సాక్షి, అమరావతి: నిర్ణీత అర్హత కలిగిన వ్యక్తులే ఆధార్ సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఆధార్ జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ధారించిన ఎన్‌ఎస్‌ఈఐటీ పరీక్ష గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ఈ ఏడాది మార్చిలోగా ఉత్తీర్ణత కాకుంటే ఆయా డిజిటల్ అసిస్టెంట్లకు తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి అందించిన ఆదేశాల మేరకు ఆయా జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు తమ పరిధిలోని ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు.
ఆయా పరీక్ష ఉత్తీర్ణత కాని వారితో పాటు అసలు పరీక్షకు హాజరు కాని వారికీ, పరీక్షకు దరఖాస్తే చేయని వారికి, పరీక్ష ఉత్తీర్ణత అయినా ఆధార్ సేవలు అందించేందుకు అయిష్టత తెలిపిన వారికీ తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులతో పాటు డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీలు ఎన్‌ఎస్‌ఈఐటీ పరీక్ష వచ్చే మార్చిలోపు తప్పనిసరిగా పాస్ కావాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డిసెంబరు 31వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాల్లో ఎంపీడీఓలకు జారీ చేసిన ఆదేశాల్లో కేవలం డిజిటల్ అసిస్టెంట్ల విషయంలోనే వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదల అంశం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


