
ఖమ్మం సహకారనగర్: ప్రతీనెల నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వారం కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా అన్ని పాఠశాలల విద్యార్థులు బ్యాగ్‌లు లేకుండానే వచ్చారు. ఈ మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్, వ్యాసరచన, కవితల పోటీలు నిర్వహించి విజేతలను అభినందించారు.
మట్టితో గణపతి ప్రతిమలు, ఆకులు, పేపర్లతో కళారూపాల తయారీ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. పుస్తకాలు లేకుండా రావడం.. రోజంతా ఆటపాటలు నిర్వహించడంతో విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. కలెక్టర్ అనుదీప్ పలు పాఠశాలల్లో కార్యక్రమాన్ని పరిశీలించడమే కాక.. కొన్ని పాఠశాలల విద్యార్థులను కలెక్టరేట్‌కు పిలిపించి కార్యాలయ కార్యకలాపాలపై అవగాహన కల్పించారు.