
రూ.2కోట్ల డీల్ వెనుక పెరోల్‌తోపాటు సంక్రాంతికి విడుదలకూ కుట్ర
హోంమంత్రి పేషీలో చక్రం తిప్పిన టీడీపీ నెల్లూరు ఎమ్మెల్యే
దశాబ్దకాలంపైగా శ్రీకాంత్ సైన్యంతోనే ప్రజాప్రతినిధి దందాలు, సెటిల్‌మెంట్లు
పోలీస్ నిఘావర్గాల విచారణలో విస్తుపోయే వాస్తవాలు
సాక్షి, టాస్క్ ఫోర్స్: నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదిగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక భారీ డీల్ నడిచింది. దశాబ్దకాలం పైగా శ్రీకాంత్ సైన్యంతో నెల్లూరును నేరమయం చేసిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి పెరోల్ ద్వారా అతడిని బయటకు రప్పించేందుకు వ్యవహారం నడిపించాడని పోలీస్ నిఘా వర్గాల విచారణలో తేలినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ నాలుగు జిల్లాల్లో తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. వంద మందికిపైగా సైన్యాన్ని కూడగట్టుకున్నాడు. వారి ద్వారానే సెటిల్‌మెంట్లు, దందాలు, బెదిరింపులు, చేయిస్తున్నాడని పోలీస్‌శాఖ విచారణలో తేలింది.
నెల్లూరుకు చెందిన ప్రజాప్రతినిధి కనుసన్నల్లో శ్రీకాంత్ అతని సైన్యం నడుస్తున్నట్టు తేటతెల్లమైంది. నెల్లూరులో జరిగే సెటిల్‌మెంట్లు, సింగిల్ నంబర్ల ఆట, బెట్టింగ్, ఆర్థిక నేరాలు అన్నింటినీ అతని ద్వారానే నడిపిస్తూ నగరంలో ప్రజాప్రతినిధితో పెట్టుకుంటే నూకలు చెల్లినట్లే అనే భయాన్ని కలిగించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఫలితంగా దశాబ్దకాలంగా నెల్లూరులో ఆ ప్రజాప్రతినిధిని చూస్తేనే నగర వాసులు వణికిపోయే పరిస్థితి నెలకొంది.
ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సు’లతోనే..
శ్రీకాంత్ పెరోల్ విషయంలో సిఫార్సు లెటర్లు ఇచ్చినా రిజక్ట్ చేశారంటూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బుకాయిస్తున్నప్పటికీ వారి ఒత్తిడి, హోంమంత్రి అండతో హోంశాఖ పెరోల్ ఉత్తర్వులు ఇచ్చిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాంత్‌ను బయటకు రప్పించి మరిన్ని సెటిల్‌మెంట్లతో ప్రజాధనాన్ని దోచేసేందుకు పెరోల్ అస్త్రాన్ని బయటకు తీశారు. అధికారులు అడ్డుపడడంతో కీలక మంత్రికి రూ.2 కోట్ల డీల్ కుదిర్చారన్న ప్రచారం ఉంది. ఆ డబ్బుతోనే పెరోల్‌తోపాటు వచ్చే ఏడాది జనవరిలో స్రత్పవర్తన కింద విడుదలయ్యే ఖైదీల జాబితాలో శ్రీకాంత్ పేరు చేర్చేలా ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతోంది.
అరుణ వ్యవహారంతోనే వెలుగులోకి..
ఇటీవల పెరోల్‌లో బయటకు వచ్చిన శ్రీకాంత్ తన సన్నిహితురాలు అరుణనురౌడీ సామ్రాజ్యానికి రాణిని చేసేందుకు తన సైన్యంతో సమావేశం పెట్టడం వల్లే అతని పెరోల్ వ్యవహారం లీకైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రిలో శ్రీకాంత్‌తో అరుణ సన్నిహితంగా ఉన్న వీడియోలూ అతని సైన్యాధిపతి తీసినవేనని తెలుస్తోంది.
ఎక్కడ తమ ఆధిపత్యం పోతుందోనని ఆ సైన్యాధిపతి లీకులు ఇచ్చారనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారం ఎల్లో మీడియా వైఎస్సార్‌సీపీకి అంటగట్టేలా చేసిన యత్నాలు బూమ్‌రాంగ్ కావడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ఇదే అదనుగా కూటమిలోని ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం ఎల్లో మీడియాలో ఓ వర్గాన్ని ప్రోత్సహించి వ్యవహారాన్ని బజారులో పెట్టేలా చేశారనే ప్రచారం తీవ్రంగా జరుగుతోంది.
శ్రీకాంత్ పెరోల్‌కు సిఫార్సు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు సిటీ: నెల్లూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్‌కు తాను సిఫార్సు లేఖ ఇచి్చన మాట వాస్తవమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒప్పుకున్నారు. శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాంత్ పెరోల్ కోసం తనతో పాటు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ కూడా లేఖ ఇచ్చారని చెప్పారు. తమ లేఖల్ని జూన్ 16న రిజెక్ట్ చేసిన అధికారులు పెరోల్ ఇవ్వలేమని చెప్పారన్నారు. జూలై 30న హోంశాఖ మంత్రి కార్యాలయం నుంచి పెరోల్‌కు అనుమతి ఇచ్చిందన్నారు.
పెరోల్ విషయంలో తమకేం సంబంధం లేదన్నారు. ఇకపై తాను బతికుండగా పెరోల్ కోసం సిఫార్సు లెటర్లు ఇవ్వనని చెప్పారు. ఇది తనకు గుణపాఠం లాంటిదన్నారు. గత ప్రభుత్వంలో కూడా శ్రీకాంత్ పెరోల్‌కు సిఫార్సు లెటర్లు ఇచ్చానని అన్నారు. లేఖలు ఇవ్వడం సాధారణమన్నారు. అధికారులు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.