
క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో టీమిండియాలో పునరాగమనం చేయనున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో టీ20 సందర్భంగా జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (UPT20)తో బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. రింకూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)తో జూన్ 8న అతడి నిశ్చితార్థం జరిగింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రియా సరోజ్ మచ్లిషెహర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు.
మూడేళ్లుగా..
ఇక ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ రింకూ- ప్రియా క్యాప్షన్ జతచేశారు. దీనిని బట్టి తామిద్దరం చాలాకాలంగా ప్రేమలో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే, క్రికెటర్ అయిన రింకూకు.. ప్రియాతో పరిచయం ఎలా ఏర్పడింది?.. వీరి లవ్‌స్టోరీ ఎలా మొదలైంది?.. అన్న విషయాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

చూడగానే నచ్చేసింది
ఈ నేపథ్యంలో తమ ప్రేమకథ గురించి రింకూ సింగ్ తాజాగా వెల్లడించాడు. ‘‘2002లో.. కోవిడ్ సమయంలో మా మధ్య ప్రేమ మొదలైంది. అప్పుడు ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. నాకున్న ఫ్యాన్ పేజీలో.. ప్రియా ఓ గ్రామంలో ప్రచారం చేస్తున్న ఫొటో కనబడింది.
సాధారణంగా ప్రియ వాళ్ల సోదరి.. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీస్తారు. ఆవిడే వారి ఫొటోలు నా ఫ్యాన్ పేజీలో పెట్టమని అడిగినట్లున్నారు. ప్రియా ఫొటో చూడగానే నాకు నచ్చింది.
నాకు తనే పర్‌ఫెక్ట్ జోడీ అనిపించింది. ఆమెకు మెసేజ్ చేయాలని అనుకున్నాను. కానీ అలా చేయడం సరికాదని ఊరుకున్నాను. అయితే, నా ఫొటోలు కొన్నింటికి ప్రియా లైక్ కొట్టింది. వెంటనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనకు మెసేజ్ చేశాను. అలా స్నేహం మొదలైంది.

తను చాలా బిజీ..
ఆ తర్వాత కాల్స్ మాట్లాడుకునేవాళ్లం. వారంలో కనీసం రెండు రోజులు తప్పకుండా మాట్లాడుకునేవాళ్లం. ముఖ్యంగా నా మ్యాచ్‌కు ముందు తనతో మాట్లాడేవాడిని. అలా 2022 నుంచి మా మధ్య ప్రేమ మొదలైంది’’ అని రింకూ తన లవ్‌స్టోరీ గురించి చెప్పాడు.
అదే విధంగా.. ‘‘తను ఎంపీ అయిన తర్వాత కూడా మా ప్రేమలో ఎలాంటి మార్పూ రాలేదు. అయితే, మొదట్లో మాట్లాడుకునేందుకు ఎక్కువ సమయం దొరికేది. కానీ తర్వాత తను నాకోసం కేటాయించే సమయం కాస్త తగ్గిపోయింది.
తను చాలా బిజీగా ఉంటుంది. గ్రామాలకు వెళ్తుంది. ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారికి సాయం చేస్తూ ఉంటుంది. అంతేకాదు.. పార్లమెంట్స్ సెషన్స్‌కు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఏదేమైనా ఓ రాజకీయ నాయకురాలిగా తను గ్రౌండ్‌వర్క్ ఎక్కువగానే చేయాల్సి ఉంటుంది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలే మీకు ఎక్కువగా కనిపిస్తాయి. పొద్దున వెళితే.. రాత్రికి ఎప్పుడో ఇల్లు చేరుకుంటుంది. కాబట్టి మాకు మాట్లాడుకునేందుకు ఎక్కువ సమయం దొరకదు’’ అని రింకూ సింగ్ తనకు కాబోయే భార్య.. ప్రజాప్రతినిధిగా విధులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపాడు.
చదవండి: నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమే: సారా టెండుల్కర్