
సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar).. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు సాధించాడు ఈ బ్యాటింగ్ దిగ్గజం. వీటిలో రెండు మాత్రం భారత్‌తో పాటు సచిన్‌కు ఎంతో ప్రత్యేకం.
శతక శతకాల ధీరుడు
అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు సాధించిన సచిన్ టెండుల్కర్.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేశాడు. అదే విధంగా.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వంద శతకాలు (51 టెస్టు, 49 వన్డే) బాదిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.
తండ్రి అడుగుజాడల్లో అర్జున్
అయితే, సచిన్ టెండుల్కర్ సంతానంలో కుమారుడు అర్జున్ టెండుల్కర్ మాత్రమే క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. కానీ నైపుణ్యాల పరంగా తండ్రికి దరిదాపుల్లో కూడా అతడు లేడు. పాతికేళ్ల అర్జున్ ఆల్‌రౌండర్. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో గోవా తరఫున ఆడుతున్నాడు.
సారా మాత్రం భిన్నం
మరోవైపు.. సచిన్- అంజలిల మొదటి సంతానమైన సారా టెండుల్కర్ మాత్రం భిన్నమైన కెరీర్‌ను ఎంచుకుంది. మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, న్యూట్రీషనిస్టుగా తనకు నచ్చిన బాటలో పయనిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారాకు.. తండ్రిలా క్రికెట్‌ను ఎందుకు కెరీర్‌లా ఎంచుకోలేదనే ప్రశ్న ఎదురైంది.
నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమే
ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనెప్పుడూ క్రికెటర్ కావాలని అనుకోలేదు. అయితే, మా తమ్ముడికి మాత్రం క్రికెట్ అంటే ఇష్టం. నేను చిన్నపుడు గల్లీ క్రికెట్ ఆడాను. కానీ దానినే కెరీర్‌గా మలచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు’’ అని ఇండియా టుడేతో సారా టెండుల్కర్ పేర్కొంది.
అదే విధంగా.. చిన్నపుడు తండ్రి మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియానికి వెళ్లేదానినన్న సారా.. ఇప్పుడు కూడా టీమిండియా మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షిస్తానని తెలిపింది. తండ్రి రిటైర్మెంట్ మ్యాచ్ తనకింకా గుర్తుందని.. ఆ సమయంలో ఆయన భావోద్వేగాలను అర్థం చేసుకోగల పరిణతి మాత్రం అప్పుడు తనకు లేదని పేర్కొంది.
కాగా 1989 నుంచి 2013 వరకు టీమిండియా తరఫున క్రికెట్ ఆడిన సచిన్ టెండుల్కర్.. 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో పది పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన సచిన్.. 2334 పరుగులు చేశాడు.
త్వరలోనే సచిన్ ఇంట శుభకార్యం
ఇక సచిన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. డాక్టర్ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా, అర్జున్. కాగా త్వరలోనే సచిన్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కుమారుడు అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు.
ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా. ఇదిలా ఉంటే.. అక్క సారా కంటే ముందే తమ్ముడు అర్జున్ పెళ్లి పీటలు ఎక్కనుండటం విశేషం.
చదవండి: హ్యాట్సాఫ్ ధనశ్రీ: రోహిత్ భార్య రితికా అలా.. సూర్య సతీమణి దేవిశా ఇలా