సర్కారు డ్రామా.. ఎరువులు భ్రమ | Farmers face hardship due to severe shortage of urea in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సర్కారు డ్రామా.. ఎరువులు భ్రమ

Aug 24 2025 5:08 AM | Updated on Aug 24 2025 5:08 AM

Farmers face hardship due to severe shortage of urea in Andhra Pradesh

అనంతపురంలో డీసీఎంఎస్‌ కార్యాలయం వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు

యూరియా తీవ్ర కొరతతో చిన్న, సన్నకారు రైతులు లబోదిబో 

మూతపడిన సొసైటీ కేంద్రాలు..ఆర్‌ఎస్‌కేల్లో నో స్టాక్‌ బోర్డులు

ఇప్పటికే ఆర్బీకేలు నిర్వీర్యం.. 

వాటికి రావాల్సిన స్టాకు అటు నుంచి అటే బ్లాక్‌ మార్కెట్‌కు మళ్లింపు 

వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకుని అధిక ధరలకు విక్రయించేందుకు కూటమి నేతలు గ్రీన్‌ సిగ్నల్‌ 

దీంతో కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్న వైనం 

సరఫరా క్రమబద్ధీకరణ చేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం 

పొంతన లేని లెక్కలతో కాలక్షేపం.. రైతుల గోడు పట్టించుకోని వైనం 

వర్షాధార పంటలకు అదునుకు యూరియా అందక రైతుల అగచాట్లు 

పంటలు ఎండుముఖం.. దిగుబడిపై తీవ్ర ప్రభావం  

అధికంగా వాడేస్తున్నారంటూ రైతులపై ప్రభుత్వం నెపం

అక్రమ నిల్వలపై చోద్యం.. చర్యలు తీసుకోవడంలో విఫలం 

అధికార పార్టీ నేతల మళ్లింపుపై ఏమీ చేయలేని సీఎం చంద్రబాబు 

పైకి మాత్రం సీరియస్‌ అయినట్లు ఎల్లో మీడియా వేదికగా డ్రామాలు

యూరియా విషయంలో ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే, గ్రామాల్లో కళ్లకు కనిపిస్తున్నది మరొకటి. మొన్నటి దాకా తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రైతుల ఆందోళనలు చూసి మాట మార్చారు. అక్రమంగా ఎలా తరలి వెళుతోందని.. అలా తరలి పోయిన యూరియా నిల్వలను తిరిగి స్వాధీనం చేసుకోండంటూ హూంకరిస్తున్నారు. దౌర్జన్యంగా, లోపాయికారిగా, అక్రమంగా యూరియా నిల్వలను తమ గోదాములకు తరలించుకు పోయింది కూటమి పార్టీల నేతలే. మరి వారి వద్ద నుంచి నిజంగా ఒక్కటంటే ఒక్క బస్తా అయినా అధికారులు స్వా«దీనం చేసుకోగలిగారా? ‘ముఖ్యమంత్రి సీరియస్‌..’ అని ఎల్లో మీడియాలో డ్రామా వార్తలు మినహా ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు. సర్కారు నిర్వాకంతో ఊరూరా చిన్న, సన్నకారు రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.  

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్‌కు సరిపడా నిల్వలున్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ చేస్తున్న ప్రకటనలకు.. వాస్తల పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఇప్పటికే ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వ.. ఇప్పుడు ఆర్బీకేలను ఇంకా పతనావస్థకు తీసుకెళ్తూ.. ఇక్కడికి రావాల్సిన యూరియా స్టాకును అటు నుంచి అటే బ్లాక్‌ మార్కెట్‌కు మళ్లించేందుకు అధికార పార్టీల నేతలకు స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వారు వ్యాపారులతో కమీషన్లు తీసుకుని అధిక ధరలతో విక్రయించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. 

ఇందుకోసం మార్కెట్‌లో యూరియాకు కృత్రి­మ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటు­న్నారు. యూరియా దొరకడం గగనంగా మారడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చిన స్టాక్‌ను వచ్చినట్లు టీడీపీ నేతలు దారి మళ్లించిన విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకో­లేక­పోయినా.. చర్యలు తప్పవంటూ ఎల్లో మీడియా వేదికగా సీరియస్‌ అయినట్లు డ్రామాలతో రైతులను మభ్యపెడుతున్నారు. 

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌)తో పాటు రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ద్వారా సరఫరాను పెంచాలని రైతుల నుంచి డిమాండ్‌ వస్తోందని జిల్లా కలెక్టర్లు ప్రభు­త్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు మార్క్‌ఫెడ్‌–ప్రైవేటు వ్యాపారులకు ఇప్పటివరకు ఉన్న 50ః50 నిష్పత్తిలో జరుపుతున్న ఎరువుల కేటాయింపులను ఇక నుంచి 70ః30 నిష్పత్తిలో కేటాయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా ఆచరణకు నోచుకోలేదు.  

స్టాకు లేక మూతపడిన సొసైటీలు 
అధిక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీరు దిగిన మెట్ట పంటలతో పాటు ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియా అత్యవసరం. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు అదును దాటకముందే యూరియా బూస్టర్‌ డోస్‌ వెయ్యాలి. కానీ.. ఒక్క బస్తా యూరియా కూడా దొరకని పరిస్థి­తి నెలకొంది. మార్క్‌ఫెడ్‌ వద్ద చాలినంత స్థాయిలో యూరియా నిల్వల్లేని కారణంగా ఆర్‌ఎస్‌కేలతో పాటు మెజార్టీ సొసైటీలు శనివారం మూసివేశారు. నో స్టాక్‌ బోర్డులు పెట్టకపోయినప్పటికీ యూరియా నిల్వల్లేని కారణంగా రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సొసైటీలను మూయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కొద్దిపాటి నిల్వలున్న సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అన్ని జిల్లాల్లోనూ కన్పిస్తున్నాయి.
  

80 శాతం ప్రైవేట్‌ డీలర్ల వద్దే.. 
రాష్ట్రంలో ఇప్పటివరకు 11.84 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా, దాంట్లో అత్యధికంగా యూరియా 4.89 లక్షల టన్నులు, కాంప్లెక్స్‌ 4.08 లక్షల టన్నులు, డీఏపీ 1.53 లక్షల టన్నులు, ఎస్‌ఎస్‌పీ 76 వేల టన్నులు, ఎంవోపీ 57 వేల టన్నులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 6.23 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం డిమాండ్‌ ఎక్కువగా ఉన్న యూరియా కేవలం 1.50 లక్షల టన్నులు, డీఏపీ 84 వేల టన్నులు మాత్రమే ఉంది. 17 జిల్లాల్లో యూరియా, 11 జిల్లాల్లో డీఏపీ డిమాండ్‌ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 

ఉన్న నిల్వల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు డీలర్ల వద్దే ఉన్నాయి. సొసైటీలు, ఆర్‌ఎస్‌కేల్లో అరకొరగా ఉండడంతో పంపిణీలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.400 చొప్పున, డీఏపీ రూ.1,400 నుంచి రూ.1550 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఈ సీజన్‌లో యూరియాతో పాటు ఎరువులు అధికంగా వాడేస్తున్నారంటూ ప్రభుత్వం తమను తప్పుపడుతుండడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.  

బస్తా కూడా పట్టుకోలేని టాస్క్‌ఫోర్స్‌ బృందాలు 
రైతుల ముసుగులో సొసైటీలు, రైతుసేవా కేంద్రాలకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను టీడీపీ నేతలు పక్కదారి పట్టించి, బ్లాక్‌లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వ్యవసాయేతర అవసరాలతో పాటు సరిహద్దు జిల్లాలు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న యూరియాను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్సు బృందాలు మొక్కుబడి తనిఖీలకే పరిమితమయ్యాయి. టీడీపీ నేతల గోదాముల జోలికి మాత్రం పోవడం లేదని స్పష్టమవుతోంది. అధికార టీడీపీ నేతల గోదాములను తనిఖీ చేసి, పెద్ద ఎత్తున నిల్వ చేసిన యూరియా నిల్వలను ఒక్క చోట అయినా వెలికి తీశారా అని ఏపీ వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
 

అన్ని ఊళ్లలో అదే దుస్థితి 
నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి వచ్చిన 266 బస్తాల యూరియాను గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలే పప్పుబెల్లాల్లా పంచుకున్నారు. మిగిలిన స్టాక్‌ను స్థానిక టీడీపీ నాయకుడు రూ.430 చొప్పున అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రస్తుతం ఒక్కో రైతుకు కేవలం ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. 

⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీఏసీఎస్‌లు, ప్రైవేట్‌ ఫెర్టిలైజర్స్‌ దుకాణాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. పెడన మండలం నందమూరు విశాల సహకార పరపతి సంఘం వద్దకు అన్నదాతలు భారీగా తరలి రావడంతో పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. గన్నవరంలో ఓ ఫెర్టిలైజర్‌ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. వ్యవసాయ శాఖ కొత్తగా పెట్టిన నిబంధనల మేరకు అన్నదాతలు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్, కౌలుకార్డు వెంట తీసుకుని వచ్చారు.   

⇒ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ప్రైవేటు ఎరువుల దుకాణం వద్ద శనివారం రైతులు పడిగాపులు కాశారు. ఇక్కడ కేవలం 120 బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ వైవీ పద్మావతి, వ్యవసాయ శాఖ ఏఓను నిలదీసి ఎరువుల షాప్‌ షట్టర్‌ దించేశారు. దీంతో పంపిణీ వాయిదా పడింది.  
⇒ అనకాపల్లి జిల్లా మునగపాకలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో రైతులు పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎరువుల నిల్వలు ఏమయ్యాయో చెప్పాలని రైతులు నిలదీశారు.  

⇒ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు ఒడిశాకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు. స్థానికంగా యూరియా కొనాలంటే అదనంగా జింకు, ఇతర మందులు కొనుగోలు చేయాలంటూ డీలర్లు తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ రైతులు వాపోయారు.  
⇒ కాకినాడ జిల్లా సామర్లకోటలోని నీలమ్మ చెరువు వద్ద ఉన్న ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా పంపిణీకి టోకెన్లు పంపిణీ చేస్తుండగా తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది టోకెన్లు పంపిణీ నిలిపి వేశారు.  
⇒ ఏలూరు జిల్లాలో యూరియా కొరతే లేదని కలెక్టర్‌ ప్రకటించారు. అయితే కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న శనివారపుపేట కోఆపరేటివ్‌ సొసైటీకి శనివారం సిబ్బంది తాళాలు వేశారు.  

టీడీపీ అనుచరులకే యూరియా  
విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలోని టీడీపీ నాయకులు వీఏఏ (విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌) లేకుండానే దౌర్జన్యంగా ఆర్‌ఎస్‌కే తలుపులు తీసి తమ అనుచర వర్గానికి యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఆర్‌ఎస్‌కేకు వచ్చిన 450 యూరియా బస్తాల పంపిణీని శనివారం చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ బత్తుల జ్యోతీశ్వరరావు ఆర్‌ఎస్‌కేకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. అప్పటికే 70 శాతం మేర యూరియా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేశారు. ఎరువుల అడ్డగోలు పంపిణీపై ఏం చర్యలు తీసుకుంటారని వీఏఏ ఎం.కుసుమను సర్పంచ్‌ ప్రశ్నించారు.

గోదాం వద్దకు వెళ్తుంటే తమ్మినేని అరెస్ట్‌  
శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస రైల్వే గూడ్స్‌ గోదాం వద్ద నుంచి ఎరువులు పక్కదారి పడుతున్నాయనే సమాచారంతో శనివారం కుమారుడు చిరంజీవి నాగ్‌తో కలిసి అక్కడికి బయలుదేరిన మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వాహనాన్ని అడ్డుకుని వెనుదిరగాలని కోరారు. తమ్మినేని వెనుదిరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు ముందుకు కదలనీయలేదు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. 

అనంతరం పోలీసులు ఆయన్ను బలవంతంగా జీపు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్‌ వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావుతో మాట్లాడుతూ జిల్లాకు ఎన్ని బస్తాల ఎరువులు వచ్చాయి, ఎన్ని ఇచ్చారని ప్రశ్నించగా ఆయన కాకి లెక్కలు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. 

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలైనా ఎరువులు ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. బహిరంగ మార్కెట్‌లోనూ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో ప్రజా పోరాటం చేస్తామని ప్రకటించారు.

వ్యవసాయం చేయలేం 
ప్రస్తుతం వరి పంటకు పొటాష్‌, యూరియా చాలా అవసరం. పొటాష్‌ను పెద్దాపురంలో బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి కొనుగోలు చేశాను. కానీ యూరియా లభించడం లేదు. సొసైటీ వద్ద రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారు. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఇలాగైతే ఎలా?  
– గుణ్ణం వీర్రాజు, రైతు, సామర్లకోట  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement