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నవనాడుల్ని తెగ్గోసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఊపిరి మిగిలి ఉంటుందా? ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల పరిస్థితి దిగజారిపోయిందనడానికి జీఎస్‌టి వసూళ్లే పెద్ద సాక్ష్యం. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్‌ సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలు మార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా భ్రష్టుపట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఐఏఎస్‌ అధికారులు తనకు ఎదురొచ్చి కుర్చీ వేయలేదని మండిపడ్డ ఒక ఎమ్మెల్యేను చూశాము. ప్రభుత్వ అధికారులను బండబూతులు తిడుతున్న నాయకులను చూస్తున్నాము. అధికా రులు తమకు కమీషన్‌ ఏజెంట్లుగా పనిచేయాలని డిమాండ్‌ చేస్తున్న మంత్రుల పేషీలను చూస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని చివరకు ఎక్కడిదాకా నడిపిస్తారో తెలియని అగమ్య గోచరంగా పరిస్థితి మారింది.రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలుచంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పెళ్లిళ్లు, తీసుకున్న విడాకులు న భూతో న భవిష్యతి. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికి మూడుసార్లు చేరారు. మొదటిసారి విడాకులు ఇచ్చినప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించారు. రెండో విడా కుల తర్వాత ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయడం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ఠ. జగన్‌మోహన్‌రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో రహస్య స్నేహం మొదలు పెట్టారు. 2012లోనే ఈ విషయంపై ‘రహస్య మిత్రులు?’ పేరుతో ‘ఇండియా టుడే’ కవర్‌ పేజీ కథనాన్ని ప్రచురించింది.అప్పుడు మొదలైన స్నేహం పుష్కరకాలం దాటినా అవిచ్ఛి న్నంగా కొనసాగుతూనే ఉన్నది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా కూడా పనిచేశాయి. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్య మంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈమధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్‌ తాపత్రయపడుతూనే ఉన్నది. ఆ పార్టీ ఆంధ్ర, తెలంగాణా విభా గాలు ఇప్పటికే బాబు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నా యనేది ఆ రాష్ట్రాల ప్రజలకు తెలిసిన సంగతే. బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ‘ఇండియా కూటమి’లో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.కాంగ్రెస్‌ ఎం.పి. మల్లు రవి ఈమధ్యన ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్‌ – చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి కూడా ఉన్నారు కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు సాక్ష్యాలు, ఆధారాల ప్రాతి పదికన తీర్పులు చెబుతారు. అందుకు దశాబ్దాల తర్వాత కూడా కృతజ్ఞత చూపెట్టడం దేనికో... ఈ సందర్భంలో కాంగ్రెస్‌ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్‌ – బాబుల మధ్యన హాట్‌లైన్‌ లేదంటే నమ్మశక్యమా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Farmers face hardship due to severe shortage of urea in Andhra Pradesh2
సర్కారు డ్రామా.. ఎరువులు భ్రమ

యూరియా విషయంలో ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే, గ్రామాల్లో కళ్లకు కనిపిస్తున్నది మరొకటి. మొన్నటి దాకా తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రైతుల ఆందోళనలు చూసి మాట మార్చారు. అక్రమంగా ఎలా తరలి వెళుతోందని.. అలా తరలి పోయిన యూరియా నిల్వలను తిరిగి స్వాధీనం చేసుకోండంటూ హూంకరిస్తున్నారు. దౌర్జన్యంగా, లోపాయికారిగా, అక్రమంగా యూరియా నిల్వలను తమ గోదాములకు తరలించుకు పోయింది కూటమి పార్టీల నేతలే. మరి వారి వద్ద నుంచి నిజంగా ఒక్కటంటే ఒక్క బస్తా అయినా అధికారులు స్వా«దీనం చేసుకోగలిగారా? ‘ముఖ్యమంత్రి సీరియస్‌..’ అని ఎల్లో మీడియాలో డ్రామా వార్తలు మినహా ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు. సర్కారు నిర్వాకంతో ఊరూరా చిన్న, సన్నకారు రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్‌కు సరిపడా నిల్వలున్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ చేస్తున్న ప్రకటనలకు.. వాస్తల పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఇప్పటికే ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వ.. ఇప్పుడు ఆర్బీకేలను ఇంకా పతనావస్థకు తీసుకెళ్తూ.. ఇక్కడికి రావాల్సిన యూరియా స్టాకును అటు నుంచి అటే బ్లాక్‌ మార్కెట్‌కు మళ్లించేందుకు అధికార పార్టీల నేతలకు స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వారు వ్యాపారులతో కమీషన్లు తీసుకుని అధిక ధరలతో విక్రయించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఇందుకోసం మార్కెట్‌లో యూరియాకు కృత్రి­మ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటు­న్నారు. యూరియా దొరకడం గగనంగా మారడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చిన స్టాక్‌ను వచ్చినట్లు టీడీపీ నేతలు దారి మళ్లించిన విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకో­లేక­పోయినా.. చర్యలు తప్పవంటూ ఎల్లో మీడియా వేదికగా సీరియస్‌ అయినట్లు డ్రామాలతో రైతులను మభ్యపెడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌)తో పాటు రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ద్వారా సరఫరాను పెంచాలని రైతుల నుంచి డిమాండ్‌ వస్తోందని జిల్లా కలెక్టర్లు ప్రభు­త్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు మార్క్‌ఫెడ్‌–ప్రైవేటు వ్యాపారులకు ఇప్పటివరకు ఉన్న 50ః50 నిష్పత్తిలో జరుపుతున్న ఎరువుల కేటాయింపులను ఇక నుంచి 70ః30 నిష్పత్తిలో కేటాయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా ఆచరణకు నోచుకోలేదు. స్టాకు లేక మూతపడిన సొసైటీలు అధిక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీరు దిగిన మెట్ట పంటలతో పాటు ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియా అత్యవసరం. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు అదును దాటకముందే యూరియా బూస్టర్‌ డోస్‌ వెయ్యాలి. కానీ.. ఒక్క బస్తా యూరియా కూడా దొరకని పరిస్థి­తి నెలకొంది. మార్క్‌ఫెడ్‌ వద్ద చాలినంత స్థాయిలో యూరియా నిల్వల్లేని కారణంగా ఆర్‌ఎస్‌కేలతో పాటు మెజార్టీ సొసైటీలు శనివారం మూసివేశారు. నో స్టాక్‌ బోర్డులు పెట్టకపోయినప్పటికీ యూరియా నిల్వల్లేని కారణంగా రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సొసైటీలను మూయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కొద్దిపాటి నిల్వలున్న సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అన్ని జిల్లాల్లోనూ కన్పిస్తున్నాయి. 80 శాతం ప్రైవేట్‌ డీలర్ల వద్దే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 11.84 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా, దాంట్లో అత్యధికంగా యూరియా 4.89 లక్షల టన్నులు, కాంప్లెక్స్‌ 4.08 లక్షల టన్నులు, డీఏపీ 1.53 లక్షల టన్నులు, ఎస్‌ఎస్‌పీ 76 వేల టన్నులు, ఎంవోపీ 57 వేల టన్నులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 6.23 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం డిమాండ్‌ ఎక్కువగా ఉన్న యూరియా కేవలం 1.50 లక్షల టన్నులు, డీఏపీ 84 వేల టన్నులు మాత్రమే ఉంది. 17 జిల్లాల్లో యూరియా, 11 జిల్లాల్లో డీఏపీ డిమాండ్‌ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న నిల్వల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు డీలర్ల వద్దే ఉన్నాయి. సొసైటీలు, ఆర్‌ఎస్‌కేల్లో అరకొరగా ఉండడంతో పంపిణీలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.400 చొప్పున, డీఏపీ రూ.1,400 నుంచి రూ.1550 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఈ సీజన్‌లో యూరియాతో పాటు ఎరువులు అధికంగా వాడేస్తున్నారంటూ ప్రభుత్వం తమను తప్పుపడుతుండడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. బస్తా కూడా పట్టుకోలేని టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రైతుల ముసుగులో సొసైటీలు, రైతుసేవా కేంద్రాలకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను టీడీపీ నేతలు పక్కదారి పట్టించి, బ్లాక్‌లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వ్యవసాయేతర అవసరాలతో పాటు సరిహద్దు జిల్లాలు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న యూరియాను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్సు బృందాలు మొక్కుబడి తనిఖీలకే పరిమితమయ్యాయి. టీడీపీ నేతల గోదాముల జోలికి మాత్రం పోవడం లేదని స్పష్టమవుతోంది. అధికార టీడీపీ నేతల గోదాములను తనిఖీ చేసి, పెద్ద ఎత్తున నిల్వ చేసిన యూరియా నిల్వలను ఒక్క చోట అయినా వెలికి తీశారా అని ఏపీ వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని ఊళ్లలో అదే దుస్థితి ⇒ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి వచ్చిన 266 బస్తాల యూరియాను గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలే పప్పుబెల్లాల్లా పంచుకున్నారు. మిగిలిన స్టాక్‌ను స్థానిక టీడీపీ నాయకుడు రూ.430 చొప్పున అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రస్తుతం ఒక్కో రైతుకు కేవలం ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీఏసీఎస్‌లు, ప్రైవేట్‌ ఫెర్టిలైజర్స్‌ దుకాణాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. పెడన మండలం నందమూరు విశాల సహకార పరపతి సంఘం వద్దకు అన్నదాతలు భారీగా తరలి రావడంతో పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. గన్నవరంలో ఓ ఫెర్టిలైజర్‌ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. వ్యవసాయ శాఖ కొత్తగా పెట్టిన నిబంధనల మేరకు అన్నదాతలు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్, కౌలుకార్డు వెంట తీసుకుని వచ్చారు. ⇒ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ప్రైవేటు ఎరువుల దుకాణం వద్ద శనివారం రైతులు పడిగాపులు కాశారు. ఇక్కడ కేవలం 120 బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ వైవీ పద్మావతి, వ్యవసాయ శాఖ ఏఓను నిలదీసి ఎరువుల షాప్‌ షట్టర్‌ దించేశారు. దీంతో పంపిణీ వాయిదా పడింది. ⇒ అనకాపల్లి జిల్లా మునగపాకలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో రైతులు పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎరువుల నిల్వలు ఏమయ్యాయో చెప్పాలని రైతులు నిలదీశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు ఒడిశాకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు. స్థానికంగా యూరియా కొనాలంటే అదనంగా జింకు, ఇతర మందులు కొనుగోలు చేయాలంటూ డీలర్లు తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ రైతులు వాపోయారు. ⇒ కాకినాడ జిల్లా సామర్లకోటలోని నీలమ్మ చెరువు వద్ద ఉన్న ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా పంపిణీకి టోకెన్లు పంపిణీ చేస్తుండగా తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది టోకెన్లు పంపిణీ నిలిపి వేశారు. ⇒ ఏలూరు జిల్లాలో యూరియా కొరతే లేదని కలెక్టర్‌ ప్రకటించారు. అయితే కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న శనివారపుపేట కోఆపరేటివ్‌ సొసైటీకి శనివారం సిబ్బంది తాళాలు వేశారు. టీడీపీ అనుచరులకే యూరియా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలోని టీడీపీ నాయకులు వీఏఏ (విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌) లేకుండానే దౌర్జన్యంగా ఆర్‌ఎస్‌కే తలుపులు తీసి తమ అనుచర వర్గానికి యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఆర్‌ఎస్‌కేకు వచ్చిన 450 యూరియా బస్తాల పంపిణీని శనివారం చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ బత్తుల జ్యోతీశ్వరరావు ఆర్‌ఎస్‌కేకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. అప్పటికే 70 శాతం మేర యూరియా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేశారు. ఎరువుల అడ్డగోలు పంపిణీపై ఏం చర్యలు తీసుకుంటారని వీఏఏ ఎం.కుసుమను సర్పంచ్‌ ప్రశ్నించారు.గోదాం వద్దకు వెళ్తుంటే తమ్మినేని అరెస్ట్‌ శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస రైల్వే గూడ్స్‌ గోదాం వద్ద నుంచి ఎరువులు పక్కదారి పడుతున్నాయనే సమాచారంతో శనివారం కుమారుడు చిరంజీవి నాగ్‌తో కలిసి అక్కడికి బయలుదేరిన మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వాహనాన్ని అడ్డుకుని వెనుదిరగాలని కోరారు. తమ్మినేని వెనుదిరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు ముందుకు కదలనీయలేదు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ఆయన్ను బలవంతంగా జీపు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్‌ వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావుతో మాట్లాడుతూ జిల్లాకు ఎన్ని బస్తాల ఎరువులు వచ్చాయి, ఎన్ని ఇచ్చారని ప్రశ్నించగా ఆయన కాకి లెక్కలు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలైనా ఎరువులు ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. బహిరంగ మార్కెట్‌లోనూ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో ప్రజా పోరాటం చేస్తామని ప్రకటించారు.వ్యవసాయం చేయలేం ప్రస్తుతం వరి పంటకు పొటాష్‌, యూరియా చాలా అవసరం. పొటాష్‌ను పెద్దాపురంలో బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి కొనుగోలు చేశాను. కానీ యూరియా లభించడం లేదు. సొసైటీ వద్ద రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారు. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఇలాగైతే ఎలా? – గుణ్ణం వీర్రాజు, రైతు, సామర్లకోట

Weekly Horoscope In Telugu From 24-08-2025 To 30-08-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలకు ఇబ్బంది ఉండదు. శత్రువులనుకున్న వారు మిత్రులుగా మారతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు శ్రమకు ఫలితం దక్కే అవకాశం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.వృషభం...మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. ముఖ్య వ్యవహారాలను సకాలంలో చక్కదిద్దుతారు. నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుండి బయటపడతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు శుభవార్తలు వింటారు. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. ధనవ్యయం. ఒత్తిడులు. పసుపు, బంగారు రంగులు. శ్రీదక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.మిథునం...ఆర్థికంగా మరింత సర్దుబాట్లు కాగలవు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కుటుంబసమస్యలను స్వయంగా పరిష్కరించుకుంటారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వాహనసౌఖ్యం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. కళాకారులు, వైద్యరంగం వారికి మరింత ప్రోత్సాహం. వారం మధ్యలో ధననష్టం. బంధువిరోధాలు. అనారోగ్యం. గణపతి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...కొన్ని కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. కొన్ని వ్యతిరేక పరిస్థితుల మధ్య ఎదురీదవలసి వస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. స్థిరాస్తి వివాదాలతో కుస్తీపడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. పసుపు, నేరేడు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.సింహం....కొన్ని నిర్ణయాలు బంధువులను ఆశ్చర్యపరుస్తాయి. కాశీ, ప్రయాగ వంటి యాత్రలు చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలను విస్తరించడంలో కొందరి సాయం అందుతుంది. ఉద్యోగాలలో యుక్తిగా బాధ్యతలు నిర్వహిస్తారు. వైద్యరంగం, క్రీడాకాకారులకు ఊహించని సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.కన్య...ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలను పెంచుచకుంటారు. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు వృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో తగినంత గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి కొత్త అవకాశాలు కొన్ని దక్కవచ్చు. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.తుల...చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వాహనయోగం. వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. సోదరులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలను చాకచక్యంగా నిర్వహించి లాభాలు దక్కించుకుంటారు. వైద్యరంగం ,రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...ఊహించని సంఘటనలు ఎదురుకావచ్చు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆస్తి వివాదాల పరిష్కారంపై దృష్టి సారిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. క్రీడాకారులు,పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం చివరిలో మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...అనుకున్న కార్యక్రమాలను చక్కదిద్ది ఊరట చెందుతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మీరు అనుకున్నంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చికాకులు, చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మకరం...ముఖ్యమైన వ్యవహారాలను కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ విశేష గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. వివాహాది కార్యక్రమాల నిర్వహణపై ఆలోచనలు సాగిస్తారు. కొన్ని వివాదాలు మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. కళారంగం, రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కుంభం...కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు చర్చలు జరుపుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్నంత ప్రగతి సాధిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు మరింత పెంచుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో ఎదురయ్యే ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. వైద్యులు, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. అధిక ఖర్చులు. ఆకుపచ్చ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.మీనం...కొన్ని సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. అనుకున్న వ్యవహారాలు నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. క్రీడాకారులు, సాంకేతిక వర్గాలకు ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక ఆందోళన. గులాబీ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

YS Jagan Sensational Tweet On AP Financial Situation4
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభు­త్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ నమ్మబలికిన టీడీపీ, జనసేన కూటమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేసిందని తూర్పారబట్టారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు కూటమి సర్కార్‌ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే.. ⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య అప్పటి విపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీ లు పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేశాయి. ప్రభుత్వ విధానాల వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు కీలక రంగాల్లో మూల ధన వ్యయం బాగా తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం దారుణంగా తగ్గుతోందని.. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని, అది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని నిందించాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని చాలా వేగంగా పెంచడంతో పాటు, అప్పులు పెరగకుండా చూస్తామని గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ లు హామీ ఇచ్చాయి.⇒ కానీ.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒకసారి పరిశీలిస్తే, కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాది (2023–24)తో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అదే సమయంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే, కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 12.04 శాతం పెరుగుదల నమోదైంది. మరి ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 12.02 శాతం ఉంటే, ప్రభుత్వ సొంత ఆదాయం అత్యల్పంగా 3.08 శాతం వృద్ధికే ఎందుకు పరిమితమైంది? ⇒ గత ఏడాది రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అదే ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయంతో, ఇప్పుడు 2025–26లో మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి వచి్చన ఆదాయాన్ని (సీఎజీఆర్‌) పరిగణనలోకి తీసుకుంటే అది కేవలం 2.39 శాతం మాత్రమే పెరిగింది. వాస్తవానికి అది కనీసం 10 శాతం ఉండాల్సి ఉంది. ⇒ మరో అత్యంత ఆందోళకర అంశం రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడం. వైఎస్సార్‌సీపీ హయాంలో 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు (పబ్లిక్‌ డెట్, పబ్లిక్‌ ఎక్కౌంట్, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ల అప్పులు) రూ.3,32,671 కోట్లు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లో చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,86,361 కోట్లు. అంటే గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పులో 56 శాతం రుణాలను కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే చేసింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అప్పులు ఆకాశాన్ని అంటే విధంగా పెరగడం అత్యంత ఆందోళనకరం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తమ విధానాలను పునరాలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ విధానాల వల్ల తీవ్ర అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా దగండి పడింది.

Farmers are facing urea woes in Telangana5
ఇష్టానుసారం ఇచ్చేసి... ఇక్కట్ల పాల్జేసి..

సాక్షి, హైదరాబాద్‌: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథలు తప్పడం లేదు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కనిపించని దృశ్యాలు ఇప్పుడు పల్లెల్లో గోచరిస్తున్నాయి. యూరియా కోసం సూర్యోదయానికి ముందు నుంచే రైతులు వ్యవసాయ సహకార సొసైటీల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూలు కడుతున్నారు. నిలబడలేని రైతులు పట్టా పాస్‌ పుస్తకాలు, ఆధార్‌ కార్డులు, చెప్పులు క్యూల్లో పెట్టి సొసైటీలు తెరిచి యూరియా ఇచ్చేంత వరకు ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తుంటే, కొన్ని జిల్లాల్లో ఎకరానికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు. రాష్ట్రంలో జూన్‌ నుంచే ఖరీఫ్‌ సాగు మొదలు కాగా, జూలై నెలాఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈనెలలో అవి తీవ్రమై, ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా మొదట్లో ఇష్టానుసారం విక్రయించినందునే ఇప్పుడు కొరత ఏర్పడిందని కేంద్రం కూడా భావిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి అధికంగానే విక్రయించినప్పటికీ, కొరత రావడానికి ప్రధాన కారణం అధికారులు యూరియా అమ్మకాలపై దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది. 7.28 ఎల్‌ఎంటీలు సరఫరా: కేంద్రం ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కేంద్రం కేటాయించిన యూరియాలో ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్‌ టన్నులు (ఎల్‌ఎంటీ)రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 5.38 ఎల్‌ఎంటీ మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ శాఖ చెపుతోంది. అయితే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ మాత్రం గత రబీలో మిగిలిన 1.92 ఎల్‌ఎంటీని కూడా కలుపుకొని ఇప్పటివరకు 7.28 ఎల్‌ఎంటీ సరఫరా చేశామని చెబుతోంది. ఇందులో ప్రస్తుతం మార్క్‌ఫెడ్, సొసైటీలు, ప్రైవేటు డీలర్లు, గోదాములన్నింటా కలుపుకొని అందుబాటులో ఉన్న యూరియా కేవలం 41వేల మెట్రిక్‌ టన్నులు. అంటే ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6.87 ఎల్‌ఎంటీల విక్రయాలు జరిగాయి. ఇదే గత ఏడాది ఇదే సమయంలో 6.10 ఎల్‌ఎంటీ అమ్మకాలే జరిగినట్లు కేంద్రం చెబుతోంది. దీన్ని బట్టి గత సంవత్సరం కన్నా 77వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అధికంగా విక్రయించారు. అంటే గత సీజన్‌తో పోలిస్తే యూరియా విక్రయాలు ఎక్కువ జరిగినప్పటికీ, కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. గత సంవత్సరం ఖరీఫ్‌తో పోలి్చనా, ఈసారి యూరియా విక్రయాలు అధికంగానే జరిగినట్లు చెబుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, బ్లాక్‌ మార్కెటింగ్‌ వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు చెబుతోంది. పెద్ద రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం, వ్యాపారులు బ్లాక్‌ మార్కెటింగ్‌కు తరలించడం కూడా యూరియా రాద్ధాంతానికి కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరెవరికి ఎంత విక్రయించారు? రాష్ట్రంలో ఖరీఫ్‌ కోసం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ప్రతి నెలా కేంద్రం యూరియా కోటా పంపిస్తుంది. మార్క్‌ఫెడ్‌ ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా (50:50 ప్రాతిపదికన) జరిగే విక్రయాలను పర్యవేక్షించకుండా వ్యవసాయ శాఖ గాలికి వదిలేసింది. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను రాష్ట్రంలోని 14 వేల మంది డీలర్లు మే నెలాఖరు నుంచే విక్రయిస్తారు. ఇక సొసైటీలు, ఇతర వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా జూన్‌ నుంచి విక్రయిస్తారు. అయితే ఈ విక్రయాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఏ సొసైటీలో ఏ రైతుకు ఎంత యూరియా విక్రయించారనే లెక్కలు కేవలం 10 రోజుల వరకే ఉంటాయి. తరువాత మళ్లీ రైతులు వెళ్లి యూరియా తీసుకోవచ్చు. ఇక ప్రైవేటు డీలర్లు జరిపే యూరియా విక్రయాలపై ఎలాంటి నిఘా లేదు. లెక్కలూ లేవు. రూ. 270 చొప్పున విక్రయించాల్సిన యూరియాను రూ.400 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సమయంలో వ్యవసాయేతర అవసరాలకూ యూరియాను డీలర్లు పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రంగుల కంపెనీలు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్‌–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమలతోపాటు గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల వారు కూడా రాష్ట్రంలోని ప్రైవేటు డీలర్ల నుంచి అధిక ధరలకు యూరియాను పెద్దఎత్తున కొనుగోలు చేసి తీసుకెళ్తారని మార్క్‌ఫెడ్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఒక్కో రైతుకు రేషన్‌ విధానంలో ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇస్తున్నట్లుగా ఖరీఫ్‌ ఆరంభం నుంచే అమలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని నిపుణులు అంటున్నారు. సాగు విస్తీర్ణం పెరగడం కూడా... రాష్ట్రంలో యూరియా అధిక వినియోగానికి చెపుతున్న కారణాల్లో ఒకటి ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ సాధారణం కన్నా ముందే రావడమైతే, రెండోది పంట సాగు విస్తీర్ణం గతం కన్నా గణనీయంగా పెరగడం. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఆగస్టు మూడో వారానికి 91.21 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 118 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో వరి విస్తీర్ణమే గత ఖరీఫ్‌ కన్నా 23 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి 31.60 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 54.79 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక పత్తి 42 లక్షల ఎకరాల నుంచి 45 లక్షలకు పెరిగింది. మొక్కజొన్న గత ఖరీఫ్‌లో 4.55 లక్షల ఎకరాలు సాగైతే ఈసారి 6.48 లక్షల ఎకరాలు సాగైంది. యూరియా అధికంగా వినియోగించే ఈ మూడు పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా కొరత ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలకు అనుగుణంగా సరఫరా... ఖరీఫ్, రబీ మొదలు కావడానికి ముందే... వ్యవసాయ శాఖ ఆయా సీజన్‌లకు అవసరమైన ఎరువుల ప్రణాళిక రూపొందిస్తుంది. ఆ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిస్తే, రాష్ట్రాల వారీగా కోటాను విడుదల చేస్తారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 9.80 ఎల్‌ఎంటీల కోటాకు కేంద్రం ఆమోదం తెలిపింది. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తోంది. దాని ప్రకారం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ప్రతి నెలా 1.60 ఎల్‌ఎంటీకి తగ్గకుండా పంపించాలి. ఈ మేరకు దేశంలోని ఎరువుల కంపెనీలకు కోటా విడుదల చేస్తే ఆయా కంపెనీల ద్వారా 50 శాతం కోటాను రైల్వే రేక్‌ పాయింట్ల ద్వారా మార్క్‌ఫెడ్‌కు, మరో 50 శాతం కోటా ప్రైవేటు డీలర్లకు పంపిస్తారు. ఈ లెక్కన ఇప్పటివరకు కేంద్రం పంపిన 5.18 ఎల్‌ఎంటీ యూరియాలో సగం అంటే 2.59 ఎల్‌ఎంటీ ప్రైవేటు డీలర్లకు వెళ్లింది. గత రబీకి సంబంధించిన ఓపెనింగ్‌ స్టాక్‌తో కలిపితే మొత్తం 3.61 ఎల్‌ఎంటీలు రాష్ట్రంలోని 14వేల ప్రైవేటు డీలర్లకు చేరింది. అయితే ప్రస్తుతం 18వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే వారి వద్ద ఉంది. అంటే 3.43 ఎల్‌ఎంటీలు విక్రయించారు. కానీ ఎవరికి ఎంత మేర విక్రయించారనే లెక్కలు వ్యవసాయ శాఖ దగ్గర లేకపోవడం గమనార్హం. భారీగా పెరిగిన వాడకం రాష్ట్రంలో యూరియా వినియోగం శాస్త్రవేత్తలు సూచిస్తున్న మోతాదుకన్నా రెండింతలు అధికంగా వినియోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరికి ఎకరాకు పంట కాలంలో 120 కిలోలు వినియోగిస్తే సరిపోతుంది. కానీ ఎకరాకు ఒకటిన్నర బస్తాల చొప్పున (బస్తా 45 కిలోలు) మూడు సార్లు వినియోగిస్తున్నారు. అలాగే మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వరికోసం నాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకు బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను కాంప్లెక్స్‌ ఎరువుతో కలిపి వినియోగిస్తుంటారు. ఆ తరువాత పొట్ట దశలో 45 రోజులకు, మరోసారి రెండు బస్తాల చొప్పున, మూడోదఫా 90 రోజుల్లో మరోసారి బస్తా చొప్పున వినియోగిస్తున్నారు. మొక్కజొన్నకు పంట కాలంలో కొన్ని జిల్లాల్లో మూడుసార్లు యూరియాను వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు ఒక్కోసారి రెండు బస్తాల చొప్పున వినియోగిస్తారు. పత్తి పంట కోసం కూడా ఎకరాకు ఒకటిన్నర బస్తాలకు తగ్గకుండా వినియోగించడంతో ఖరీఫ్‌లో యూరియా డిమాండ్‌ పెరుగుతోంది. అదే యాసంగి (రబీ) సీజన్‌లో పత్తి లేకపోవడంతో డిమాండ్‌ అంతగా లేదని అధికారులు అంటున్నారు.

Elon Musk Says Macrohard to Compete with Microsoft6
మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్‌

వాషింగ్టన్‌: సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్‌ను తలదన్నేలా అధునాతన కృత్రిమమేధ సంస్థ ‘మాక్రోహార్డ్‌’ను ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ పేరులోని మైక్రో, సాఫ్ట్‌ పదాలకు పూర్తి విరుద్ధమైన మాక్రో, హార్డ్‌ పదాలతో మస్క్‌ తన కొత్త కంపెనీకి పేరు పెట్టడం గమనార్హం. మైక్రోసాఫ్ట్‌ కంటే తన సంస్థ అద్భుతంగా ఎదగబోతోందని అర్థంవచ్చేలా గతంలోనే మస్క్‌ Macrohard >> Microsoft అని ‘ఎక్స్‌’ లో పోస్ట్‌చేసిన విషయం తెల్సిందే. ఎక్స్‌ఏఐ సంస్థ సారథ్యంలో ఇకపై మాక్రోహార్డ్‌ సంస్థ పనిమొదలు పెడుతుందని మస్క్‌ శనివారం ప్రకటించారు. ‘‘ఇకపై సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ తదితరాల కోసం విడిగా హార్డ్‌వేర్‌లను కర్మాగారాల్లో తయారు చేయాల్సిన పనిలేదు. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే కృత్రిమమేధతో పని జరిగిపో తుంది. సాఫ్ట్‌వేర్‌ అనేవి అంతా ఆన్‌లైన్‌లోనే ఇన్‌స్టాల్‌ అవుతాయి. ఈ లెక్కన ఒకరకంగా మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్, డివైస్‌లు, ఉపకరణాల విభాగ వ్యాపారం మూలకు పడినట్లే. యావత్‌ సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని ఏఐతో భర్తీచేస్తా. హ్యూమన్‌ స్పీచ్, టెక్స్ట్‌ సహా పరస్పర సమాచార బదిలీని సాధ్యంచేసే చాట్‌బాట్‌ వంటివన్నీ ఇకపై నేరుగా సాఫ్ట్‌వేర్‌తోనే జరిగేలా చేస్తా. ఇది వేలాది మంది శ్రామికులు చేసే పనిలో సమానం. భారీ సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ శ్రామికశక్తిని మా ఏఐ క్లోన్‌ భర్తీచేస్తుంది. మాక్రోహార్డ్‌ అనేది పూర్తిగా ఏఐ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ’’అని మస్క్‌ చెప్పుకొచ్చారు. ఒకేసారి సమాంతర వ్యవస్థ ‘‘ఇకపై వేలాదిగా స్పెషలైజ్డ్‌ కోడింగ్, ఇమేజ్, వీడియోలను సృష్టించే, అర్థంచేసుకునే కంప్యూటర్‌ పోగ్రామ్‌లను అభివృద్ధిచెందించాల్సి ఉంది. ఇవన్నీ ఒకేసారి సమాంతరంగా పనిచేస్తాయి. దీంతో యూజర్లు తమకు కావాల్సిన ఏదైనా సమాచారం, అంశంపై నేరుగా సాఫ్ట్‌వేర్‌తోనే మాట్లాడొచ్చు, సంప్రతించవచ్చు. వర్చువల్‌ మెషీన్లే సాధారణ యూజర్లు అడిగే ఎలాంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో ఇస్తాయి. ఇదంతా ఊహించనంత స్థాయిలో జరగబోతోంది. దీనిని ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ కర్మాగారంగా చెప్పొచ్చు’’అని మస్క్‌ చెప్పారు. మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ సంస్థ ఆగస్ట్‌ ఒకటో తేదీన అమెరికా పేటెంట్‌ ఆఫీస్‌లో ‘మాక్రోహార్డ్‌’పేరిట పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసింది. గతంలోనే మస్క్‌ ఏఐ ఆధారిత వీడియోగేమ్స్‌ రంగంలో అడుగుపెట్టాలని భావించారు. ఇప్పుడు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు దశాబ్దాలుగా సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్‌ ఏకఛత్రాధిపత్యాన్ని కూలదోసేందుకు కొత్త తరహాలో ఏఐ సాఫ్ట్‌వేర్‌ తయారీకి మస్క్‌ నడుంబిగించారు. అయితే ప్రతి కంప్యూటర్‌లో కనిపించే మైక్రోసాఫ్ట్‌ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌ వంటి సాఫ్ట్‌వేర్‌లకు దీటుగా అంతకుమించిన సౌకర్యాలుండే అన్ని రకాల సాఫ్ట్‌వేర్‌ సేవలను అందించడం మస్క్‌కు కత్తిమీద సాము చేయడంతో సమానమని సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. దిగ్గజ ఎన్‌విడియా నుంచి తెప్పించిన లక్షలాది గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌(జీపీయూ)లతో అమెరికాలోని మెంఫిస్‌లో మస్క్‌ ఇప్పటికే భారీ కేంద్రాలను ఏర్పాటుచేసి కొలోసస్‌ సూపర్‌కంప్యూటర్‌లతో పని మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే తరహాలో ఏఐ కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు సిద్ధమైన ఓపెన్‌ఏఐ, మెటా వంటి పెద్ద సంస్థలతో మస్క్‌ సంస్థ పోటీపడాల్సి ఉంది.

India Post temporary suspension of parcel services to the USA7
అమెరికాకు తపాలా సర్విసులు తాత్కాలికంగా బంద్‌

న్యూఢిల్లీ: అమెరికాకు కొన్ని రకాల తపాలా సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. పన్ను నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేయడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రధానంగా పార్సిల్‌ సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరిస్తున్నట్లు అమెరికా సర్కార్‌ జూలై 30న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29 నుంచి అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు పంపించే అన్ని రకాల పోస్టల్‌ ఐటమ్స్‌పై వాటి విలువతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్‌ ఎమర్జెన్సీ ఎకనామిక్‌ పవర్‌ యాక్ట్‌(ఐఈఈపీఏ) టారిఫ్‌ ఫ్రేమ్‌వర్క్‌ కింద కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. 100 డాలర్ల దాకా విలువైన బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు. యూఎస్‌ కస్టమ్స్‌ విభాగం నుంచి అనుమతి పొందినవారు పోస్టల్‌ షిప్‌మెంట్స్‌పై పన్ను వసూలు చేసి, అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెల 25 నుంచి అమెరికాకు పోస్టల్‌ పార్సిళ్లను పంపించడం ఆపేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. తపాలా శాఖ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 100 డాలర్ల దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్‌ ఐటమ్స్‌ మినహా ఇతర పార్సిళ్ల బుకింగ్‌ను నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేసింది. పార్సిళ్లను అమెరికాకు పంపడానికి ఇప్పటికే సొమ్ము చెల్లించినవారు రీఫండ్‌ పొందవచ్చని సూచించింది. ఆయా పార్సిళ్లను తిరిగి పొందాలని పేర్కొంది. వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్‌ సేవలను సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అమెరికా పన్ను నిబంధనల్లో మార్పుల కారణంగా భారత్‌తోపాటు స్కాండినేవియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలు అమెరికాకు పార్సిల్‌ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాలపై టారిఫ్‌ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇండియా సహా పలుదేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇందులో భాగంగానే పోస్టల్‌ సేవలపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరించారు.

Vangaveeti Mohanaranga statue insulted in Kaikaluru8
రంగా విగ్రహాలకు అవమానం

కైకలూరు/కలిదిండి: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో దివంగత ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహాలకు అవమానం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి మాస్‌్కలు ధరించిన ఇద్దరు దుండగులు కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో రంగా విగ్రహాలకు పేడపూసి అవమానించారు. పోలీసులు సేకరించిన సీసీ టీవీ ఫుటేజీలలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. కలిదిండి మూడు కూడళ్ల సెంటర్‌లో రంగా విగ్రహం వద్ద శుక్రవారం సినీ నటుడు చిరంజీవి పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. శనివారం ఉదయం రెండు ప్రాంతాల్లో విగ్రహాలకు పేడ ఉండటాన్ని గమనించిన రంగా అభిమానులు కోపంతో రగిలిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితుల్ని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి.. నిందితుల్ని గుర్తించేందుకు క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే.. ముదినేపల్లి మండలం ఈడేపల్లిలో రెండు, కైకలూరు మండలం ఆలపాడులో ఒకచోట స్థాపించిన రంగా విగ్రహాలను ఆయన తనయుడు వంగవీటి రాధా ఆదివారం ఆవిష్కరించనున్నారు. కలిదిండి, సానారుద్రవరం గ్రామాల మీదుగానే ఆయన వెళ్లాల్సి ఉంది. అందుకే దుండగులు ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజీల్లో ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరూ 18 ఏళ్లలోపు వారిగా కనిపిస్తున్నారు. మాస్క్‌ పెట్టుకుని ఒక యువకుడు విగ్రహానికి పేడ పూయగా, తర్వాత మరో యువకుడు బైక్‌పై రావడంతో అతనితో కలిసి పరారయ్యాడు. రాధా రానుండటంతో పక్కా పథకం ప్రకారమే విగ్రహాలకు పేడ పూసినట్టు స్థానికులు భావిస్తున్నారు. విగ్రహాలను శుద్ధి చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు దుండగుల దుశ్చర్యను తెలుసుకుని శనివారం రంగా విగ్రహాలను శుద్ధి చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) శనివారం కలిదిండిలోని రంగా విగ్రహం వద్దకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో వచ్చారు. రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో కూటమి పార్టీకి చెందిన వ్యక్తులు డీజే వ్యాన్‌ను పెద్ద శబ్దంతో విగ్రహం వైపు తిప్పారు. అక్కడితో ఆగకుండా కూటమి కార్యకర్తలు బైక్‌లపై నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో డీఎన్నార్‌ సీఐ రవికుమార్‌కు ఫిర్యాదుచేశారు. కూటమి కార్యకర్తల కవ్వింపు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా డీఎన్నార్‌ మాట్లాడుతూ.. నాలుగు రోజుల్లోగా దోషులను గుర్తించాలని, లేదంటే 3వేల మంది కార్యకర్తలతో కలిదిండిలో నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జనం విగ్రహాలను అవమానించిన విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఘటనా స్థలాలను శనివారం పరిశీలించారు. దీంతో.. స్థానికులు ఆయనను చుట్టుముట్టారు. నిందితులను తక్షణమే పట్టుకోవాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే కామినేని ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆంధ్రా–తెలంగాణ రాధా, రంగా మిత్రమండలి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. సీఎం చంద్రబాబు కార్యాలయం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించింది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారని, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారని పేర్కొంది. దుండగుల సమాచారమిస్తే బహుమతి రంగా విగ్రహాలకు పేడ పూసిన దుండగుల సమాచారం చెబితే బహుమతి అందిస్తామని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ శనివారం ప్రకటించారు. కలిదిండి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పారు.

Cut to IPO fundraising, impact of multiple investment opportunities9
ఐపీవో నిధుల సమీకరణకు కోత..!

ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి. సెకండరీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెట్టుబడులకు పలు అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం అంతగా ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత కేలండర్‌ ఏడాది (2025)లో పలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి. అనుమతులు సైతం పొందుతున్నాయి. అయితే జనవరి మొదలు ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ అదనపు సుంకాలను విధిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా భారత్‌ ఎగుమతులపై ఇటీవల 50 శాతంవరకూ టారిఫ్‌లను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. యూఎస్‌ టారిఫ్‌ల కారణంగా సముద్ర ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్, లెదర్, జ్యువెలరీ, కెమికల్స్‌ తదితర పలు రంగాలు ప్రభావితంకావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మాపై సైతం సుంకాలు విధించే వీలున్నట్లు ట్రంప్‌ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కొద్ది నెలలుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలోనే సాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వీటికితోడు దేశీ కంపెనీల ఏప్రిల్‌–జూన్‌(క్యూ1) ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సైతం దేశీ స్టాక్స్‌ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించదలచిన నిధుల పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి. పునరాలోచనలో.. ఈ ఏడాది జనవరి నుంచి పలు కంపెనీలు లిస్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నప్పటికీ సమీకరించతలపెట్టిన నిధుల పరిమాణంలో కోత పెట్టుకుంటున్నట్లు మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. వెరసి 2025లో ఇప్పటివరకూ సుమారు 15 కంపెనీలు ఇష్యూల పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ జాబితాలో ఇటీవల లిస్టయిన దిగ్గజాలు ఎన్‌ఎస్‌డీఎల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌సహా.. ఏథర్‌ ఎనర్జీ, ఎస్‌కే ఫైనాన్స్, బ్లూస్టోన్, మొబిక్విక్, ష్లాస్‌ బెంగళూరు(లీలా హోటల్స్‌), ఇండిక్యూబ్, అర్బన్‌ కంపెనీ, స్మార్ట్‌ వర్క్స్, స్వస్తికా ఇన్‌ఫ్రా తదితరాలు చేరాయి. 48 కంపెనీల లిస్టింగ్‌ ఈ కేలండర్‌ ఏడాదిలో ఇప్పటివరకూ 48 కంపెనీలు ఐపీవోలు చేపట్టి స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. తద్వారా రూ. 64,135 కోట్లు సమకూర్చుకున్నాయి. అంతక్రితం ఏడాది అంటే 2024లో 90 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఏకంగా రూ. 1,67,535 కోట్లు(19.5 బిలియన్‌ డాలర్లు) సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ పలు దిగ్గజాలు లిస్టింగ్‌ బాటలో సాగనున్నాయి. పలు అవకాశాలు ప్రైమరీ మార్కెట్లలో కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్‌ఎంఈ) సైతం సందడి చేస్తున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్, బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా పలు చిన్న కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు కొద్ది నెలలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణీయ రిటర్నులు ఇవ్వడం, రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ల ఐపీవోలు, మ్యూచువల్‌ ఫండ్‌ల సిప్‌ పథకాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మెయిన్‌ బోర్డ్‌ ప్రైమరీ మార్కెట్లో కొన్ని ఇష్యూలు మాత్రమే లిస్టింగ్‌లోనూ విజయవంతమవుతున్నట్లు వివరించారు. వెనకడుగు తీరిదీ... వివిధ ప్రతికూలతల కారణంగా తొలుత వేసిన ప్రణాళికలను సవరిస్తూ కొన్ని కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణ పరిమాణంలో కోత పెడుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ రూ. 4,000 కోట్ల విలువను రూ. 3,600 కోట్లకు సవరించగా.. ఏథర్‌ ఎనర్జీ రూ. 3,100 కోట్ల నుంచి రూ. 2,626 కోట్లకు తగ్గించుకుంది. ఈ బాటలో ఎస్‌కే ఫైనాన్స్‌ రూ. 2,200 కోట్లస్థానే రూ. 1,600 కోట్లు మాత్రమే సమీకరించగా.. బ్లూస్టోన్‌ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 820 కోట్లకు వెనకడుగు వేసింది. లీలా హోటల్స్‌ రూ. 5,000 కోట్ల ప్రణాళికను రూ. 3,000 కోట్లకు కుదిస్తే.. మొబిక్విక్‌ రూ. 1,900 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు భారీగా కోత పెట్టుకుంది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Indian womens team in Vizag10
వైజాగ్‌లో భారత మహిళల జట్టు

సాక్షి, విశాఖపట్నం: సొంత గడ్డపై జరిగే వన్డే వరల్డ్‌ కప్‌లో సత్తా చాటాలని భారత మహిళల జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీకి నెల రోజుల ముందునుంచి జట్టు సన్నాహకాలు మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 25 నుంచి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ బృందానికి ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో వారం రోజుల పాటు టీమ్‌ సాధన చేస్తుంది. ఫిట్‌నెస్, ట్రైనింగ్‌లాంటి అంశాల గురించి కాకుండా పూర్తిగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లపైనే దృష్టి పెడుతూ ‘స్కిల్‌ బేస్డ్‌’ కండిషనింగ్‌ క్యాంప్‌ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సాధన కోసం బోర్డు వ్యూహాత్మకంగానే వైజాగ్‌ను ఎంపిక చేసింది. జట్టులోని ముగ్గురు సభ్యులు హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, స్నేహ్‌ రాణాలకు ఎప్పుడో 2014లో మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. మిగతా ప్లేయర్లు ఎవరూ వైజాగ్‌లో గతంలో ఒక్క సారి కూడా మ్యాచ్‌ ఆడలేదు. ప్రాక్టీస్‌తో ఇక్కడి పిచ్, పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ క్యాంప్‌ ఉపయోగపడనుంది. వరల్డ్‌కప్‌లో భారత జట్టు రెండు అత్యంత కీలక మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాతో (అక్టోబర్‌ 9న), ఆ్రస్టేలియాతో (అక్టోబర్‌ 12)న విశాఖలోనే ఆడనుంది. రిజర్వ్‌ ప్లేయర్లు సహా భారత జట్టు సభ్యులంతా ఈ ప్రత్యేక క్యాంప్‌లో పాల్గొంటారు. భారత ‘ఎ’ జట్టు సభ్యులు కూడా దీనికి హాజరవుతారు. రెగ్యులర్‌ సాధనతో పాటు డే అండ్‌ నైట్‌లో రెండు ఇంట్రా స్క్వాడ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement